టీడీపీ మాజీ ఎంపీ కుమారుడు ఆత్మహత్యాయత్నం?: ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై
ఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు లోక్‌సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ఏలూరులోని తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మాగంటి రాంజీ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. స్పృహ తప్పిన స్థితిలో ఆయనను గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు.
అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఊపిరి పీల్చుకోవడం కష్టతరమైన నేపథ్యంలో ఆయనకు వెంటిలేటర్‌ను అమర్చినట్లు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారనే ప్రచారం ఉంది. మాగంటి రాంజీ ఆత్మహత్య యత్నానికి ఎందుకు పాల్పడ్డారనడానికి కారణాలు తెలియరావట్లేదు. ఈ సమాచారం అందిన వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లో్కేష్.. మాగంటి బాబుకు ఫోన్ చేశారు. ఆయనను పరామర్శించారు.

తండ్రి తరహాలోనే మాగంటి రాంజీ.. రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో ఆయన చేరారు. రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటోన్నారు. టీడీపీ ఏలూరు నగర విభాగాన్ని ఆయనే పర్యవేక్షిస్తోన్నారు. యువతను పార్టీ వైపు ఆకర్షితులను చేయడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోన్నారు. పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేస్తోన్నారు. రాజకీయంగా ఎదుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాగంటి రాంజీ హఠాత్తుగా ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డారనేది తెలియరావట్లేదు.












Click it and Unblock the Notifications