విశాఖపై వైఎస్ జగన్ తెగింపు: ప్లాన్ బీ: వారంలో మూడు రోజులు మకాం: శ్రావణమాసంలో
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల కిందట ఇచ్చిన హామీ ఇంకా నెరవేరట్లేదు. అమరావతిని న్యాయ రాజధానిగా కొనసాగిస్తూ- ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలనే ఆయన నిర్ణయానికి పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుందీ అంశం.

ఈ దశలో..
దీనికి సంబంధించిన బిల్లును సైతం రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మెరుగైన బిల్లుతో ముందుకొస్తామని వైఎస్ జగన్ నిండు అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తరువాత దీనిపై ఎలాంటి ముందడుగు పడలేదు. ఆ దిశగా వైఎస్ జగన్ కూడా చర్యలు తీసుకోలేదు. దీనితో విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా బదలాయించే విషయం తెరమరుగైనట్టేనని భావించారు. ఒకరిద్దరు మంత్రులు, ఇతర వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తరచూ ఇచ్చే హామీల వరకే ఇది పరిమితమైంది.

ఆగస్టు నుంచి..
ఇప్పట్లో మూడు రాజధానుల వ్యవహారం కార్యాచరణలోకి రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ విశాఖ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది. విశాఖపట్నంలో క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా వైఎస్ జగన్ అడుగులు వేస్తోన్నారని అంటున్నారు. ఆగస్టులో విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని రూపాంతరం చెందడం ఖాయమంటూ వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవలే తేల్చి చెప్పారు.

శ్రావణమాసంలో ముహూర్తం..
వారంలో మూడు రోజుల పాటు విశాఖపట్నంలో మకాం వేయాలని, అక్కడి నుంచే పరిపాలన సాగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలు సైతం జారీ చేశారని చెబుతున్నారు. శ్రావణమాసంలో మంచి ముహూర్తాలు ఉండటంతో విశాఖపట్నం నుంచి వారంలో మూడురోజుల పాటు పరిపాలన సాగించాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఏ రోజు నుంచి పరిపాలన సాగిస్తే బాగుంటుందనే విషయంపై విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచనలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

పూర్తిస్థాయిలో కాకున్నా..
ప్రస్తుతం మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున పూర్తిస్థాయిలో తరలించే అవకాశాలు లేవు. అదే సమయంలో వారంలో మూడు రోజుల పాటు విశాఖ నుంచి పరిపాలన సాగించడం కుదరదనే ఆంక్షలను హైకోర్టు విధించలేదు. అటు కోర్టు తీర్పును గౌరవిస్తూనే పాక్షికంగా విశాఖ నుంచి పరిపాలన సాగించాలనే నిర్ణయంలో వైఎస్ జగన్ ఉన్నారని చెబుతున్నారు. శ్రావణమాసం ముగిసే సమయానికి ఇది కార్యాచరణ రూపంలోకి రావొచ్చనే ప్రచారం ఉంది.

క్యాంప్ కార్యాలయం కోసం..
ఈలోగా క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి అనుకూలంగా ఉండే భవనాలను ఎంపిక చేయాల్సిన బాధ్యతను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అప్పగించినట్లు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి అనుకూలంగా ఉండేలా భవనాన్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. రుషికొండ సమీపంలో ఒకట్రెండు భవనాలను ఎంపిక చేశారని, దీన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేయాల్సి ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications