Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నిర్దిష్టతకు నిర్వచనం సాహు

నిర్దిష్టత సాహిత్యానికి ప్రాణం. ఈ విషయాన్ని గుర్తించిన రచయిత సామాజిక జీవన స్రవంతికి ఎడంగా ఉన్న ప్రజల గురించి ప్రత్యేకంగా పట్టించుకుంటాడు. వారి సంవేదనలకు అక్షరరూపం ఇస్తాడు. సాహు సరిగ్గా చేసింది ఇదే. సమాజంలోని అమూర్త పీడితుని గురించి కాకుండా, నిర్దిష్ట పీడితుల జీవితాన్ని తన సాహిత్య వస్తువుగా స్వీకరించాడు.

గోండుల జీవన పోరాటాన్ని వారి బతుకులోని సహజ సౌందర్యాన్ని 'నాగరిక' ప్రపంచానికి పరిచయం చేసిన రచయిత సాహు. ఆయన కవితలకు, పాటలకు కూడా అటవీ ప్రాంతాల్లో నివసించే గోండుల జీవితమే ఇతివృత్తం. అల్లం రాజయ్యతో కలిసి రాసిన 'కొమురం భీం' నవల సాహు విశిష్ట రచన.

విరసం ఆవిర్భవించే వరకు గోండులు తెలుగు సాహిత్య చైతన్యంలోకి రాలేదు. వారి గురించి పట్టించుకున్న రచయిత లేడన్నది వాస్తవం. పాటను, కవితను పట్టించుకున్నంతగా వచన ప్రక్రియలను విరసం పట్టించుకోలేదు. కానీ సాహులాంటి కొందరు రచయితలు ఇందుకు మినహాయింపు. అందువల్లనే కవితలు, పాటలు రాసినా కథారచయితగానే సాహుకు గుర్తింపు. గోండులతో కలిసిపోయి, వారి భాషను, జీవన సంస్కృతులను తనలో జీర్ణం చేసుకున్నాడు. సాహు కథలు చదివితే ఈ విషయం తెలుస్తుంది. 'రక్తపింజెర', 'మరట్‌ తుడుం పాయనా', 'పిల్ల రక్కసులు', 'ఒక తల్లి', 'రగల్‌జెండా', 'అమరవీరులు', 'ఊరేగింపు' మొదలైన కథలు గోండుల బతుకు చిత్రాల్ని మనముందు పరుస్తాయి. అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు గోండుల జీవితాల్లో సృష్టించిన బీభత్సాన్ని సాహు కతలు చిత్రించాయి. పుట్టిన చోటనే పరాయివాళ్లు కావడం గోండుల జీవితంలోని విషాదం. ఉప్పు మిరపకాయ అమ్ముకునే పేరిట మైదాన ప్రాంతాల నుంచి గోండు గుడారాల్లోకి వచ్చిన షావుకార్లు క్రమంగా అటవీ భూముల్ని తమ హక్కుభుక్తం చేసుకోవడంలోని దోపిడీతీరును ఐదు రూపాయల కథలో చిత్రించారు. ఇది రెండు పేజీల కథ. ఈ చిన్న కథలోనే షావుకార్లు గోండులను వారి భూముల్లోనే పాలేర్లుగా మార్చిన వైనాన్ని సాహు చిత్రీకరించారు. ఈ కథ చదివితే ప్రేమ్‌చంద్‌ 'సవాశేరు గోధుమలు' కథ స్ఫురిస్తుంది.

షావుకార్లు ఒకర రకంగా గోండుల నెత్తి కొడితే ప్రభుత్వం మరోరకంగా గోండులను వేధిస్తుంది. ఒక్క రకంగా కాదు అనేక రకాలుగా ప్రభుత్వం గోండుల జీవితంపై పెత్తనం చెలాయిస్తుంది. అటవీ రక్షణ చట్టాలన్నీ గోండులకు అడవుల మీద ఉండే సాంప్రదాయిక హక్కుల్ని హరించాయి. పొయ్యిలోకి కట్టెపుల్లల్ని ఏరుకున్నా, ఏ కుందేలు పిల్లను పట్టుకున్నా చౌకిదార్ల, జమేదార్ల వేధింపులు తప్పవు. అభివృద్ధి పేరిట అడవుల్లో రోడ్లు వేయడం వల్ల గోండులకు ఒరింగిదేమిటి? గోండు గూడాల్లోకి పోలీసు జీపులు రావడం, వాళ్ల మీద మరింత నిర్బంధాలు పెరగడం! 'రక్తపింజెర, మరట్‌ తుడుం పాయనా, నాడె' కథలు ఈ వాస్తవానికి చిత్రికలు.

గోండుల శ్రమను కొల్లగొట్టే క్రమంలో కాంట్రాక్టర్లు వాళ్ల తాబేదార్లు ఎంత క్రూరంగా వ్యవహరిస్తారో 'రక్తపింజెర'లో చూస్తాం. తమ మీద జరిగే దోపిడీ పీడనల్ని వ్యతిరేకిస్తూ గోండుల్ని సంఘటితం చేయడంలో 'పొరకలసార్లు' చైతన్యవంతమైన పాత్ర నిర్వహించారు. జీవితాల్లో వారు తీసుకొచ్చిన వెలుగు రేఖల్ని ఛిద్రం చేసేందుకు ప్రభుత్వం 'ఇంద్రవెల్లి' బీభత్సాల్ని సృష్టించింది. ఆ తర్వాత కాలంలో ఆదిలాబాద్‌లో ప్రతి గూడాన్ని ఇంద్రవెల్లిగా మారుస్తామని పోలీసులు నాటి నుంచి బెదిరిస్తూ వస్తున్నారు. పదిహేనేళ్ల తర్వాత కూడా ఈ బెదిరింపులు తప్పడం లేదు. కారణాలు, సందర్భాలు వేరు కావచ్చు గానీ, ఇంద్రవెల్లి సంఘటన 'ఆపరేషన్‌ బ్లూస్టార్‌'లాంటిది. ఆపరేషన్‌ బ్లూస్టార్‌ సిక్కుల మనోభావాల్ని మాత్రమే దెబ్బ తీసింది. కానీ ఇంద్రవెల్లి సంఘటన గోండుల సమష్టి జీవన సంస్కృతులపై సంఘటిత చైతన్యంపై కిరాతకమైన దాడి. ఇంద్రవెల్లి సంఘటన తర్వాత గోండు పల్లెల్లో ఛిన్నాభిన్నమైన బతుకు దృశ్యాల్ని కూడా సాహు తన కథల్లో బలంగా చిత్రీకరించారు. ఇంద్రవెల్లి సంఘటన- నిజానికి గోండులపై ప్రభుత్వం జరిపిన యుద్ధం. యుద్ధం బారిన పడిన దేశంలో ఉండే సంక్షోభమే గోండు గూడాల్లోనూ నెలకొంది. ఈ సంక్షోభాన్ని వాస్తవంగా చిత్రీకరించిన రచయిత సాహు.

ఈ కథల్లో గోండులపై జరిగిన దోపిడీపీడల్ని వారి పోరాటాన్ని చిత్రీకరించడానికే రచయిత పరిమితం కాలేదు. గోండుల ఆచార వ్యవహారాల్ని ప్రకృతితో మమేకమైన వారి బతుకుల్లోని సౌందర్యాన్ని హృద్యంగా పట్టి చూపారు. రచయిత గోండులతో మమేకమై వాళ్లతో కలిసి జీవించడం వల్లనే ఇది సాధ్యమైంది. గోండుల జీవద్భాషను పట్టుకోవడంలోను రచయిత సఫలమయ్యారు. అందువల్లనే ఈ కథలు చదువుతూ పాఠకుడు వివిద రకాల స్పందనలకు గురవుతాడు. 'రక్తపింజెర, ఆకలి, మరట్‌ తుడుంపాయనా' కథలు చదివితే ఒళ్లు జలదరిస్తుంది. జవజీవాలున్నందువల్లనే ఈ కథల గురించి మళ్లీ మనం చెప్పుకుంటున్నాం. ఇంత మంచి కథలు అందించిన సాహు ఎక్కువ కాలం జీవించకపోవడం సాహిత్య ప్రపంచానికి తీరని లోటు. ఆయన బతికి వుంటే గోండుల జీవితాన్ని చిత్రించే మరిన్ని కథలు, నవలలు వచ్చి వుండేవి. దళిత, స్త్రీవాదాలు వచ్చాక సాహిత్యంలో నిర్దిష్ట గురించి మరింత చర్చ జరిగింది. అయితే ఈ వాదాలు, చర్చలు లేనికాలంలోనే సాహిత్యంలోని నిర్దిష్టత అవసరాన్ని గుర్తించినట్టు ఈ కథలు తెలియజేస్తాయి. కానీ విరసం మాత్రం సాహు నుంచి ఈ పాఠం నేర్చుకోలేదు. అమూర్త పీడితునికి సాహిత్యంలో పెద్దపీట వేశారు. కానీ ఈ సంప్రదాయాన్ని సాహు తర్వాత కొనసాగించిన రచయితలు విరసంలో ఎక్కువగా కనిపించరు. సాహు తర్వాత గోండుల జీవితాన్ని ప్రతిఫలిస్తూ బలమైన సాహిత్యం రాకపోవడమే ఇందుకు దాఖలా. 'రాగో' నవల మాత్రం దీనికి మినహాయింపు.

సాహు నుంచి ఈనాటి దళిత కథా రచయితలు ఎంతో నేర్చుకోవాలి. ఈ విషయాన్ని వాళ్లు గుర్తిస్తున్నారు. నాగప్పగారి సుందరరాజు 'మాదిగోడు' కథలు ఇందుకు ఉదాహరణ. ఈ రకమైన నిర్దిష్టత అవసరాల్ని రచయితలు గుర్తిస్తేనే మన కథాసాహిత్యం మరింత వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+