టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కన్నుమూత: దిగ్భ్రాంతిలో పార్టీ శ్రేణులు: తీరని లోటుగా
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కరోనా బారిన పడిన ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లాలోని పెదపూడి మండలం పెద్దాడ. ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.
పార్టీ ఆవిర్భవించిన తొలి రోజుల్లోనే టీడీపీ తరఫున సామర్లకోట సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1984లో జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా పని చేశారు. క్రమంగా ఎదిగారు. 1994, 1999 నాటి సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004, 2009లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పటికీ.. ఓడిపోయారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు.

ఆ తరువాత ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. పెద్దాపురం నియోజకవర్గం టికెట్‌ను మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు కేటాయించింది టీడీపీ. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుంచుకుని శాసన మండలికి పంపించింది. 2012 నుంచి 2017 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. భాస్కర రామారావు కన్నుమూత పట్ల తెలుగుదేశం పార్టీలో విషాదఛాయలు అలముకున్నాయి. పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Recommended Video
భాస్కర రామారావు మరణం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలను చేసే నాయకుడిని టీడీపీ కోల్పోయిందని టీడీపీ అగ్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications