అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొంతమంది భారతీయులకు మోసపూరితంగా హెచ్-1బీ వీసాలు ఇప్పించేందుకు యత్నించిన భారతీయ వ్యాపారవేత్త కటకటాల పాలయ్యారు. ఈ వ్యవహారంలో భర్తీ చేసేందుకు ఉద్యోగాలే లేకున్నా వీసాలకు యత్నించడం గమనార్హం. హై టెక్నాలజీ ఉద్యోగ వీసాలు పొందే నిమిత్తం తప్పుడు నివేదికలు సమర్పించిన చెన్నుపాటి శ్రీనివాస(33)కు ఆరునెలల జైలు శిక్ష, మూడేళ్లపాటు ఆంక్షలతో కూడిన విడుదలను శిక్షగా విధించినట్లు న్యాయశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీనివాస సమర్పించిన 11 దరఖాస్తుల్లో ఒక్కదానికి కూడా వర్క్ వీసా మంజూరు చేయలేదని స్పష్టం చేసింది. శ్రీనివాస నిరుడు డిసెంబరులో వీసా కుంభకోణంలో తన నేరాన్ని అంగీకరించారు.