వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు భాషకు పట్టాభిషేకం

By Pratap
|
Google Oneindia TeluguNews

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" పంచమ వార్షికోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. డల్లాస్ ప్రాంతీయ తెలుగు భాషాభి మానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో స్థానిక ట్రినిటీ హైస్కూల్ లో సమావేశమయ్యారు. చిన్నారులు ఆలాపించిన "మాతెలుగు తల్లికి మల్లెపూదండ" ప్రార్థనా గీతం అనంతరం జ్యోతి ప్రజ్వలన తో టాంటెక్స్ సంయుక్త కార్యదర్శి, తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త జొన్నలగడ్డ సుబ్రమణ్యం అధ్యక్షతన పంచమ వార్షికోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి.

TANTEX - Telugu Sahitya Vedika program

ఈ సంబరాలలో సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు మల్లవరపు అనంత్ , డాక్టర్ జువ్వాడి రమణ, మద్దుకూరి విజయ చంద్రహాస్, కాజ సురేష్ , బిల్లా ప్రవీణ్, డా. ఊరిమిండి నరసింహరెడ్డి చురుకుగా పాల్గొన్నారు. టాంటెక్స్ అధ్యక్షులు గీత దమ్మన్న తమ సందేశంలో" భాష, సాహిత్య పరిజ్ఞానం మనిషి వ్యక్తిత్వాన్ని ఇనుమడింప చేస్తుందని, జీవితాన్ని వివిధ కోణాలలో అర్ధం చేసుకోవడానికి తోడ్పడుతుందని, మానవుడిగా మనకున్న విలువైన సమయంలో మంచి గ్రంధ పఠనం ద్వారా ఇటు వ్యక్తిత్వ వికాసానికి అటు సామాజిక పరివర్తనకు తోడ్పడే అవకాశం ఉంటుందని అన్నారు.

జొన్నలగడ్డ సుబ్రమణ్యం తమ సందేశంలో గత ఐదు సంవత్సర కాలంలో నిర్విరామంగా ఉత్తమ సాహితీ వేత్తల సమక్షంలో సాహిత్య వేదిక సాధించిన విజయాలు, తెలుగు భాషాభివృద్ధి ప్రాముఖ్యత, అందుకు చేయూత నిస్తున్న అధ్యాపకుల గుర్తింపు, పోషకదాతల ప్రోద్బలం తదితర వివరాలను సభికులకు తెలియజేసారు. పంచమ వార్షికోత్సవం సందర్భంగా సిలికానాంధ్ర వారి మనబడి సహకారంతో నిర్వహించిన "తెలుగు మాట్లాట" పోటీలలో విజేతలైన బాలబాలికలకు టాంటెక్స్ వేదికపై పురస్కార పత్రాలను, బహుమతులను అందజేసారు. పెద్దలకు వేదికపై నిర్వహించిన "తెలుగులో ఒక నిమిషం " తుదిపోటీలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.

ఆంధ్ర భాషార్నవాన్ని అవలీలగా ఆపోసన పట్టి, తన ధిషణా పాటవంతో మేధోమథనం చేసి, ఆంధ్రామృతాన్ని అవలీలగా సృజింప జేస్తూ, యావదాంధ్రభాషాభిమానులకూ అంద జేస్తూ, హృదయాలలో సహృదయ శిరోమణిగా స్థిరుడై అనితర సుసాధ్యమైన అవధాన పటిమతో, ధారణా ప్రతిభతో అవధాన బ్రహ్మగా కీర్తింపబడ్డ బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు నిర్వహించిన హాస్యమయమైన "అష్టావధానం" కు విశేష స్పందన లభించింది.

డా. పుదూరు జగదీశ్వరన్ సంధాతగా, మద్దుకూరి విజయ చంద్రహాస్, జంధ్యాల శ్రీనాథ్, భద్రిరాజు మూర్తి , డా. జువ్వాడి రమణ, మల్లవరపు అనంత్, కాజ సురేశ్, శ్రీమతి పాలూరి సుజన, పృచ్ఛకులుగా కేసి చేకూరి అప్రస్తుత ప్రసంగం, శ్రీ రాయవరం విజయభాస్కర్, పాలూరి రామా రావు లేఖకులుగా వ్యవహరించారు. అవధానం తరువాత టాంటెక్స్ వారి "తెలుగు వెలుగు" పంచమ వార్షికోత్సవ ప్రత్యేక సంచికను డా. గరికిపాటి నరసింహారావు చేతుల మీదుగా విడుదల చేశారు.

టాంటెక్స్ సాంస్కృతిక సమన్వయకర్త మహేష్ ఆదిభట్ల సమర్పించిన సాయంకాల వినోద కార్యక్రమాలు ప్రేక్షకులకు పునస్వాగతం పలికాయి. దాదాపు ముడు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని కూచిపూడి కళకే అంకితం చేసి, దేశ విదేశాలలో వందలాది నృత్య ప్రదర్శనలతో కూచిపూడి నృత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తూ, అనేక నృత్యరూపకాలను ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించి సుప్రసిద్ద చలన చిత్రాలకు నృత్య దర్శకులుగా "నంది" పురస్కారాలతో కీర్తింపబడుతున్న "నాట్య కళా తపస్వి", "నాట్యకళా విశారాద" కెవి సత్యనారాయణ బృందం నేటి కార్యక్రమంలో రాళ్ళబండి కవితా ప్రసాద్ రచించిన "పంచ కావ్యం" నృత్యరూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.

స్థానిక నాట్యాంజలి కూచిపూడి నృత్య పాఠశాల అధినేత్రి శ్రీలత సూరి సంపూర్ణ సహకారాలతో వారి శిష్య బృందం పంచకావ్యానికి జీవం పోశారు. పంచకావ్యం లాంటి గొప్ప ప్రబంధ కావ్య సమూహాన్ని అమెరికాలో మొట్టమొదటి సారిగా పూర్తి స్థాయిలో టాంటెక్స్ సాహిత్యవేదికపై ప్రదర్శించినందుకు జొన్నలగడ్డ సుబ్రమణ్యం కెవి సత్యనారాయణకు సభాముఖంగా కృతఙ్ఞతా పూర్వక అభివందనలు తెలియజేసారు. ఎంతో ఆసక్తితో ఆష్టదిగ్గజాలుగా నటించిన స్థానిక భాషాభిమానుల వేషధారణస, వారిఆసక్తి కృష్ణదేవరాయల భువనవిజయానికి నూతన శోభను తెచ్చి పెట్టాయి.

గాఢమైన అభిరుచి మాత్రమే ప్రోద్బలం గా తీసుకొని, నాట్యాన్ని తన దైనందిన జీవితంలో ఎలా ఇముడ్చుకోవాలో ప్రపంచానికి చూపించి, విభిన్న భంగిమలలో వినూత్నంగా నృత్య ప్రదర్సన చేసిన కుమారి నదియ అందరినీ ఆకట్టుకొంది. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారుడు జితేంద్ర నాథ్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండువేల కార్యక్రమాలలో రాజకీయ, చలన చిత్ర రంగాల ప్రముఖుల స్వరాలను అనుకరించి ప్రేక్షకులందరినీ తమ హాస్యంతో అలరించారు.

గత మూడు దశాబ్దాల కాలంలో వెయ్యికి పైగా చలన చిత్రాలకు గాత్రదానం చేయడమే కాకుండా పదివేల పైచిలుకు బుల్లితెర ధారావాహిక ఉపాఖ్యానాలకు సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, రచయితగా, గాత్రధారునిగా సేవలందించి, అనువాద కళ పట్ల అవగాహనా ప్రాచుర్యాన్ని కల్పించాలన్న సంకల్పంతో ఎనిమిది గంటల సేపు నిర్విరామానుకరణతో కీర్తింపబడ్డ శ్రీ ఘంటసాల రత్నకుమార్ తమ గాన మాధుర్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

అతిథుల సన్మాన కార్యక్రమంలో టాంటెక్స్ ఆధ్యక్షులు గీత దమ్మన్న, ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్, ఉపాధ్యక్షుడు, కాకర్ల విజయ్ మోహన్ మరియు కార్యవర్గ సభ్య బృందం, పాలక మండలి అధిపతి డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి బృందం పాల్గొని పుష్పగుచ్చం, దుశ్శాలువ మరియు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. చివరగా టాంటెక్స్ కార్యదర్శి డా. ఊరిమిండి నరసింహారెడ్డి తమ వందన సమర్పణ చేశారు.

English summary
TANTEX, a Telugu NRIs association has organised literary and cultural event in Dallas of USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X