ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హతమార్చింది: సోదరుడి ఫిర్యాదుతో కుట్ర వెలుగులోకి
వరంగల్: గ్రామీణ జిల్లాలోని నెక్కొండ మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత కట్టుకున్న భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరిపి బాధితుడి భార్యతోపాటు ఆమె ప్రియుడ్ని కటకటాల వెనక్కి నెట్టారు.

యువకుడి ప్రేమలో ఇద్దరు పిల్లల తల్లి..
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గేటుపల్లి తండాకు చెందిన దర్యావత్ సింగ్(42) హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతనికి మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లికి చెందిన జ్యోతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా నెక్కొండ మండల కేంద్రంలో ఉంటున్నారు. కాగా, జ్యోతికి అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన సాంబరాజు అనే యువకుడితో పరిచయమైంది. ఆ తర్వాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది.

ప్రియుడి కోసం భర్తను హతమార్చేందుకు కుట్ర
ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. కరోనా కారణంగా దర్యవాత్ సింగ్ గత కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో ప్రియుడ్ని కలవడానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో భర్తను హతమార్చేందుకు కుట్రపన్నింది జ్యోతి.

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఇల్లాలు..
ఈ క్రమంలో సెప్టెంబర్ 14న భర్త మద్యం తాగి ఉన్నాడని, అతడ్ని చంపడానికి ఇదే సరైన సమయమని జ్యోతి భావించింది. వెంటనే తన ప్రియుడు సాంబరాజుకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి దర్యావత్ సింగ్ గొంతుకు తాడి బిగించి ఊపిరాడకుండా చేసి హతమర్చారు. ఆ తర్వాత సాంబరాజు తీసుకొచ్చిన ట్రాలీ ఆటోలో దర్యావత్ సింగ్ మృతదేహాన్ని తన పత్తి చేనుకు తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
Recommended Video

సోదరుడి ఫిర్యాదుతో.. జ్యోతి, ఆమె ప్రియుడు కటకటాల్లోకి..
అయితే, ఆ మరుసటి రోజు వెళ్లి చూడగా.. దర్యావత్ సింగ్ మృతదేహం సగమే కాలింది. దీంతో ఆ రాత్రి మృతదేహాన్ని పూర్తిగా కాల్చేసి బూడద తీసుకెళ్లి చెరువులో పారబోశాడు. కాగా, దర్యావత్ సింగ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు వీరన్న సెప్టెంబర్ 21న నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు జరిపిన పోలీసులు.. జ్యోతి అనుమానంతో ఆమె కాల్ డేటాను పరిశీలించారు. ఆమెను అదుపులోకి తమదైన శైలిలో విచారించగా.. ప్రియుడితో కలిసి భర్తను చంపినట్లు అంగీకరించింది. దీంతో నిందితులు జ్యోతితోపాటు సాంబరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కాగా, తల్లిదండ్రులు దూరం కావడంతో ఇద్దరు పిల్లలు అనాథులుగా మారిపోయారు.












Click it and Unblock the Notifications