రావణకాష్టమై రగులుతున్న జోస్యం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌ : ఆంధ్రజ్యోతి వారపత్రిక అర్థంతరంగా ప్రచురణ నిలిపివేసిన రావణ జోస్యం కథ పై తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర మతచాందస సంస్థలనుంచి వచ్చిన వత్తిళ్లకు, బెదిరింపులకు తలవొగ్గి ఈ కథ ప్రచురణను ఆంధ్రజ్యోతి యాజమాన్యం అర్థంతంరంగా నిలిపివేయడాన్ని ఖండిస్తూ స్థానికంగా వున్న విద్యావంతులు, మేధావులు, అభ్యుదయవాదులతోపాటు ప్రవాస భారతీయులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రచయితల భావప్రకటన స్వాతంత్ర్యాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని ప్రముఖ సాహితీ వేత్త వేల్చేరు నారాయణ రావు, తానా పత్రిక ఎడిటర్‌ వి.చౌదరి జంపాల, అమెరికా భారతి ఎడిటర్‌ మురళి చందూరి తదితర ప్రవాసాంధ్రులు 'ఇండియా ఇన్ఫో' కు రాసిన సుదీర్ఘ లేఖలో పేర్కొన్నారు.

జనవరి లో డిఆర్‌ ఇంద్ర అనే రచయిత రాసిన రావణజోస్యం అనే కథను ఆంధ్రజ్యోతి వారపత్రిక మూడు భాగాలుగా ప్రచురించాలని నిర్ణయించింది. కధ తొలిభాగం అచ్చయిన తర్వాత నుంచే పత్రిక సంపాదకులకు బెదిరింపులు ప్రారంభమయ్యాయి. కథ ఇతివృత్తం మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వున్నదని ఆరోపిస్తూ కథ ప్రచురణను తక్షణమే నిలిపివేయాలని ఆర్‌ ఎస్‌ఎస్‌ కు చెందిన వారుగాచెప్పుకున్న వ్యక్తులు వార పత్రిక సంపాదకుడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడును బెదిరించారు. బెదిరింపులకు లొంగకుండా రెండో భాగాన్ని కూడా నామిని ప్రచురించడంతో దాదాపు వందమంది పత్రిక కార్యాలయం పై దాడి చేసి విధ్వంసం సృష్టించడంతోపాటు నామిని పై చేయి కూడా చేసుకున్నారు. ఈ సంఘటన జనవరి 25 న జరిగింది. ఈ సంఘటన తర్వాత కథ ప్రచురణను నిలిపివేయడం తోపాటు ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణకూడా చెప్పుకుంటూ పత్రిక యాజమాన్యం ఒక నోట్‌ ప్రచురించింది.

దాదాపు అప్పటి నుంచి స్థానికంగా ఈ సంఘట పై నిరసన వ్యక్తం అవుతున్నది. భావప్రకటనా స్వేచ్చ, పత్రికా స్వేచ్చపై ఫాసిస్ట్‌ శక్తుల దమనకాండగా అభివర్ణిస్తూ ఈ సంఘటనకు వ్యతిరేకంగా రచయితలు అభ్యుదయవాదులు మేధావులు ర్యాలీ కావడం ప్రారంభించారు. గతవారమే నగరానికి చెందిన రచయితలు సమావేశమై రావణజోస్యం కథను అర్థంతరంగా నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మత చాందసశక్తులు పత్రికా స్వేచ్చపై దాడి చేయడాన్ని దుయ్యబట్టారు. ఈ నేపధ్యంలో అమెరికాలో స్థిరపడిన భారతీయులు ముఖ్యంగా ప్రవాసాంధ్రులతో సహా 150 మంది పైగా రావణజోస్యం కథను అర్థంతంరంగా నిలిపివేయడానికి దారి తీసిన సంఘటనలను ఖండిస్తూ సుదీర్ఘమైన లేఖను విడుదలచేశారు. బెదిరింపులు, గూండాయిజానికి భయపడి, కథ మూడోభాగం ప్రచురించకుండా నిలిపివేయడం ఆపై పాఠకుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెబుతూ ఆంధ్రజ్యోతి వార పత్రిక సంపాదక యాజమాన్యం నోట్‌ ప్రచురించడాన్ని ప్రవాస భారతీయులు ఈ లేఖలో తీవ్రంగా గర్హించారు.

'తెలుగు ప్రజలు తరతరాలుగా భావప్రకటనా స్వేచ్చను, ఆలోచనా స్వేచ్చను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నారు.జరిగిన సంఘటన పర్యవసానాలు మమ్మల్ని తీవ్రంగా కలవరపరిచేట్టుగా వున్నాయి. ఒక ప్రముఖ పత్రిక సంపాదకునిపై దాడిజరపడం, దుండగులకు నిర్లజ్జగా పత్రిక యాజమాన్యం తలవొగ్గడం తెలుగునేలన పాదుకొనివున్న సంప్రదాయాలను ప్రేమించే ప్రతి ఒక్కరికీ మేలుకొలుపు కావాలి.' అని తమ లేఖలో ప్రవాస సాహితీ ప్రియులు పేర్కొన్నారు.

నార్ల వెంకటేశ్వరరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటి మేటి ఎడిటర్ల సారథ్యంలో జర్నలిజంలో అత్యున్నత ప్రమాణాలను నిలబెట్టిన గొప్ప సంప్రదాయం ఆంధ్రజ్యోతి పత్రికకు వున్నదనీ, రాష్ట్ర ప్రభుత్వ బెదిరింపులకు సైతం లొంగకుండా రాజకీయాలకు సంబంధించి తాను నమ్మిన విధానాలనే అనుసరించిన ఘన చరిత్ర ఆంధ్రజ్యోతికి వున్నదని వారు పేర్కొన్నారు. అలాంటి సంప్రదాయం వున్న పత్రిక కొంతమంది ఉన్మాదుల బెదిరింపులకు బేలగా తలవంచడం ద్వారా సమున్నత గత సంప్రదాయానికి తలవంపులు తెచ్చిందని వారు దుయ్యబట్టారు. ఆధునిక తెలుగు రచయితగా లబ్దప్రతిష్టుడైన నామిని పై దుండగలు చేయిచేసుకోవడం ఆ దాడి విషయంలో పత్రికా యాజమాన్యం సరైన పద్దతిలో ప్రతిస్పందించకపోడాన్ని వారు ఖండించారు.

'స్వేచ్చా సమాజంలో, భిన్నాభిప్రాయాలు పరస్పరవిరుద్ధ సిద్ధాంతాలపై చర్చకు తగిన వేదికను అందజేయడం భాద్యతాయుతమైన పత్రికల పాత్ర అన్న విషయాన్ని, ఈ బాధ్యత నిర్వర్తించే విషయంలో సంపాదక సిబ్బంది స్వేచ్ఛకు విఘాతం కలిగితే వారిని కాపాడాల్సిన బాధ్యత పత్రిక యాజమాన్యానిదని ఆంధ్రజ్యోతి వారపత్రిక యాజమాన్యం గుర్తించాల్సిన అవసరం వుంది.'అని వారు పేర్కొన్నారు. కొంతమంది ఉన్మాదులు, గూండాలు బెదిరింపులతో వాక్‌ స్వేచ్ఛను నిరోధించగలిగే పరిస్థితి ఏర్పడితే అది పరమ భయంకరమైన విషమ పరిణామాలకు దారితీసే ప్రమాదం వున్నదని వారు హెచ్చరించారు.

భారతదేశంలో రామాయణానికి ఒక విశిష్ట సంప్రదాయం వున్నదనీ ఆ విశిష్ట సంప్రదాయం కారణంగానే రామాయణం ఇంతకాలం నిత్యనూతనంగా వెలుగుతూ వస్తున్నదని వారు పేర్కొన్నారు. రామాయణానికి అనేక భాష్యాలు, అనేక వివరణలు, పుంఖానుపుంఖలుగా వ్యాఖ్యానాలు వచ్చాయని వారు తెలిపారు. ఇలాంటి సంప్రదాయమే లేకుండా ఒకే పుస్తకం ఒకే వివరణ వుంటే రామాయణ కావ్యం ఏవాడో మూల పడివుండేదని వారు స్పష్టంచేశారు. 'తెలుగులో సైతం భాస్కరరామాయణం, మొల్ల రామాయణం, బుద్ధారెడ్డి రామాయణం రావడాన్ని వారు ప్రస్తావించారు. ఆధునిక కాలంలో కూడా ముద్దు కృష్ణ, చలం, త్రిపురనేని రామస్వామి చౌదరి నార్ల, రంగనాయకమ్మ, విజయలక్ష్మీ, శివసాగర్‌ వంటి రచయితలు రామాయణంపై భిన్న వ్యాఖ్యానాలు, వివరణలతో పాత సాంప్రదాయాన్ని మరింత పండించారు. రచయిత ఇంద్ర రాసిన రావణజోస్యం కథ ప్రచురణ విషయంలో కూడా నామిని ఈ తరతరాల తెలుగు సంప్రదాయాన్నే ముందుకు తీసుకుపోయారు,' అని వారు పేర్కొన్నారు.

భారతీయ సంస్క్రతి పరిరక్షకురాలిలా పోలీసు పాత్ర నిర్వర్తిస్తూ విమర్శలను కండబలంతో గూండాయిజంతో అణిచివేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నదని వారు దుయ్యబట్టారు. ఇలాంటి శక్తులపై చట్టరీత్యా తగిన చర్యతీసుకుని పత్రికా స్వేచ్చ పరిరక్షించాలని, భావప్రకటనా స్వేచ్చను కాపాడాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని వారు కోరారు.

ఈ లేఖ పై సంతకాలు చేసిన ప్రవాసులలో ఈ కిందివారు వున్నారు.

ప్రొఫెసర్‌ వేల్చేరు నారాయణ రావు   మీనా అలెగ్జాండర్‌
షైనా ఆనంద్‌   మిల్లయాల్‌ అన్నమలై
సీతారామయ్య ఆరి   కుల్‌ ప్రీత్‌ బదియల్‌
డాక్టర్‌ వి బాలాజీ   శ్రీకాంత్‌ బండి
అయన్‌ బెనర్జీ   డాక్టర్‌ సుమిత్‌ బోస్‌
సత్యం బెండపూడి   అక్కిరాజు భట్టిప్రోలు
ప్రొఫెసర్‌ డి. చంద్రశేఖరన్‌   మురళి చందూరి
సుధాకర్‌ చెలికాని   శ్రీధర్‌ చింతలపాటి
ప్రసాద్‌ ఎ చోడవరపు   ప్రీతి చోప్రా
సతినాత్‌ చౌదరి   శ్రీనివాస్‌ చుక్కా
జాఫ్రీ కూక్‌   దేబ్జాని దాస్‌
సుప్రియోదాస్‌ గుప్తా   అనన్య దాస్‌ గుప్తా
డాక్టర్‌ లీలారాణి దాస్‌ వర్మ   హర్మిందర్‌ ధిల్లాన్‌
అజయ్‌ దివాకరన్‌   మారుతి దోగిపర్తి
సందీప్‌ దుగాల్‌   ఇరా డ్వార్కిన్‌
ఇలాంగోవన్‌   మౌరీన్‌ ఫడెన్‌
నందితా ఘోష్‌   సుజాతా గిడ్లా
బాబూ ఆర్‌ఆర్‌ గోగినేని   రాజేస్‌ గోపకుమార్‌
లక్ష్మీ గోపరాజు   నవ్‌ జ్యోత్‌ గ్రేవల్‌
లక్ష్మీ గుడిపాటి   ఉమా గుమ్మడవెల్లి
నందిని గుప్తా   సిద్‌ హర్త్‌
జాన్‌ స్ట్రాటన్‌ హవ్లీ   వి చౌదరి జంపాల
ప్రకాశ్‌ జరుగుమిల్లి   డాక్టర్‌ డిఎన్‌ జయసింహా
శ్రీనివాసరావు కలసపూడి   వసుంధరాదేవి కలసపూడి
అజ్మల్‌ కమల్‌ ( ఎడిటర్‌ ఆజ్‌ కరాచీ)   ప్రొఫెసర్‌ సంగీతా కామత్‌
చంద్ర కన్నెగంటి   మహరాజ్‌ కె కౌల్‌

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి