Infosys: విశాఖలో ఐటీ దిగ్గజం: ఆఫీస్ రెడీ: ఓపెనింగ్ ముహూర్తం ఫిక్స్
విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం.. సరికొత్త కళను సంతరించుకుంటోంది. భవిష్యత్‌లో రాష్ట్ర పరిపాలన రాజధానిగా మారబోతోందని భావిస్తోన్న ఈ నగరంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు ఒక్కటొక్కటిగా కొలువు తీరుతున్నాయి. క్రమంగా విశాఖపట్నం రాజధాని కళను పుణికిపుచ్చుకుంటోంది. ఈ సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైజాగ్ నుంచి పరిపాలన సాగించే అవకాశం ఉంది.
కొద్దిరోజుల కిందటే వైఎస్ జగన్- విశాఖలో అదాని డేటా సెంటర్‌కు భూమిపూజ చేశారు. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ డేటా సెంటర్‌ను నెలకొల్పనున్నాయి. 21,800 కోట్ల రూపాయలతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. దీనివల్ల 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇది. నిర్మాణ పనులు సైతం ఆరంభం అయ్యాయి.

అదే సమయంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా విశాఖపట్నం కేంద్రంగా తన కార్యకలాపాలను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇన్ఫోసిస్ కార్యాలయ భవనం నిర్మాణ పూర్తయింది. ఇంటీరియర్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కార్యాలయ భవనంపై ఇన్ఫోసిస్ లోగోను కూడా ఏర్పాటయింది. ఈ నెల 31వ తేదీన వైజాగ్‌లో తమ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.
రుషికొండ సమీపంలోని ఐటీ సెజ్‌లో ఈ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటైంది. తొలిదశలో 650 మంది ఉద్యోగులతో ఈ సంస్థ తన కార్యకలాపాలను మొదలుపెట్టనుంది. క్రమంగా దీన్ని విస్తరించుకుంటుంది. రుషికొండ ఐటీ సెజ్‌లోని సిగ్నేచర్ టవర్స్‌లో ఇన్ఫోసిస్ కార్యాలయ భవనం తుదిరూపు దిద్దుకుంటోంది. వైజాగ్‌తో పాటు కోయంబత్తూర్, నోయిడా, కోల్‌కత, హుబ్లీ, ముంబైలల్లో అదే రోజున ఇన్ఫోసిస్ కొత్త శాఖలు ఏర్పాటు కానున్నాయి.

బీచ్ ఐటీని ప్రోత్సహించే ఉద్దేశంతో పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలు తీర ప్రాంత నగరాల్లో తమ కొత్త శాఖలను నెలకొల్పడానికి ఆసక్తి చూపుతోన్నాయి. భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ వంటి ఐటీ కంపెనీలు విశాఖపట్నం నుంచే కార్యకలాపాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోన్నాయి. విశాఖ ఇన్ఫోసిస్‌లో పని చేసే 650 మంది ఉద్యోగుల్లో అధిక శాతం ఏపీకి చెందినవారే ఉన్నారు.












Click it and Unblock the Notifications