ప్రయాణికురాలికి వేధింపులు: ఎన్నారైకి జైలు
సింగపూర్: ఓ మహిళను వేర్వేరు సందర్భాల్లో లైంగిక వేధింపులకు గురిచేసిన 32ఏళ్ల భారతీయుడు జైలుపాలయ్యాడు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న నిందితుడు సీతారామన్ రమేష్.. 39ఏళ్ల మహిళను లైంగిక వేధించినట్లు రుజువు కావడంతో కోర్టు అతనికి మూడు వారాల జైలు శిక్ష విధించింది. బాధితురాలిపై నిరుడు జులై 25న లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైంది.
నిందితుడు మరో ఇద్దరిపైనా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కోర్టులో బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులో ఎక్కిన బాధితురాలు చివరి నుంచి రెండో సీటులో కూర్చుంది. ఆమె ఎక్కిన 20 నిమిషాల తర్వాత అదే బస్సులో సీతారామన్ ఎక్కాడు.

ఆ తర్వాత బస్సులో ఆ సీటు ఈ సీటు మార్చుకుంటూ వచ్చిన నిందితుడు, ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆ సమయంలోనే ఆమెను వేధింపులకు గురి చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె అతని బారినుంచి తప్పించుకుంది.
అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది. కాగా, వాదన విన్న జిల్లా జడ్జి జశ్వేందర్ కౌర్.. నిందితుడ్ని మందలించారు. ప్రజా రవాణాను ఆశ్రయించే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిని క్షమించేది లేదని అన్నారు.
కాగా, అతడు చేసిన నేరానికి రెండేళ్లు జైలు, భారీ జరిమానాతో పాటు కొరడా దెబ్బలు కొట్టేవారే. కానీ సీతారామన్ పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడని, చేసిన తప్పుతో ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చిందని కోర్టుకు అతడి తరపు న్యాయవాది విన్నవించాడు. దీంతో కోర్టు కనికరించి సల్ప శిక్షతో సరిపెట్టింది.












Click it and Unblock the Notifications