అక్కాచెల్లెళ్లపై వ్యాన్‌లో రెండు వారాల పాటు రేప్

నిందితులు మహేంద్ర సోనీ (28), ఈశ్వర్ సోనీ (32)లను అరెస్టు చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు బిలాస్‌పూర్ పోలీసు సూపరింటిండెంట్ బిఎన్ మీనా చెప్పారు. 15, 13 ఏళ్ల వయస్సు గల బాధితురాళ్లను జిల్లాలోని హిర్రీ పోలీసు స్టేషన్ పరిధిలోని బేల్ముడి గ్రామంలో గల తల్లిదండ్రులకు గురువారంనాడు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
రతన్‌పూర్ ప్రదర్శనలో మహేంద్ర తమతో సెప్టెంబర్ 25వ తేదీ స్నేహం చేశాడని, ట్రిప్ కోసమని తమను తీసుకుని వెళ్లాడని బాధిత బాలికలు చెబుతున్నారు. వారిని సింగా తీసుకుని వెళ్లాడని, అప్పటికే అక్కడ ఈశ్వర్ ఉన్నాడని చెప్పారు. ఆ తర్వాత ఓ వ్యాన్‌ను దొంగిలించి, ఆ వ్యాన్‌లో వారిద్దరిని ఎక్కించుకుని వ్యాన్‌ను వివిధ ప్రాంతాలకు తిప్పుతూ తమపై అత్యాచారం చేశాడని ఆ బాలికలు చెప్పారు.
దుర్గ్, రాయపూర్, బిలాస్‌పూర్, రాజిం, సింగా, కాస్దోల్ ప్రాంతాలకు వ్యాన్‌లో తమను తిప్పినట్లు వారు తెలిపారు. ప్రతిఘటిస్తే చంపేస్తామని వారు బెదిరించినట్లు ఎస్పీ చెప్పారు. కాగా, తమ కూతుళ్లు కనిపించకుండా పోయారని ఓ మహిళ సెప్టెంబర్ 30వ తేదీన హిర్రీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బిలాస్‌పూర్ సమీపంలోని దేవ్రీకుర్ద్ వద్ద వ్యాన్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ అమ్మాయి ఉందనే సమాచారం అందడంతో పోలీసులు వెళ్లి మహేంద్ర సోనీని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిని రక్షించారు. ఆ తర్వాత ఈశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications