Vizag Steel plant: కేంద్రం మరో కీలక నిర్ణయం
విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైన నేపథ్యంలో- కేంద్రం మరో అడుగు ముందుకు వేసింది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ బిడ్స్‌ను దాఖలు చేయడానికి విధించిన గడువును పొడిగించింది.
ఆశించిన స్థాయిలో బిడ్స్ దాఖలు కాకపోవడం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను దాఖలు చేయడానికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఇంకా ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనేలా చేయడానికే ఈ నిర్ణయం తీసుకుంది ఆర్ఐఎన్ఎల్.

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. దీన్ని ప్రైవేటుపరం చేయట్లేదంటూ స్వయంగా కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రకటించిన వెంటనే ఆ మంత్రిత్వ శాఖ సమగ్రమైన వివరణ ఇచ్చింది. ఆయన చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియను కొనసాగిస్తోన్నామని తెలిపింది.
ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయని, వాటికి వివరణ ఇస్తోన్నామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ స్టీల్ ఫ్యాక్టరీని తమ తరఫు నుంచి మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది.
ఇప్పుడు తాజాగా- ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌లో మరింత మంది బిడ్డర్లు పాల్గొనేలా వెసలుబాటును కల్పించింది. ఇవ్వాళ ముగియాల్సి ఉన్న గడువును మరో అయిదురోజుల పాటు అంటే ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. ఇదే సమాచారాన్ని అటు తెలంగాణలోని సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కూడా తెలియజేసింది. గడువు పొడిగించినట్లు వివరించింది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈఓఐలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సింగరేణి క్యాలరీస్ పాల్గొనాలని నిర్ణయించింది. ఈఓఐ బిడ్స్‌ను దాఖలు చేయడానికి ఇవ్వాళ మధ్యాహ్నం 3 గంటలకు గడువు ముగియాల్సి ఉండగా.. సాయంత్రం 5:30 వరకు సమయం కావాలని సింగరేణి క్యాలరీస్ అధికారులు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
దీనికి ఆర్ఐఎన్ఎల్ సానుకూలంగా స్పందించింది. గడువును ఏకంగా అయిదు రోజుల పాటు పొడిగించింది. ఈ ఈఓఐలో మొత్తం ఆరు అంతర్జాతీయ ఉక్కు ఎగుమతిదారులు, స్టీల్ తయారీ కంపెనీల యాజమానులు బిడ్స్‌ను దాఖలు చేశారు. ఉక్రెయిన్‌కు చెందిన ఓ స్టీల్ తయారీ కంపెనీ కూడా బిడ్స్ దాఖలు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications