లండన్‌లో జయశంకర్ వర్ధంతి
లండన్: ఎన్నారై టిఆర్ఎస్ సెల్ లండన్ శాఖ, తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ రెండవ వర్ధంతి సందర్భంగా "తెలంగాణా స్పూర్తి సభ" తూర్పు లండన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యుకె నలుమూలల నుండి వచ్చిన తెలంగాణ వాదులు, టిఆర్ఎస్ కార్యకర్తలు భారీ గా పాల్గొన్నారు.
లండన్ ఇంచార్జ్ శ్రీకాంత్ పెద్దిరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. తరువాత కొవొత్తులతో తెలంగాణ అమరవీరులను, జయశంకర్‌ను స్మరిస్తూ, ఉత్తరాఖండ్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా ఎన్నారై టిఆర్ఎస్ సెల్ అద్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడారు. తెలంగాణ భావజాల వ్యాప్తి లో జయశంకర్ పాత్ర గొప్పదని, వారు చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పని చేశారని, తెలంగాణ రాష్ట్ర సాధనే వారికి నిజమైన నివాళి అని అన్నారు. ఆశయ సాధన కోసం జయశంకర్ చేసిన కృషిని ప్రతి వ్యక్తి ఆదర్శంగా తీసుకోవాలని, వారి జీవిత వృత్తాంతాన్ని పాఠ్య పుస్తకాల్లలో పెట్టాలని, ట్యాంక్ బ్యాండ్ పై కాంస్య విగ్రహాన్ని పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెరాస నాయకుడు, సిరిసిల్ల ఎమ్మల్యే కెటి రామారావు మీద చేస్తున్న అసత్య ఆరోపణలని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, చంద్రబాబు ఇటువంటి చిల్లర రాజకీయాలు ఎన్ని చేసిన ప్రజలు నమ్మరని, యావత్ తెలంగాణ ప్రజల అండదండలు తెరాసకి ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం తెరాస అధ్యక్షుడు కెసిఆర్ నాయకత్వంలోనే సాధ్యమని, 2014 లోపు తెలంగాణ ఇస్తే సంబరం చేసుకుంటామని లేకుంటే సమరం చేసి, యాచించి కాదు శాసించి 115 శాసనసభ, 15 పార్లమెంటు సీట్లు గెలిచి తెలంగాణ సాదిన్చుకుంటామని తెలిపారు.
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ సంయుక్త కార్యదర్శి సిక్క చందు గౌడ్ మాట్లాడుతూ - జయశంకర్ లేని లోటు ఎవరు తీర్చలేరని అన్నారు. తెరాసకు జయశంకర్‌తో ఉన్న సంబంధాన్ని వివరించారు. జయశంకర్ స్పూర్తి తో తెలంగాణ రాష్ట్రం సాదించే వరకు అలుపెరగని పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు.
తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ మాట్లాడుతూ - ప్రవాస తెలంగాణ సంఘాలు అన్ని జయశంకర్ మానస పుత్రికలని, వారి ఆశయాలకు అనుగుణంగా మనం తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాదించాలని, అదే జయశంకర్‌కు మనం ఇచ్చే ఘన నివాళి అని తెలిపారు. తెలంగాణ ఐక్య కార్యాచరణతో ముందుకు వెళితే రాష్ట్ర సాధన సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.
ఎన్నారై టిఆర్ఎస్ సెల్ సంయుక్త కార్యదర్శి దుసరి అశోక్ గౌడ్, ఈస్ట్ లండన్ ఇంచార్జ్ శశిధర్ చేబర్తి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టిఆర్ఎస్ సెల్ సభ్యులు హరి నవాపేట్, శ్రవణ్ రెడ్డి, విష్ణు రెడ్డి, శ్రీనాథ్ రావు, శ్రీకాంత్, రోహిత్, మహేష్, హరికృష్ణ, ఆకుల సంతోష్, విశాల్, వినోద్‌లతో పాటు తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యులు శివాజీ షిండే, అర్చన జువ్వాడి, ఉదయ నాగరాజు, ప్రమోద్, వెంకట్ రంగు, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications