డల్లాస్: అమెరికాలో నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్ ప్రదర్శించిన డ్యాన్స్ బాలె ఆహూతులందరినీ ఆనంద లోకాలకు తీసుకువెళ్ళింది. నంవంబర్ 21 శనివారం డల్లాస్ లో కన్నుల పండువగా జరిగిన ఈ నృత్య బాలె కార్యక్రమానికి తానా, టాన్ టెక్స్ సంస్థలు సహ సమర్పకులుగా వ్యవహరించాయి. శ్రీలత సూరి ఆధ్వర్యంలో డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు ప్రసిద్ధ భారతీయ సన్యాసిని 'మీరా' ప్రదర్శించిన శ్రీకృష్ణ భక్తి అంశానికి మరోసారి ప్రాణ ప్రతిష్ట చేశారు. భారతీయ శాస్త్రీయ కూచిపూడి నృత్య రీతిలో జరిగిన ఈ బాలెను దండిభొట్ల నారాయణమూర్తి రచించారు. దండిభొట్ల వెంకట శ్రీనివాస శాస్త్రి మధురమైన సంగీతాన్ని సమకూర్చారు. జైకిషోర్ మొసలికంటి, శ్రీలత సూరి నృత్య దర్శకత్వం వహించారు. ఈ ప్రదర్శన ద్వారా వసూలైన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన వరద కారణంగా బాధితులైన వారి సహాయార్థం అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు.
మీరా డ్యాన్స్ బాలెను శంకరమంచి నాగేంద్ర ప్రసాద్ శర్మ వేదమంత్రోచ్ఛాటనల మధ్య డాక్టర్ సంధ్యావందనం లక్ష్మీదేవి ప్రారంభించారు. తానా కార్యనిర్వాహక వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూర, టాన్ టెక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పాల్గొన్నారు. సిటీ ఆఫ్ గార్లెండ్ మేయర్ రోనాల్డ్ జోన్స్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్యానికి విశేష సేవలందించడమే కాకుండా డ్యాన్స్ బాలెల ద్వారా సమాజ ప్రయోజనం కోసం కృషిచేస్తున్న శ్రీలత సూరికి మేయర్ రోనాల్డ్ 'నాట్య మయూరి' బిరుదును ప్రదానం చేశారు. డ్యాన్స్ బాలె కార్యక్రమం ప్రారంభంలో ప్రార్థన అంశంగా సంహిత బండారు, శ్రీరాగిణి ఘంటసాల, నేహ చెరుకు, వాత్సల్య సేనాపతి, సుమన్ వడ్లమాని, మిథిల వడ్డి, నాగరాణి కామరపు, శ్రీచరణ్ నవులూరి గణపతి నృత్యాన్ని ప్రదర్శించారు.