భార్య మృతదేహాన్ని భుజాన మోస్తూ కిలోమీటర్ల కొద్దీ కాలినడక: విజయనగరంలో..!!
భార్య మృతదేహాన్ని మోస్తూ విశాఖపట్నం నుంచి ఒడిశాలోని కోరాపుట్ కు బయలుదేరిన వ్యక్తికి మానవతాదృక్పథంతో అంబులెన్స్ సమకూర్చిన విజయనగరం జిల్లా పోలీసులు.
విజయనగరం: విజయనగరం జిల్లా పోలీసులు మానవత్వాన్ని ప్రదర్శించారు. అనారోగ్యంతో మరణించిన భార్య మృతదేహాన్ని భుజాన మోస్తూ తన స్వస్థలం ఒడిశాలోని కోరాపుట్ జిల్లా అంబపల్లికి బయలుదేరిన ఓ వ్యక్తికి అంబులెన్స్ ను సమకూర్చారు. దానికి అయ్యే ఖర్చును సొంతంగా భరించారు. విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఇది.
ఆ వ్యక్తి పేరు ఈడె సాములు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ పరిధిలోని అంబపల్లి ఆయన స్వగ్రామం. ఆయన భార్య ఈడే గురు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండేది. చికిత్స కోసం విశాఖపట్నం జిల్లా సంగివలసలోని అనిల్ నీరుకొండ వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆరోగ్య పరిస్థితి చేయి దాటడంతో డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు.

ట్రీట్ మెంట్ కు ఆమె స్పందించట్లేదని, ఊరికి తీసుకెళ్లాలని డాక్టర్లు ఈడె సాములుకు సూచించారు. దీనితో అతను ఆటోలో భార్యను తీసుకొని విజయనగరానికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఆటోలోనే ఈడె గురు మరణించారు. ఆటో డ్రైవర్ వారిని మార్గమధ్యలోనే దించేశాడు. భార్య మృతదేహాన్ని కోరాపుట్ కు తీసుకెళ్లడానికి సహకరించాలని, ఆర్థిక సహాయం చేయాలని స్థానికులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎవరూ ముందుకురాలేదు.

చేసేదేమీ లేక ఈడే సాములు భార్య మృతదేహాన్ని భుజం మీద వేసుకొని, కాలి నడకన కోరాపుట్ కు బయలుదేరాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే విజయనగరం రూరల్ సీఐ తిరుపతిరావు, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్ ఈడే సాములును కలిశారు.

విషయం తెలుసుకొని ఒడిశాలో గల అతని బంధువులతో ఫోనులో మాట్లాడారు. వారి విజ్ఞప్తి మేరకు తిరుపతిరావు అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి పంపించారు. ఇలాంటి సంఘటనే 2016లోనూ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఒడిశాలోని భవానీపట్నలో జరిగిన సంఘటన.. అంతర్జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది.
కన్నీరు పెట్టుకుంటోన్న కూతురి చెయ్యి పట్టుకుని దానా మాఝీ అనే వ్యక్తి తన భార్య మృతదేహాన్ని భుజాలపై మోస్తూ 10 కిలోమీటర్ల పాటు కాలినడకన వెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఒడిశా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసిన ఘటన అది.












Click it and Unblock the Notifications