ఇది ప్రతిపక్షాల కుట్ర .. బెదిరింపులు నిరూపిస్తే రాజీనామా చేస్తా .. ఎలమంచిలి ఎమ్మెల్యే సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు అంటూ ఆడియో కలకలం రేపింది. అంతేకాదు అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తి అల్లుడుకి ఫోన్ చేసి బెదిరించారని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. అయితే ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న అభ్యర్థి అల్లుడికి ఫోన్ చేసి బెదిరించారని వస్తున్న వార్తలపై సదరు ఎమ్మెల్యే స్పందించారు.
నామినేషన్ విత్ డ్రా చేసుకోకుంటే జైలుకే .. ఎలమంచిలి ఎమ్మెల్యే బెదిరింపుపై పోలీసులకు ఫిర్యాదు

తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర : ఫైర్ అయిన ఎమ్మెల్యే
పంచాయతీ ఎన్నికల్లో రాంబిల్లి మండలం లాలం కోడూరు పంచాయతీ శివారు సీతాపాలెం గ్రామానికి చెందిన లాలం సంతోష్ సొంత మామ లాలం కోడూరు పంచాయతీ వార్డు సభ్యుడిగా వైసిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ జిల్లా ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు రాజు నామినేషన్ వేసిన అభ్యర్థి అల్లుడు అయిన సంతోష్ ను బెదిరించారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా ఆడియో రికార్డును అభివర్ణించిన కన్నబాబు రాజు, తాను గతంలో మాట్లాడిన మాటలను ఇప్పుడు తెరమీదకు తీసుకువచ్చారు అంటూ ఆరోపణలు గుప్పించారు.

ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా
తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేసిన ఆయన, కేవలం ఎన్నిక ఏకగ్రీవం అయితే గ్రామ అభివృద్ధి చెందుతుందని మాత్రమే సూచించానని, ఆ తర్వాత మాటలన్నీ గతంలో వివిధ సందర్భాల్లో మాట్లాడిన వాటిని కలిపి తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కన్నబాబురాజు ఆరోపణలు గుప్పించారు.
ఆడియో రికార్డింగ్ నిజం కాదని పేర్కొన్న కన్నబాబు రాజు తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే తక్షణమే పదవికి రాజీనామా చేస్తానని ప్రత్యర్థి వర్గాలకు సవాల్ విసిరారు.

కన్నబాబు రాజు బెదిరించారని ఫోన్ రికార్డింగ్ తో సహా పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
మరోవైపు కన్నబాబురాజు తమని బెదిరించాడని ఫోన్ సంభాషణ రికార్డ్ తో పాటుగా బాధితుడు రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే కేసులు పెడతామని జైలుకు పంపిస్తామని తమని బెదిరించినట్లుగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి అల్లుడు సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటుగా ఎమ్మెల్యే తాలూకా ఆడియో రికార్డింగ్ కూడా పోలీసులకు అందజేశారు.
అయితే తాను అలా అనలేదని చెప్తున్నారు ఎమ్మెల్యే కన్నబాబు రాజు.

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో రసవత్తర రాజకీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య బెదిరింపుల ఆరోపణల పర్వం కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదుల వెల్లువ గా మారాయి. ముఖ్యంగా అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు పెడుతుందని , బెదిరింపులకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక మరో పక్క ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరైనా ఎన్నికలలో ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థులను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినా, బెదిరింపులకు గురి చేసినా తక్షణమే చర్యలు ఉపక్రమిస్తుంది వైసిపి ప్రభుత్వం.