ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్: ఏపీ జవాన్లు వీరమరణం: రూ.30 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన జగన్
అమరావతి: ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో శనివారం చోటు చేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో 24 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఒకరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్ కోబ్రా కమాండర్ శాఖమూరి మురళీకృష్ణ, విజయనగరం గాజులరేగకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాను రౌతు జగదీశ్ ఉన్నారు. వీర మరణం పొందిన రౌతు జగదీశ్‌కు విజయనగరం వాసులు ఘనంగా నివాళులు అర్పించారు. జాతీయ పతాకంతో విజయనగరంలో ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు.
గాజులరేగలో నివసించే రౌతు సింహాచలం, రమణమ్మ దంపతుల కుమారుడు జగదీశ్. ఆయనకు ఇటీవలే పెళ్లి కుదిరింది. వచ్చేనెల 22 తేదీన పెళ్లి వేడుకలను నిర్వహించాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. దీనికోసం జగదీష్ ఈ నెల 15వ తేదీన విజయనగరానికి బయలుదేరి వెళ్లాల్సి ఉంది. అంతలోపే ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందారు. 2010లో ఆయన సీఆర్‌పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యారు. మావోయిస్టులను ఏరివేయడానికి ఏర్పాటు చేసిన కోబ్రా వింగ్‌లో చేరారు. ఇదే ఎన్‌కౌంటర్‌లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్ కోబ్రా కమాండర్ శాఖమూరి మురళీకృష్ణ అమరులయ్యారు.

రౌతు జగదీశ్, శాఖమూరి మురళీకృష్ణ వీరమరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్.. ఆ రెండు కుటుంబాలకు భారీ ఎత్తున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి 30 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఈ తెలుగువీరుల కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, తక్షణ ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications