డల్లాస్ సభలో సంగీతంలో సాహిత్యం

Literacy program in Dallas
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 59 వ సదస్సు, జూన్ 17 ఆదివారం నాడు రిచర్డసన్ లోని ఐఎఎన్‌టి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి, సాహిత్య వేదిక సమన్వయకర్త జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. డల్లాస్ ప్రాంత తెలుగుభాషాభిమానులు, సంగీతసాహిత్య ప్రియులు అత్యంత ఆసక్తి తోఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముందుగా ముఖ్యఅతిథి తిరుమల పెనుగొండ చక్రపాణిని మద్దుకూరి చంద్రహాస్ సభకు పరిచయం చేస్తూ చక్రపాణి ప్రథమంగా మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ శిష్యులని, మహా విద్వాంసులైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం వంటివారిదగ్గర తన విద్యకు మెరుగులు దిద్దుకున్నారనీ, పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి తంజావూరి సంగీత శైలి వారసత్వాన్ని అంది పుచ్చుకున్నారనీ, స్వయంగా సుమారు 125 అన్నమాచార్య కీర్తనలకు సంగీతం కూర్చి తిరుమల తిరుపతిదేవస్థానం వారికి సమర్పించారనీ, ఆయనతో మాట్లాడితే సంగీత సాహిత్యాల విషయంలో ఎన్నో విషయాలు తెలుస్తాయనీ చెప్పి, చక్రపాణిని వేదికమీదకు ఆహ్వానించారు. పులిగండ్ల శాంత, దమ్మన్న గీత చక్రపాణిగారికి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.

తరువాత చక్రపాణి "సంగీతంలో సాహిత్యం" అనే అంశంపై సభనుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం కర్నాటక సంగీతం అని పిలవబడేది ఒకప్పుడు దాక్షిణాత్య సంగీతమని వ్యవహరించబడేది అని, అది వస్తుతః తెలుగువారిదేనని, సంగీత మూర్తిత్రయం అయిన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి తెలుగువారేనని, వారితోపాటు ఈ సంగీతాన్ని పోషించిన దేవదాసీలు తెలుగువారేనని, తంజావూరు ప్రాంతంలో వర్ధిల్లింది కాబట్టి అదే ప్రస్తుతం తంజావూరు బాణీగా వ్యవహరించబడుతోదనీ చెప్పారు.

ఇప్పటికీ తంజావూరు ప్రాంతంలోని మేలత్తూరు భాగవతులమేళం అంతా తెలుగులో జరుగుతుందనీ, అక్కడివారు తాము తెలుగువారిగానే చెప్పుకుంటారనీ అన్నారు. తెలుగుభాష అంత సంగీతానికి అనువైన భాష వేరే లేదనీ, ఈ విషయాలన్నీ తెలుగువారికి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందనీ అన్నారు. ఏ సంగీతం నేర్చుకుంటే మరే సంగీతం నేర్చుకోవాలనే కోరికగాని అవసరముగాని ఉండదో అదే కర్ణాటక సంగీతమని నిర్వచించారు. త్యాగరాజ కీర్తనలలో భావానికి అంత ఎక్కువ ప్రాధాన్యత ఉండదనే అపప్రథ ప్రజలలో ఉన్నదని, అది తప్పు అని చెప్పారు.

భావం లేక పోవటం కాదు, పాడేవానిలోని లోపం వల్ల ఆ భావాన్ని పలికించలేకపోవచ్చునని అభిప్రాయపడ్డారు. భాషతో చెప్పలేని భావాన్ని సంగీతముతో పలికించ వచ్చు, భాష అంతమైన చోటునుంచి సంగీతం మొదలవుతుందని సభికులకు వివరించారు. అనంతమైన భావాన్ని వ్యక్తపరచటం మాటలకు కుదరదని, అందుకు ఉదాహరణగా ఎన్నో త్యాగరాజ కీర్తనలను రాగయుక్తంగాను, కర్ణసుభగంగాను ఆలాపించి ఆయాకీర్తనలలోని లోతైన భావాలను సభికులకు వివరించారు. అలాగే సంగీతము ఎలా నేర్చుకోవాలి, సంగీత విద్వాంసునికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి తదితర విషయాలను సభికులతో పంచుకున్నారు.

సంగీతపరంగా మూడు వందల సంవత్సరాల పాటు స్తబ్ధంగా ఉన్న తెలుగువారు ఒక ‘శంకరాభరణం' సినిమా ద్వారా మళ్లీ మరోఅడుగు ముందుకువేసారని, అలాగే ఆ స్ఫూర్తిని, సంగీతం పట్ల అనురక్తిని, కొనసాగించే బాధ్యత తెలుగువారిదందరిదీ అని అభిప్రాయపడ్డారు. ఆ బృహత్కార్యంలో తనవంతుగా ఏమైనా చేయటానికి సంసిద్ధమేనని సభాముఖంగా తెలియజేసారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు దమ్మన్నగీత, కార్యదర్శి డా.ఊరిమిండి నరసింహా రెడ్డి ఈ సదస్సులో ప్రసంగం గావించిన ముఖ్య అతిథి శ్రీ టి.పి. చక్రపాణిని దుశ్శాలువతో సత్కరించారు. సాహిత్య వేదిక సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కాజ సురేష్, శ్రీ మల్లవరపు అనంత్, డా. జువ్వాడి రమణ, డా.ఊరిమిండి నరసింహా రెడ్డి, బిల్లా ప్రవీణ్ ముఖ్య అతిథికి జ్ఞాపికను సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది.

ఈ కార్యక్రమానికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఉత్తరాధ్యక్షుడు శ్రీ మండువ సురేష్, కార్య నిర్వాహక సభ్యులు శ్రీ వేములపల్లి పూర్ణచంద్ర రావు, జుజారే రాజేశ్వరి, వనం జ్యోతి, వీర్నపు చినసత్యం, చామకూర బాల్కి, చిట్టిమల్ల రఘు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+