కువైట్‌లో కారు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు మృతి
చిత్తూరు: కువైట్‌లో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. అన్నమయ్య జిల్లా మనదపల్లెకు చెందిన గౌస్ బాషా(35), అతని భార్య(30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.
గౌస్ భాషా రాజంపేట పట్టణంలోని ఎగువగడ్డలో ఉన్న తాత వద్ద ఉంటూ స్థానిక ఓ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత తన స్వగ్రామమైన మదనపల్లెకు వెళ్లారు. అక్కడ్నుంచి బెంగళూరు వెళ్లి వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. ఆ తర్వాత బెంగళూరు నుంచి కువైట్‌కు వెళ్లారు.

ఈ క్రమంలో గౌస్ భాషా, ఆయన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి కారులో వెళ్తూ అదుపు తప్పి బోల్తా పడటంతో వారంతా మృతి చెందినట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదం జరిగింది నిజమేనని.. మృతి చెందినట్లు చెబుతున్న వ్యక్తికి ఫోన్ చేస్తే అందుబాటులో రావడం లేదని గౌస్ భాషా సమీప బంధువులు తెలిపారు.
ఈ పరిణామాల నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. వారి మృతదేహాలను చూసే వరకు నిర్ధారించలేమని గౌస్ భాషా బంధువులు పేర్కొన్నారు. భాషా కుటుంబసభ్యులు మరణించారన్న వార్తతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై ప్రభుత్వాలు సరైన సమాచారం ఇవ్వాలని మృతుడి బంధువులు, స్థానికులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications