విజయనగరం యువతి స్టోరీ ఫేక్- కాళ్లూ చేతులు కట్టేసుకుని- అంతా నాటకం
విజయనగరంలో రెండు రోజుల క్రితం ఓ 20 ఏళ్ల యువతి కాళ్లూ చేతులు కట్టేసి పడి ఉన్న ఘటన చర్చనీయాంశంగా మారింది. పట్టపగలే కాలేజీకి వెళ్లిన విద్యార్ధి కాళ్లూ, చేతులు కట్టేసి ఉండటంతో స్ధానికులు కాపాడారు. పోలీసుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలిశాయి. దీంతో వారు షాకయ్యారు.
విజయనగరం జిల్లాలో సంచలనం రేపిన యువతికి కాళ్లు చేతులు కట్టి పడేసిన ఘటనలో మిస్టరీ వీడింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు యువతిని తమదైన శైలిలో ప్రశ్నించారు. తొలుత అపస్మారక స్ధితిలో ఉండటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన పోలీసులు.. ఆ తర్వాత విచారణ ప్రారంభించారు. ఇందులో అసలు విషయం బయటపడింది. తానే కాళ్లూ చేతులు కట్టేసుకుని ఈ నాటకం ఆడినట్లు యువతి రమ పోలీసులకు చెప్పేసింది.

కాలేజి నుంచి ఇంటికి రాకుండా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ఈ యువతి.. విషయం ఇంట్లో తెలిసిపోతుందనే భయంతో నాటకానికి వ్యూహం పన్నింది. కుటుంబసభ్యులను నమ్మించేందుకు తనకు తానే కాళ్లూ, చేతులు కట్టేసుకుని అపస్మారక స్ధితిలో పడి ఉన్నట్లు నమ్మించింది. చివరికి పోలీసులు తమదైన శైలిలో పశ్నించేసరికి నిజాన్ని బయటపెట్టేసింది.
దీంతో పోలీసులు కూడా షాకయ్యారు. అసలే మహిళల భద్రతపై రోజుకో తరహాలో విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇలాంటి ఫేక్ కేసు బయట పడటంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు వివరాలను విజయనగరం ఎస్పీ రాజకుమారి ప్రెస్‌నోట్ ద్వారా తెలిపారు. తాజాగా హైదరాబాద్‌లోనూ ఇలాగే ఓ బీ ఫార్మసీ యువతి తాను కిడ్నాప్ అయినట్లు డ్రామా ఆడి ఆ తర్వాత అదంతా ఫేక్ అని పోలీసులకు తెలిసిపోవడంతో చివరికి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడింది.












Click it and Unblock the Notifications