వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సాహిత్య వివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

తెలుగు సాహిత్యంలో మరోసారి అవాంఛనీయమైన వివాదం చెలరేగింది. ఇది తెలంగాణ సాహిత్యానికి, తెలంగాణ పట్ల వామపక్షాల వైఖరికి సంబంధించిన వివాదం. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను మొదటి నుంచి వామపక్షాల విచ్ఛిన్నకర డిమాండ్‌గానే పరిగణిస్తూ వస్తున్నారు. రాజకీయాల్లో ఆ విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్న వామపక్షాలు, సాహిత్యానికి వచ్చేసరికి నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా తమ వైఖరిని ప్రకటించలేకపోతున్నారు. విశాల ప్రాతిపదికపై ప్రపంచీకరణ, మతోన్మాద, టెర్రరిజాలను వ్యతిరేకించే సాహిత్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో వామపక్షాల భావజాలంతో పని చేస్తున్న సాహితీ సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగానే సాహితీ స్రవంతి అనే సంస్థ హైదరాబాద్‌లో మార్చి 26వ తేదీన 'సాహిత్యశాల'ను (వర్క్‌షాపు అనే ఇంగ్లీష్‌ పదానికి సాహిత్య శాల తెలుగు అనువాదం) నిర్వహించింది.

తెలంగాణకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు ఈ సాహిత్యశాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కొంత మంది తెలంగాణ కవులను, రచయితలను కలుపుకొని దీన్ని నిర్వహించడాన్ని కూడా వారు వ్యతిరేకిస్తూ ఒక కరపత్రం విడుదల చేశారు. ఈ కరపత్రాన్ని తెలంగాణ రచయితలు స్కైబాబ, సంగిశెట్టి శ్రీనివాస్‌, ఇంకా కొంత మంది సాహిత్యశాల జరుగుతున్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం భవనం వద్ద పంచసాగారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని హాల్‌లోని సాహిత్యశాల జరుగుతుండగానే తెలంగాణ రచయితలు, కవులు, కళాకారులు దాని ఎదురుగా ఉన్న పార్క్‌లో జానపద కళ ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కొందరు వ్యక్తులు వచ్చి తాను పంచుతున్న కరపత్రాలను లాక్కున్నారని, దాంతో తిరిగి ఇచ్చేయాలని తాను డిమాండ్‌ చేశానని, నానా మాటలు అన్నారని స్కైబాబ చెబుతున్నారు. కరపత్రాలు లాక్కున్నంత మాత్రాన తెలంగాణ ఇష్యూ లేకుండా పోతుందా అని, ఈ కరపత్రాలు చించేస్తే వేల కరపత్రాలు వస్తాయని తెలంగాణ సాహిత్య పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ కరపత్రాలు లాక్కున్నవారితో అన్నాడని తెలంగాణ రచయితలు అంటున్నారు. స్కైబాబ వద్ద ఉన్న కరపత్రాలను లాక్కోవడమే కాకుండా వాటిని చించేశారని వారు చెప్పారు.

కరపత్రాలు గుంజుకుంటున్న సమయంలో తాను చూసి తిరిగి ఇచ్చేయాలని తాను చెప్పానని గూడ అంటున్నాడు. గొడవ జరుగుతున్న సమయంలో అడ్డుకోవడానికి గూడ అంజయ్య వెళ్లినట్లు పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే స్కైబాబ వద్ద కరపత్రాలు గుంజుకున్న వారు గూడ అంజయ్య మాట కూడా వినలేదు. తనను తోసేశారని, దీన్ని గమనించిన తెలంగాణ రచయిత శ్రీధర్‌ దేశ్‌పాండే ఆయననెవరనుకుంటున్నావు, గూడ అంజయ్య అని, గూడ అంజయ్యను అలా తోసేయడం మర్యాద కాదని అన్నాడని గూడ అంజయ్య 'దట్స్‌ తెలుగు డాట్‌ కామ్‌' ప్రతినిధితో చెప్పారు. ' ఎవడైతేంది?' అని అంటూ అసభ్యపదజాలంతో దూషించారని గూడ అంజయ్య చెప్పారు. దీనికి తాను ఏమీ బాధపడడం లేదని, కరపత్రాలు పంచుకునే ప్రజాస్వామిక హక్కును కూడా సహించలేకపోవడం బాధాకరమని, ఇది తెలంగాణపై దాడి అని గూడ అంజయ్య అన్నారు. గూడ అంజయ్య తెలంగాణలోని ప్రతి ఊరిలో ప్రజల నోట తారాడే ' ఊరు మనదిరో... వాడ మనదిరో' అనే పాటను రాశారు. ప్రజా ఉద్యమాలకు ఆయన కలాన్ని, గళాన్ని అంకితం చేశారు. ప్రజాస్వామిక, ప్రజా ఉద్యమాల వెన్నంటి నడుస్తూ ఉన్న గూడ అంజయ్య సాహిత్యకారులకే కాదు, తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.

సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రజాశక్తి బుక్‌హౌస్‌లో తెలంగాణ పుస్తకాలు అమ్మడం లేదని, తెలంగాణ పుస్తకాలను వారి పత్రికలో సమీక్ష చేయడం లేదని, ఇవి వారి పక్షపాత ధోరణికి కొద్ది ఉదాహరణలు మాత్రమేనని తెలంగాణ రచయిత స్కైబాబ అంటున్నాడు. తెలంగాణ రచయితలు మాట్లాడుతున్న విషయాలకు స్థానం కల్పించి వాటిని చర్చకు పెట్టాల్సిన అవసరాన్ని సాహితీ స్రవంతి గుర్తించడం లేదని, పైగా తెలంగాణ రచయితలను, రచనలను అవహేళన చేస్తున్నారని ఆయన వాదన. విశాల దృక్పథంతో పేరుతో సంకుచిత వైఖరిని ప్రదర్శిస్తూ తెలంగాణ రచయితల గొంతు నొక్కే సంకుచిత విధానాన్ని అవలంబిస్తున్నారని కూడా ఆయన ఆరోపణ. ప్రపంచీకరణ వ్యతిరేకత పేరుతో ఆంధ్రా ఆధిపత్య ధోరణికి పాల్పడుతున్నారని ఆయన 'దట్స్‌ తెలుగు డాట్‌ కామ్‌'తో అన్నారు. తనపై దాడి, దాన్ని అడ్డుకోవడానికి వచ్చిన గూడ అంజయ్యపై దాడి సాహితీ స్రవంతి అప్రజాస్వామిక చర్యకు దాఖలా అని ఆయన అంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా తెలంగాణకు వ్యతిరేకంగా సిపియం కేంద్ర నాయకత్వాన్ని కూడా తప్పుదోవ పట్టించే లాబీయింగ్‌కు వారు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ అంశాల దృష్ట్యా సాహితీ స్రవంతి సాహిత్యశాలను బహిష్కరించాల్సి వచ్చిందని, దాన్ని వ్యతిరేకిస్తూ కరపత్రాలు పంచాల్సి వచ్చిందని ఆయన అంటున్నారు.

"తెలంగాణ ప్రజలు బలంగా కోరుతున్న ప్రత్యేక రాష్ట్రాభిప్రాయాన్ని, తెలంగాణ వెనకబాటుతనాన్ని దగాపడ్డ తెలంగాణ చారిత్రక పునరుద్ధరల్ని, ఆ సాహిత్యాల్ని, భాషని, ఆ రాజకీయాల్ని వ్యతిరేకిస్తున్న సిపియం ఈ సాహిత్యశాలను తెలంగాణ రచయితల్ని కలుపుకొని నిర్వహించడంలో అర్థమేమటి?'' అని తెలంగాణ రచయితలు విడుదల చేసిన కరపత్రంలోని ప్రధాన ప్రశ్నల్లోని ఒక ప్రశ్న.

ఇదిలా వుంటే, తెలంగాణ రచయితల వాదనలను సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్‌ తెలికపల్లి రవి అంగీకరించడం లేదు. తాము విశాల ప్రాతిపదికపై పని చేస్తున్నామని ఆయన 'దట్స్‌ తెలుగుడాట్‌ కామ్‌' ప్రతిని«ధితో అన్నారు. స్కైబాబపై గానీ గూడ అంజయ్యపై గానీ దాడి జరిగిన విషయం తమకు తెలియనే తెలియదని, అటువంటి సంఘటనేదీ జరగలేదని ఆయన అన్నారు. తాము వివాదాల్లో చిక్కుకోదలుచుకోలేదని కూడా ఆయన అన్నారు. కరపత్రంలో తమపై ప్రత్యక్ష ఆరోపణేదీ లేదని కూడా అన్నారు. తాము విశాల ప్రాతిపదికపై సాహిత్యకారులందరినీ కలుపుకొని పోవడానికే కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. సాహితీ స్రవంతి కొందరు రచయితలను ఉద్దేశపూర్వకంగా కొంత మంది రచయితలను పక్కన పెడుతుందనే వాదనతో ఆయన ఏకీభవించడం లేదు. అందరినీ తాము ఆహ్వానిస్తున్నామని, తమ పత్రికలో అందరి రచనలకు చోటు కల్పిస్తున్నామని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే తెలంగాణ రచనలను వారు నిర్వహిస్తున్న ప్రజాశక్తి బుక్‌హౌస్‌లో విక్రయించడానికి బాహాటంగానే తిరస్కరిస్తోంది. వారు నడుపుతున్న పత్రికలో కొందరి పుస్తకాలను రివ్యూ చేయడం లేదు. ఇది సాహిత్యకారులకు చాలా మందికి అనుభవంలో ఉన్నదే. అయితే దాన్ని తెలికపల్లి రవి ఒప్పుకోవడం లేదు.

ఇదంతా సమస్యకు సంబంధించిన ఒక కోణమైతే, కరపత్రం పంచుకునే కనీస ప్రజాస్వామ్య హక్కుకు భంగకరమైన సంఘటన సాహితీ స్రవంతి సాహిత్యశాల వద్ద జరగడాన్ని తెలంగాణ రచయితలు చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కరపత్రంలోని అంశాలు తప్పా ఒప్పా అనే విషయాన్ని, సాహిత్యశాలను బహిష్కరించడం సరైందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే నిరసన తెలిపే కనీస హక్కును కూడా అడ్డుకునే ప్రయత్నం జరగడం ఎంత వరకు సమంజసమనేది చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. గూడ అంజయ్యపై దాడిని తెలంగాణ రచయితల వేదిక నాయకుడు నందిని సిధారెడ్డి, తెలంగాణ సాంస్కృతిక వేదిక కన్వీనర్‌ సుంకిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు పలువురు తెలంగాణ రచయితలు ఖండించారు. దాన్ని తెలంగాణ రచయితలపై దాడిగా వారు అభివర్ణిస్తున్నారు.

అభిప్రాయభేదాలను పరస్పరం గౌరవించుకునే సృహద్భావ వాతావరణం తెలుగు సాహిత్యంలో కొరవడిందనేది కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. తాజా సంఘటన అందుకు ఒక ఉదాహరణ మాత్రమే. భిన్నాభిప్రాయాన్ని సహించే ప్రవృత్తి కూడా పూర్తిగా నశించింది. తాము నడిచే మార్గమే సరైన మార్గమని, పక్కకు చూడాల్సిన అవసరం లేదని కూడా చాలా మంది అనుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X