అమెరికాలో తెలుగు కథ తీరుతెన్నులు

NRI
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 43 వ సదస్సు ఆదివారం, ఫిబ్రవరి 20 వ తేదీ స్థానిక రుచి పాలస్, కేరొల్టన్ లో మల్లవరపు అనంత్ అధ్యక్షతన జరిగింది. డల్లాస్ ప్రాంత భాషాభిమానులు, సాహితీ ప్రియులు అత్యంత ఆసక్తి తో ఈ సమావేశానికి విచ్చేసారు. బాలలు ఆలపించిన గీతాలతో, చిన్నారి శ్రియ పద్య పఠనంతొ కార్యక్రమం ప్రారంభమైంది. కాజా సురేశ్, ప్రపంచకప్ క్రికెట్ లో భారత జట్టు గెలుపుకోరి చదివిన 'భళిర మనజట్టు" సీస పద్యం:

బలిహారి చెలరేగ బలి గారే బౌలర్లు?
భళిర 'టెండుల్కరు' బ్యాటు చుండ
వాహవ్వ బహుబాగు 'సెహవాగు' బాదుడు
సైదోడు 'గంభీరు' 'సచిను'లుండ
'యువి కోహ్లి రాయిణా యూసఫులు' కెరల
వరదలై పరుగులు పారు చుండ
'ఖాను శ్రీ సింగులు' కట్టడి చేయంగ
సారధియై 'ధోని' సాకు చుండ
అడ్డ మెవ్వరు మనకు సౌతాఫ్రికాలు,
లంక, ఆసీలు, పిచ్చులా? వంకలేని
జట్టు విశ్వవిజేతయై జనులు మెచ్చ
వెలగ వలెనని ప్రార్థించె తెలుగుయాంకి - సభికులకు అహ్లాదాన్నిచ్చింది. తరువాత నసీమ్ షేక్ చెరబండరాజు కవితను చదివి వినిపించారు.

సమావేశానికి అతిథిగా వచ్చిన హైదరాబాద్ అభ్యుదయ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బ్రాహ్మణపల్లి జయరాములు ప్రవరాఖ్యుడి ఉన్నత వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ మనుచరిత్రలో పద్యాలు ఉదహరిస్తూ ప్రవరుడు అందగాడు, ఆస్తిపరుడు, విద్యాదాత, కన్నవారిని శ్రద్ధగా సేవించేవాడు, నిత్యాగ్నిహోత్రుడు, అభిమానవంతుడు, వరూధినిని తిరస్కరించిన శీలవంతుడు అని సభికులకు తెలియచేసారు.

కవి చౌడప్ప చాటువు 'పెద్దన వలె కృతిసెప్పిన పెద్దన వలె" ఉదహరించి అల్లసాని పెద్దనను కొనియాడారు. తేనీటివిరామం అనంతరం ముఖ్య అతిథి శ్రీమతి నిడదవోలు మాలతిగారిని నసీమ్ షేక్ సభకు పరిచయం చేస్తూరచయిత్రిగా, అమెరికాలో తెలుగు బోధకురాలిగా, 'తూలిక" తెలుగు, ఇంగ్లీషు బ్లాగ్ నిర్వాహకురాలిగా, గ్రంథకర్తగా అయిదున్నర దశాబ్దాలుగా మాలతిగారు చేస్తున్న సాహిత్య సేవ ప్రస్తావించారు.

తరువాత 'తెలుగు కథ – తీరు తెన్నులు" అనే అంశం పై ముఖ్య అతిథి ప్రసంగం కొనసాగింది. ఆంగ్ల లాక్షణికులు కథకు చెప్పిన నిర్వచనంతో ప్రారంభించి శ్రీమతి మాలతి, ఆథునికులు కథలుగా పరిగణించని జానపద కథలుకూడా కథలేననీ, పైశాచీ భాష లో గుణాఢ్యుడు వ్రాసిన బృహత్కథ, తదనంతరం వచ్చిన గాథాసప్తశతి, కథాసరిత్సాగరం, మొదలైనవాటిని ప్రస్తావించారు. ప్రాచీన భారతీయ లాక్షణికులు 'భయానకం, సుఖతరం, గర్భేచ కరుణోరసం" అనీ, ఇంకా ఎన్నో విధాల కథలను నిర్వచించారనీ, కావ్యాలకు భిన్నంగా కథల్లో వర్ణనలకు అవకాశం తక్కువ అనీ, నీతి కథలు, వినోదాత్మక కథలు ప్రాచీన కథల్లో ఎక్కువ ఉండేవనీ చెప్పారు.

ఆథునిక కథ తెలుగులో ముద్రణా సౌకర్యం వచ్చిన తరువాత ఊపిరి పోసుకుందనీ వీరేశలింగం ఆథునిక కథావిర్భావానికి దోహదం చేసారనీ అభిప్రాయపడ్డారు. బండారు అచ్చమాంబ వ్రాసిన 'ధనత్రయోదశి", గురజాడ 'దిద్దుబాటు" మొదలైన కథల్లో, చలం సాహిత్యంలో స్త్రీపాత్రల గురించి, అలాగే, లత 'గాలిపడగలు- నీటిబుడగలు" నవల, 80ల్లో వచ్చిన స్త్రీవాద సాహిత్యం ఎలా స్త్రీల పాత్రలను చిత్రించిందో తెలిపారు. చివరగా భాషలో గ్రాంథికం, శిష్టవ్యావహారికం, మాండలికం మొదలైన మార్పులను సమీక్షించి శ్రీమతి నిడదవోలు మాలతి తన ప్రసంగాన్ని ముగించారు. ఆఖరుగా సాహిత్య వేదిక సమన్వయ కర్త మల్లవరపు అనంత్ రుచి పాలస్ యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలియ జేసి సభ ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+