మనిషి సింపుల్‌! రచన మరీ సింపుల్‌!!!

Posted By:
Subscribe to Oneindia Telugu

''నేను పుట్టడానికీ చాలాముందే మా అమ్మానాన్న వేర్వేరుగా బొంబాయి మహానగరం ప్రవేశించారు. అక్కడే వాళ్ళు కలుసుకున్నారు, పెళ్ళాడారు. నాతోపాటు అయిదుగురు చెల్లెళ్ళకూ ఓ తమ్ముడికీ బొంబాయిలోనే జన్మనిచ్చారు. మా కుటుంబం వంద చదరపుటడుగుల కొటీడులోనే దాదాపు నాలుగు దశాబ్దాలు గడిపేసింది. నేను కూడా మా పెద్దమ్మాయి పుట్టేంతవరకూ అలాంటి కొటీడులోనే నివసించినవాణ్ణి. బొంబాయిలోని తెలుగు - ముఖ్యంగా తెలంగాణా - ప్రజాజీవితాన్ని అత్యంత సమీపంగా చూసే భాగ్యం నాకు దక్కింది. అందులో ఒకణ్ణయి జీవించే అదృష్టం నాకు దొరికింది. ఆ అనుభవమే నా కథల్లో కనిపిస్తోంద''ని తన రచనలను విశ్లేషించుకున్నారు అంబల్ల జనార్థన్‌. యాభయ్యేళ్ళ జనార్థన్‌ పుట్టింది, పెరిగింది - ఏడాదిక్రితం వరకూ - నివసించిందీ బొంబాయిలోనే. అక్కడి ఆంధ్రా స్కూల్‌ లోనే ఆయన విద్యాభ్యాసం మొదలయి తీగసాగింది. ఆ కారణం చేతనే ఆయనకు చిన్నప్పట్నించీ తెలుగు భాషా సాహిత్యాలతో సామాన్యమయిన పరిచయం ఉంటూనే వచ్చింది. అదే ఆయన అసాధారణ ఆంధ్రాభిమానానికి అంతెరగని మూలంగా కొనసాగుతూ వచ్చింది. మనకో మంచి, నిజాయితీ ఉన్న, జనజీవనం తాలూకు విభిన్నకోణాలు తెలిసిన రచయిత నిచ్చింది.

''బొంబాయిలో తెలుగువాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆ మాటకొస్తే ఆ మహానగరంలో అన్ని రాష్ట్రాల ప్రజల సంఖ్యా బాగానే ఉంది. మిగతా భాషావర్గీయులకీ మనవాళ్ళకీ మధ్య ఒక పెద్ద తేడా నేను గమనించాను. మొన్నమొన్నటివరకూ బొంబాయిలోని తెలుగువాళ్ళను స్థూలంగా రెండువర్గాలుగా విభజించి చెప్పే వీలుండేది. ఒక వర్గం భవన నిర్మాణ కార్మికులయితే, రెండో వర్గం బట్టల మిల్లుల్లో పనిచేసే శ్రామికులు. ఇప్పుడిప్పుడు చాలా విభాగాలకు చెందిన ఉద్యోగులు - తెలుగువాళ్ళు - బొంబాయి చేరి సెటిలయిపోతున్నారు. మొత్తంమీద ఇప్పటికీ శ్రామిక ప్రజలదే పెద్ద మెజారిటీగా ఉంది. బొంబాయిలో తెలుగు పత్రికలు కొని చదివేవాళ్ళలో ఎనభయి శాతం మంది ఈ శ్రామికులే! ఒక్కోసారి నాలుగేసి గంటలు క్యూలలో నిలబడి ఈ శ్రామికులు తెలుగు పత్రికలు కొనుక్కోవడం ఒక ప్రత్యేకత! ఇలాంటి పరిస్థితి మరే భాషా వర్గానికి లేకపోవడం ఇంకో ప్రత్యేకత!!'' అని వివరించారు జనార్థన్‌.

''ముప్ఫై ఒక్క సంవత్సరాలుగా 'ఆంధ్రప్రభ' వీక్లీ పాఠకుణ్ణి నేను. పందొమ్మిదోయేట ఉద్యోగస్థుణ్ణయిన నాటి నుంచీ ఆ పత్రిక క్రమం తప్పకుండా కొంటూనే ఉన్నాను. ఈ మూడు దశాబ్దాల పైచిలుకు కాలంలో నేను చాలా చోట్ల తిరిగాను. కొన్నాళ్ళు బీహార్‌ రాజధాని పాట్నాలో ఉండాల్సి వచ్చినప్పుడు కూడా నేనా పత్రికను కొని చదివాను. అందుకోసం ఇరవైరూపాయలు ఖర్చుపెట్టి, పాట్నా రైల్వేస్టేషన్‌కి పనిగట్టుకుని వెళ్ళేవాణ్ణి. 'రచన' పత్రిక మొదలయింతర్వాత ఆ పత్రికను కూడా క్రమం తప్పకుండా చదువుతున్నాను. ఈ పత్రికల ద్వారానే తెలుగుసాహిత్యం గురించి కొద్దో గొప్పో తెలుసుకోగలిగాను నేను. అందుకే వాటికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగానే ఉంటా''నన్నారు జనార్థన్‌.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X