ఏపీ బీజేపీ సీనియర్ నేత పీవీ చలపతిరావు కన్నుమూత
విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి పీవీ చలపతిరావు పార్థీవ దేహాన్ని ఇంటికి తరలించారు.
చలపతిరావు మరణం పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన చలపతిరావు తనకు మార్గదర్శకులని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు అందించిన సేవలు చిరస్మరణీయమని సోము వీర్రాజు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో ఆనాటి జనసంఘ్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుల్లో చలపతిరావు ఒకరని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చలపతిరావు చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సోము వీర్రాజు పేర్కొన్నారు.
కాగా, చలపతిరావు కుమారుడు పీవీ మాధవ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఏపీ బీజేపీ శాసనమండలి పక్షనేతగా కొనసాగుతున్నారు. చలపతిరావు మృతితో మాధవ్ కుటుంబంలో విషాదం నెలకొంది. పలువురు బీజేపీ నేతలు సంతాపం తెలపడంతోపాటు పరామర్శించేందుకు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications