భారత మహిళకు అంతర్జాతీయ అవార్డు
వాషింగ్టన్: భారతీయ మహిళ, యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మికి ప్రతిష్ఠాత్మక ‘అంతర్జాతీయ ధైర్యవంతురాలు' అవార్డు లభిచింది. విదేశాంగ శాఖ మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమెరికా ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామా ఈ అవార్డును అందజేశారు. లక్ష్మితోపాటు ఈ అవార్డును అందుకున్న వారిలో అఫ్ఘానిస్థాన్, ఫిజి దేశాలకు చెందిన సాధారణ మహిళలు ఉన్నారు.
లక్ష్మి(16ఏళ్ల వయస్సున్నప్పుడు) 2005లొ ఢిల్లీలో ఓ బస్టాప్‌లో ఉండగా ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో లక్ష్మి సోదరుడికి స్నేహితుడైన వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం దేశవ్యాప్తంగా యాసిడ్ దాడుల నిరోధానికి లక్ష్మి అలుపెరగని పోరాటం చేసింది. లక్ష్మి సేవలకు ర్తింపుగానే మిచెల్లీ ఒబామా ఆమెకు ఈ అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా లక్ష్మి యాసిడ్ దాడికి గురైనప్పుడు తన అనుభవాన్ని వ్యక్తం చేశారు. యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి తనపై దాడి చేయడమే కాదు, తన కలలపై దాడి చేశాడని అన్నారు. దాడి చేసిన వ్యక్తి హృదయంలో ప్రేమ లేదని, యాసిడ్ మాత్రమే ఉందని లక్ష్మి చెప్పారు. తనపై జరిగిన దాడి ఇతర మహిళలు, యువతులపై జరగకూడదనే ఉద్దేశంతోనే తాను దేశ వ్యాప్తంగా పోరాటం సాగించానని, అన్యాయంపై గళమెత్తానని లక్ష్మి తెలిపారు.
2012 డిసెంబర్‌లో న్యూఢిల్లీలో కదులుతున్న బస్సులో అత్యంత దారుణంగా నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై కూడా లక్ష్మి ఉద్యమించారు. తనకు లభించిన ఈ అవార్డుతో భారత్‌లోని మహిళలు తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తారని, ఉద్యమిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాలు ఖాతరు చేయని కొందరు యాసిడ్ అమ్మకాల యదేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. యాసిడ్ దాడులను అరికట్టేందుకు దేశంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని లక్ష్మి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications