వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా గడ్డపై కూచిపూడి

By Staff
|
Google Oneindia TeluguNews


తెలుగువారి నృత్య కళాకేతనాన్ని ఖండాంతరాల్లో ఎగురవేసిన కూచిపూడి నాట్యం అమెరికాలో తొలి అంతర్జాతీయ ఉత్సవానికి సిద్ధమవుతోంది. అమెరికాలోని తెలుగు సాహితీ, సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తి సిలికానాంధ్ర, రాష్ట్ర సాంస్కృతిక శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో కాలిఫోర్నియా రాష్ట్రం కూపర్టినో నగరంలోని ప్లింట్ సెంటరులో 2008 జూన్ 20, 21, 22 తేదీల్లో ప్రప్రథమ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరుగుతుంది.

కూచిపూడి నాట్య కళకు జన్మస్థలమైన ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి యావత్ ప్రపంచం నుంచి సుమారు 2000 మంది నర్తకీనర్తకులు, నాట్యాచార్యులు, నాట్యకళావేత్తలు, అధ్యాపకులు, ఇతర ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు తెలుగు సంస్కృతికి నుదుటి తిలకమై భాసిస్తున్న కూచిపూడి నాట్య కళాప్రదర్శనలు, దేశవిదేశాల్లోని నాట్య కళాకారులకు శిక్షణా శిబిరాలు, వివిధ అంశాలపై సదస్సులు, చర్చా గోష్టులు, పోటీలు నిర్వహిస్తారు.

ఇకపై ప్రతి రెండేళ్లకో సారి అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం జరపాలని సిలికానాంధ్ర సంకల్పిస్తోంది. కూచిపూడి నృత్య మంజరి పేరుతో సిలికానాంధ్ర వారి సుజన రంజని పత్రిక ప్రత్యేక సంచికను వెలువరించి కూచిపూడిపై పరిశోధనాత్మక వ్యాసాలను సంకలనం చేయాలని నిర్ణయించింది.

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు, విదేశీయులు సైతం తమ పిల్లలకు ఈ నాట్యాన్ని నేర్పించడం ద్వారా తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చెయ్యడం, తెలుగువారి కళకు ప్రాచుర్యం కలిగించడం, కళాకారులను ప్రోత్సహించడం సమ్మేళనం లక్ష్యం. అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం నిర్వాహక సంఘం గౌరవాధ్యక్షులుగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి మండలి బుద్ధప్రసాద్ వ్యవహరిస్తారు. సాంస్కృతిక శార సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డా. ఆవుల మంజులత, సిలికానాంధ్ర అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ నిర్వహణ బాధ్యతలు వహిస్తారు.

ఈ నాట్య సమ్మేళనం ద్వారా కూచిపూడిని ప్రపంచపటంలో ప్రముఖంగా నిలపాలన్నదే తమ ప్రధాన ఉద్దేశ్యమని కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ఇప్పటికే కాలిఫోర్నియాలో ఉత్సవానికి ఏర్పాట్లు ప్రారంభించామని, సిలికానాంధ్ర పక్షాన రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయించామని, దీనికి తోడు సాంస్కృతిక శాఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తమ వంతు సహకారాన్ని అందించేందుకు ముందుకు వచ్చాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X