తెలంగాణ ఎన్నారై సదస్సు
న్యూజెర్సీలో ఆటా ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సదస్సు జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. బిజెపికి చెందిన బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, రాజేశ్వరరావు, ఝాన్సీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా మాట్లాడారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రెండు విభజిస్తామని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల ఆకాంక్ష అని, ఈ ఆకాంక్షను నెరవేర్చడం తప్ప కాంగ్రెసుకు మరో మార్గం లేదని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధయాష్కీ అన్నారు. కాంగ్రెస్ సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.
తాను తెలుగుదేశం పార్టీలోనే ఉండి తెలంగాణ కోసం పనిచేస్తానని, తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పిందని పార్లమెంటు సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెలంగాణ ఎన్నారైల, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా తాను నడుచుకోలేనని ఆయన చెప్పారు. తమ పార్టీ వేసిన కమీటి తెలంగాణపై నిర్ణయం తీసుకునే వరకు చూడాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.తమ ఫోరం ఏ రాజకీయ పార్టీని కూడా సమర్థించదని, తెలంగాణ కోసం పోరాడే వారి సరసన ఉంటుందని అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టిడిఎఫ్) ప్రధాన కార్యదర్శి విప్లవ్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం అన్ని శక్తులు ఏకమవుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications