Vizag Swetha : వైజాగ్ శ్వేత కేసులో వీడిన మిస్టరీ-అసలు జరిగిందిదీ..!
వైజాగ్ లో అనుమానాస్పద స్ధితిలో బీచ్ లో లభ్యమైన ఐదునెలల గర్భిణీ శ్వేత మృతదేహం మిస్టరీ వీడింది. మూడు రోజులుగా దీనిపై దర్యాప్తు చేస్తున్న విశాఖ పోలీసులు ఎట్టకేలకు ఈ ఘటన వెనుక ఉన్న కారణాల్ని ఇవాళ వెల్లడించారు. రెండు రోజులుగా మీడియాలో పలు రకాలుగా శ్వేత మృతిపై కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో పోలీసులు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు ప్రకటించారు. పోలీసు దర్యాప్తు ప్రకారం శ్వేతది ఆత్మహత్యగానే నిర్ధారించారు.
శ్రీకాకుళం జిల్లా మూలపేటకు చెందిన శ్వేతకు విశాఖ గాజువాక స్టీల్ ప్లాంట్ నిర్వాసిత కుటుంబానికి చెందిన మణికంఠతో పెళ్లి జరిగిందని, ఆమె ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ అని పోలీసులు తెలిపారు. పదిహేను రోజుల క్రితం మణికంఠ హైదరాబాద్ కు ఆఫీసు పని మీద వెళ్లాడని, ఆ సమయంలోనే శ్వేత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అలాగే ఈ ఆత్మహత్యకు దారి తీసిన కారణాల్ని కూడా వెల్లడించారు.

శ్వేత పేరు మీద 90 సెంట్ల భూమి ఉందని, దాని కోసం భర్త మణికంఠ వేధించాడని, ఓ దశలో తన తల్లి ముందే చేయి చేసుకున్నాడని, దీంతో ఆమె గతంలోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పోలీసులు తేల్చారు. ఆ తర్వాత శ్వేత ఆడపడుచులు కూడా భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి ఆమెను వేధించేవారని, అత్తమామలు సైతం వరకట్నం కోసం వేధించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇక ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి 8.20 గంటల నుంచి 8.32 వరకూ భర్తతో ఫోన్ లో మాట్లాడిన శ్వేత.. హఠాత్తుగా ఫోన్ స్విచాఫ్ చేసి ఆత్మహత్య లేఖ రాసి బయటికి వెళ్లిపోయింది. అనంతరం బీచ్ లో నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. శ్వేత ఆత్మహత్య తర్వాత మృతదేహం లభ్యమయ్యాక జరిపిన పోస్టుమార్టంలోనూ ఆమె శరీరంపై గాయాలేవీ లేవని తేలింది. దీంతో అత్తింటి వారి వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. ఇందుకు కారణమైన అత్తమామలు, ఆడపడుచులు, భర్త మణికంఠపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications