నవలలకు కాలం కాదిది!

Posted By:
Subscribe to Oneindia Telugu

తెలుగులో నవలలేవి అని ఒకసారి ప్రముఖ రచయిత డాక్టర్‌ కేశవరెడ్డి అంటే తెలుగు సాహితీలోకం భగ్గుమంది. దాశరథి రంగాచార్య ఏకంగా కొందరు నవలాకారుల జాబితానే ఇచ్చారు. కేశవరెడ్డి ఉద్దేశం తెలుగులో నవలలే లేవని కాదు, అంత గొప్ప నవలలు లేవని. ఒక రచయితకు ప్రేరణ అందించే నవలలు లేవని ఆయన మాటల అంతరార్థం. ఈ లెక్కన చూస్తే కేశవరెడ్డి మాటలకు పెద్దగా బాధపడనక్కర్లేదు. జీవితాన్ని సృజనాత్మక రచనగా తీర్చి దిద్ది పాఠకులకు చెంతకు వచ్చిన క్లాసిక్స్‌ తెలుగులో లేవు. ఇప్పుడు పరిస్థితి మరింత నిరాశాజనకంగా వుంది.

'ఆటా', 'తానా' నవలల పోటీలో బహుమతులు గెల్చుకున్న నవలలు కూడా ఏమంత గొప్పగా లేవు. బహుమతులు పొందిన నవలలే గొప్పగా లేకపోతే మిగతా వాటి గురించి ఇక చెప్పాల్సిందేమి వుంటుంది. అయితే, పోటీలతో ప్రమేయం లేకుండా రచనలు చేస్తూ పోయేవారు వుంటారు. ఇటువంటి ఒకరిద్దరి నుంచి అడపాదడపా మంచి నవలలే వస్తున్నా అవి క్లాసిక్స్‌ స్థాయికి చేరుకోలేదు.

ఈ మధ్యకాలంలో వచ్చిన నవలలేవీ శైలిలో నవలా లక్షనాలను సంతరించుకున్నవి కావు. స్పార్టకస్‌ పోలీసు వ్యవస్థ మీద రాసిన నవల, అరుణ ఎల్లి ఇతరేతర కారణాల వల్ల ప్రచారం పొందాయి. అలాగే తెలంగాణాలో విప్లవోద్యమం వస్తువుగా వచ్చిన 'వసంతగీతం', 'సరిహద్దు' వంటి నవలలు కేవలం డాక్యుమెంటరీలు మాత్రమే. మంచి నవలాకారుడిగా పేరు పొందిన అల్లం రాజయ్య నవలలు కూడా అంతే. అసలు, సీరియస్‌ నవలా రచనే తెలుగులో వెనుక తట్టు తట్టింది. ఉద్యమాలను మాత్రమే చిత్రీకరించే ఉద్దేశంతో వెలువడిన తెలంగాణా నవలకైతే అసలు జవజీవాలే లేవు. నవీన్‌ 'అంపశయ్య' తర్వాత అంత మంచి నవల మళ్లీ రాయలేకపోయారు. ఆయన పుంఖానుపుంఖంగా నవలలు రాస్తున్నప్పటికీ 'అంపశయ్య' స్థాయిని మరోటి అందుకోలేకపోయింది.

ఉత్తరాంధ్ర నుంచి కె.ఎన్‌.వై. పతంజలి మాత్రమే ఎక్కువగా నవలికలు రాస్తున్నారు. ఈయన నవలారచనకు పెట్టింది పేరు. రాయలసీమ నుంచి చిలుకూరి దేవపుత్ర, ఇంకా కొంత మంది నవలలు రాస్తున్నారు. రాయలసీమ భాషలో, అందునా చిత్తూరు భాషలో అక్కడి జీవితాన్ని సమర్థంగా చిత్రీకరిస్తున్న రచయిత డాక్టర్‌ కేశవరెడ్డి. ఇలా ఒకటి రెండు పేర్లు చెప్పుకోవాల్సి వస్తే ఇప్పటి వాళ్లలో నవీన్‌ పేరు తప్ప మరోటి కనిపించదు.

మొత్తంగా తెలుగులో నవల ఉండాల్సిన స్థాయిలో లేదు. పాత తరం రచయితలకు నవలా రచనలో మనం మంచి వారసులం కాదనేది నేటి స్థితి తెలియజేస్తుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X