• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్ట్-33

By Staff
|

రసూల్‌ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనసంతా చీకటి కమ్మేస్తుంది. ఆ వారం రోజులు చకచకా జరిగిపోయిన సంఘటనలు రీళ్లలా కళ్ల ముందు కదులుతాయి. ఇంత దగ్గరగా, ఇంత దారుణంగా అతనెప్పుడూ చావును చూడలేదు. ఇదే మొదటిసారి. మృత్యువు నీడలా వెన్నంటే ఉందని అనుభవంలోకి వచ్చిందతనికి.

గుర్తు తెలియని నక్సలైట్‌గా ప్రకటించిన రసూల్‌ మృతదేహం ఫొటో తన చేతుల మీదుగానే వార్తపత్రిక మీదికి ఎక్కింది. తాను గుర్తు పట్టలేదు. రసూల్‌కు ఇటువంటి చావు ఉంటుందని ఊహిస్తే కదా, గుర్తు పట్టడానికి. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు రాకపోయేసరికి అతని ఇంటికి వెళ్లాడు రాంరెడ్డి.

అంబర్‌పేటలో మురికివాడలాంటి చోట రసూల్‌ భార్య, ఇద్దరు పిల్లలతో కాపురం ఉంటున్నాడు. ఇద్దరూ చిన్నపిల్లలే. భార్య చదువు సంధ్యలు, నగరవాసన లేని పేద ముస్లిమ్‌ అమ్మాయి. మనసు ఏదో కీడు శంకిస్తూనే ఉంది. ఎంత గుండె దిటవు చేసుకుందామన్న సాధ్యం కావడం లేదు.

ఇంటి ముందుకు వెళ్లిన రాంరెడ్డికి రసూల్‌ భార్య వీధిలో ఉన్న బోర్‌ నుంచి నీటిని తెస్తూ కనిపించింది. ''రసూల్‌ ఉన్నడా?'' అని అడిగాడు. భుజంపై నీళ్ల బిందె. బిందెలోంచి డొల్లిన నీటితో తడిసిన బట్టలు. కష్టాలకు, కన్నీళ్లకు అలవాటు పడ్డ బతుకులా ఉందామె.

''లేడన్నా, రాత్రుళ్లు ఇంటికి కూడా రావడం లేదు'' చెప్పింది. అతను ఎక్కడెక్కడికో వెళ్లడం, రోజుల తరబడి ఇంటికి రాకపోవడం మామూలే. అందుకేనేమో ఆమె అంత మామూలు విషయంగా చెప్పింది. అక్కడి నుంచి ఆఫీస్‌కు వచ్చాడు రాంరెడ్డి.

అఫీసుకు వచ్చేసరికి అంతా హడావిడిగా ఉంది. ఆ వాతావరణం చూడగానే అతని మనసేదో కీడు శంకించింది. జరగరానిదేదో జరిగే ఉంటుందని అనిపించింది. అందరూ తన కోసమే చూస్తున్నారు. ఛీఫ్‌ రిపోర్టర్‌ ఎదురుగా వచ్చి ఎడిటర్‌ గదిలోకి తీసికెళ్లాడు. అతని ముఖంలో ఆందోళన కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఎడిటర్‌ ముఖం మాడిపోయి ఉంది. ఎడిటర్‌ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. ఛీఫ్‌ రిపోర్టర్‌ అతని పక్కనే కూర్చున్నాడు.

ఎడిటర్‌ కర్చీఫ్‌ తీసి ముఖం తుడుచుకున్నాడు. చాలా సేపు మాట్లాడలేదు. ఏమిటని అడగడానికి కూడా రాంరెడ్డికి వాతావరణం వీలు కల్పించడం లేదు. ''తెలుసు కదా!'' అన్నాడు ఎడిటర్‌. బిక్క మొహం వేశాడు రాంరెడ్డి. ''నేనేం చెప్పలేదు'' అన్నాడు చీఫ్‌ రిపోర్టర్‌.

''ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇద్దరిలో ఒకరు మన రసూల్‌ అని క్రైమ్‌ రిపోర్టర్‌ చెప్పాడు'' అన్నాడు ఎడిటర్‌. మాటలు చాలా బరువుగా, ఆచితూచినట్లుగా వచ్చాయి.

అదిరిపడ్డాడు రాంరెడ్డి. ముఖం మాడిపోయింది. ఊపిరి ఆగిపోయినట్లయింది. ఒళ్లంతా చెమటలు పట్టసాగాయి. కాదు, కాకూడదు అని అనుకున్నాడు. ఇది అబద్ధమైతే బాగుండుననిపించింది. మృత్యువు వచ్చి పలకరించినట్లనిపించింది. వెన్నులో చలి పుట్టింది. ఏమీ మాట్లాడలేకపోయాడు.

''ఆఖరుసారి నీకు ఎప్పుడు కలిశాడు? ఏం చెప్పాడు?'' అడిగాడు ఎడిటర్‌.

చీఫ్‌ రిపోర్టర్‌ లేచి మంచినీళ్లు తెచ్చిచ్చాడు. గ్లాసు అందుకుంటుంటే చేతులు వణుకుతున్నాయి. గ్లాసును అతి కష్టం మీద అందుకున్నాడు. గ్లాసులోంచి నీళ్లు వొలికి మీద పడ్డాయి. గ్లాసును నోటి దాకా తీసికెళ్లలేకపోయాడు. అతి కష్టం మీద గ్లాసును టేబుల్‌ మీద పెట్టాడు. ఎంత తమాయించుకుందామని, ధైర్యం తెచ్చుకుందామని ప్రయత్నించినా లాభం లేకపోయింది. కళ్ల ముందు రసూల్‌ భార్య, ఇద్దరు పిల్లలే మెదులుతున్నారు. వారి ముఖం తాను చూడగలడా? వాళ్లు వేసే ప్రశ్నలకు తన వద్ద జవాబులున్నాయా? దోషిగా వాళ్ల ముందు తల వంచుకుని నిలబడ్డం తప్ప తాను చేయగలిగేదేమైనా ఉందా? వలవలా ఏడ్చేశాడు. ఆఫీసు, ఎడిటర్‌, ఛీఫ్‌ రిపోర్టర్‌ ఎవరూ ఇప్పుడు అతని కళ్ల ముందు లేరు. అంతా దీనంగా మౌనంగా తన వైపే చూస్తున్న మూడు జతల కళ్లు. ఆ కళ్లలో వెలుగు లేదు. పెను వర్షంలో తడిసి రెక్కలాడక నేల రాలిన పక్షుల్లా ఆ ముగ్గురు.

''రామ్‌!'' అంటూ భుజం మీద చేయేశాడు చీఫ్‌ రిపోర్టర్‌. రసూల్‌ దిక్కు లేని మరణానికి కారకులెవరు? ల్యాండ్‌ అతనికో అబ్సెషన్‌. నిజాం జమానాలో తన కుటుంబ పెద్దలకు నిజాం నవాబు నుంచి ఇనామ్‌గా లభించిన భూమిని పెద్ద రెడ్లు చుట్ట చుట్టేసి చంకలో పెట్టుకున్నారు. దాని కోసం నిరంతరం పోరాడాడు. రెవెన్యూ రికార్డులు, వాటి కథాకమామీషు అంతా అతనికి కరతళామలకమైంది. అదే చివరికి అతని ప్రాణం తీసిందా? అలా అని సరిపెట్టుకుంటే సరిపోతుందా?

భూమి కోసం పోరాడి, పోరాడి అలసిపోయిన రసూల్‌ రిపోర్టర్‌గా జీవితం ప్రారంభించిన తర్వాత అక్రమ కబ్జాలపై కలాన్ని ఝళిపించాడు. రాజకీయ నాయకుల అక్రమ భూ ఆక్రమణలపై రికార్డులతో సహా వార్తలు రాశాడు. అధికారంలో ఉన్న పెద్దలపై వార్తలను హాట్‌కేకుల్లా అతను పనిచేసే పత్రికలు అచ్చేసుకున్నాయి. అయితే అతనికి స్థిరమైన ఉద్యోగాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. అయిదారు పత్రికల్లో స్ట్రింగర్‌గా ఉద్యోగం చేసి చివరగా ఈ పత్రికకు వచ్చాడు. ఇక్కడా అదే కాంట్రాక్టు జీతం. పర్మినెంట్‌ అవుతాననే ఆశ సన్నగిల్లిన రసూల్‌ గుండెలో గూడుకట్టుకున్న విషాదం.

హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కూడా అతని వార్తలు తరుచూ భూముల చుట్టే తిరిగేవి. హైదరాబాద్‌ ప్లాట్ల బిజినెస్‌లో చేయి పెట్టడమంటే పులినోట్లో తలపెట్టడమే అని రసూల్‌ మరణం తర్వాత గానీ రాంరెడ్డికి అనుభవంలోకి రాలేదు. అరగంట సేపటి తర్వాత గానీ రాంరెడ్డి తేరుకోలేకపోయాడు. అతను తేరుకోవడానికి ఎడిటర్‌, చీఫ్‌ రిపోర్టర్‌ రకరకలుగా ప్రయత్నించారు.
.................. ........................ ..........................................................

''నాలుగు రోజుల క్రితం ఊరికి వెళ్తన్నాను. సెలవు కావాలి'' అని అడిగాడు రసూల్‌. ''ఎందుకు? ఊరికి వెళ్లావా?'' అని అడిగాడు రాంరెడ్డి. ''అవును'' అన్నాడతను. ''నువ్వు ఊరికి వెళ్లడం మానుకుంటావా? లేదా?'' అని అడిగాడు రాంరెడ్డి. ''ఈ ఒక్కసారి తప్పేట్లు లేదు'' అన్నాడు. ''సరే నీ ఇష్టం'' అని అయిష్టంగానే ఒప్పుకున్నాడు రాంరెడ్డి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X