తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు కనిపిస్తున్న వైభవాన్ని సంతరించుకోవడానికి వెయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. బ్రహ్మదేవుడే స్వయంగా తొలిసారిగా ఈ ఉత్సవాలను నిర్వహించాడని, అందుకే వీటికి 'బ్రహ్మోత్సవాలు' అని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పురాణ కథనాలకు బలమైన చారిత్రక సాక్ష్యాలుగా తిరుమల ఆలయ ప్రాకార గోడలపై లభించిన 600కి పైగా శిలాశాసనాలు నిలుస్తున్నాయి.
చోళులు, యాదవరాయుల పాలనలో
చారిత్రకంగా క్రీస్తు శకం 966 అంటే 10వ శతాబ్దంలో పల్లవ రాణి 'సామవై పెరుందేవి' వేంకటేశ్వరస్వామివారికి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించి, పురట్టాసి బ్రహ్మోత్సవ నిర్వహణకు గ్రామాల రాబడిని దానంగా ఇచ్చినట్లు తొలి శాసనం స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత చోళులు, యాదవరాయుల పాలనలో ఉత్సవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరనరసింహ యాదవరాయల కాలంలో పాంగుని ఉత్సవం, చోళరాజు విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై ఉత్సవం, ఆ తర్వాత ఆడి ఉత్సవం చేరడంతో విజయనగర సామ్రాజ్య ఆవిర్భావం నాటికి ఏటా ఐదు బ్రహ్మోత్సవాలు జరిగే సంప్రదాయం స్థిరపడింది.

స్వర్ణయుగాన్ని తాకింది
విజయనగర చక్రవర్తుల కాలంలో ఈ వైభవం స్వర్ణయుగాన్ని తాకింది. క్రీ.శ. 1339లో మూలవిరాట్టు ఉగ్రరూపం దృష్ట్యా శ్రీ మలయప్పస్వామివారిని వెలికితీసి ఉత్సవమూర్తిగా పూజించడం ప్రారంభించారు. శ్రీకృష్ణదేవరాయలు 1513లో తైమాస బ్రహ్మోత్సవాన్ని ప్రారంభించగా, అచ్యుతరాయల కాలంలో కార్తీక బ్రహ్మోత్సవం, తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం రూపుదిద్దుకున్నాయి. దాంతో 1539-1616 నాటికి ఏకంగా సంవత్సరానికి పది వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శాసనాలు చెబుతున్నాయి.
సాలకట్ల బ్రహ్మోత్సవాలు
1803 మెకంజీ సర్వే, 1843 మహంతుల పాలన దాటుకుని, 1933లో తిరుమల తిరుతి దేవస్థాం బోర్డు ఆవిర్భావంతో ఆలయ పరిపాలనా వ్యవస్థ ఆధునీకరించబడింది. ఏడాదికి పది ఉత్సవాలు సాధ్యపడకపోవడంతో టీటీడీ వాటిని ప్రధానమైన సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా క్రమబద్ధీకరించింది. అయితే అధికమాసం వచ్చిన ప్రతి మూడేళ్లకు ఒకసారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల పేరిట ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విశిష్ట సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 15 నుంచి సెప్టెంబరు 23 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి అక్టోబరు 20 వరకు జరుగుతాయి. ప్రతి ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు.














Click it and Unblock the Notifications
