మనిషిని మనిషిగా...: సినారె
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య సి.నారాయణరెడ్డిని ప్రముఖ కథా రచయిత కాలువ మల్లయ్య ఇంటర్వ్యూ చేశారు. కథా సాహిత్యంపై సాగిన ఆ ఇంటర్వ్యూను ఇక్కడ ఇస్తున్నాం.
తొలి తరంలో వచ్చిన తెలంగాణ కథలపై మీ అభిప్రాయం ఏమిటి?
అప్పుడప్పుడే భూమి పొరల్లోంచి పైకి చిమ్ముకొచ్చే నీటి పొంగుల్లాంటి కథలవి. వాటిపైన ఉన్నది ఆ మట్టి ప్రభావమే. తమ పలుకుబళ్లను, తమ పరిసరాలను కలగలుపుకొని ఉదయించిన కథలవి.
కథంటే ఎవరి కోసం? ఎందు కోసం?
ఒక్క మాటలో చెప్పాలంటే కథంటే చదివి అర్థం చేసుకునే సంస్కారం ఉన్న పాఠకుని కోసం. ఇంకా కాస్త వివరంగా చెప్పాలంటే, ఆ కథలో నీ జీవితం లేకపోవచ్చు. ఏదో ఒక జీవితం తప్పకుండా ఉండాలి. నీ ముఖమే లేకపోవచ్చు. నీకు తెలిసిన ముఖాలుంటే చాలు. నిత్య జీవితాన్ని ఫొటో తీసినట్టుగా తీస్తూనే అవసరమైనప్పుడు అక్కడక్కడ రంగులద్ది చూపడం ఉత్తమ కథా లక్షణం. మరి ఈ కథ ఎందు కోసమని అడిగారు- మనిషిని మనిషిగా చిత్రించడం కోసం. నల్లమచ్చలుంటే ఎత్తి చూపి తెల్లని నిజాలను ప్రతిష్ఠించడం కోసం.
కథకున్న లక్షణాలను పునర్నిర్వచిస్తున్నారు? ఇప్పుడు చేస్తున్న నిర్వచనాలపై మీ అభిప్రాయం ఏమిటి?
ఒకనాడు చేసిన నిర్వచనం కలకాలం ఉండాలనుకోకూడదు. మారుతున్న కాలాన్ని బట్టి నిర్వచనాలు, ప్రవచనాలు మారుతుంటాయి. ఇప్పుడు రుతువులు ఆయా మాసాల విభజనను బట్టి మారడం లేదు. చైత్రమాసంలో వసంతం వస్తుందన్నారు. ప్రకృతి కాల పరిస్థితుల్లో ఒక్కొక్కసారి వసంతం రాకలో విలంబనం జరుగవచ్చు. కాబట్టి సమకాలీన పరిస్థితులను బట్టి, పాఠకుల ఆదరణను బట్టి పునర్ నిర్వచనాలు అవసరమేమో.. తెలంగాణ నుంచి వస్తున్న కథా సంపుటాలపై మీ అభిప్రాయం..మరే ఇతర ప్రాంతానికీ తీసిపోని కథా సంపుటాలు వస్తున్నాయి. ఈ దశాబ్దిలో కవితలతో పాటు కతల వెల్లువ కూడా గణనీయస్థాయిలో ఉంది.
కథంటే సమగ్ర సామాజిక చిత్రణ'- దీని గురించి మీరేమంటారు?
కాదనే వాళ్లెవరో నాకు బోధపడటం లేదు. ఆనాటి అనగనగా ఒకరాజు మొదలుకొని అమ్మమ్మలూ, అవ్వలూ చెప్పిన పిట్టకథలన్నీ అప్పటి సమాజానికి పట్టిన అద్దాలే. అయితే మనిషి వైజ్ఞానికంగా పురోగమిస్తున్నాడు. వర్తమానదశలో కథకున్న విస్తృతి పెరిగింది. ఇతివృత్తాల్లో వైవిధ్యం, కథనంలో వైచిత్రి ఇతోధికంగా పెరిగింది. ఎన్ని ఎత్తులకెదిగినా సమాజాన్ని విస్మరిస్తే అది నేల విడిచిన సామే.
తెలంగాణ కథ భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?
కథ భవిష్యత్తు గురించి జోస్యం చెప్పాలంటే అందుకు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అంటూ ప్రాంత భేదాలుండవు. సాంకేతిక యుగంలో, యాంత్రిక వాతావరణంలో హృదయ స్పందనలకు వాహికగా ఉన్న కథ బతికి ఉంటుందా లేదా అని ప్రశ్నించుకోవాలి. కథంటూ బతికి ఉంటే తెలంగాణ కథ కూడా ఉజ్వలంగానే ఉంటుంది. ఇందుకు సాక్ష్యం ఇప్పుడు వెలువడుతున్న ఉత్తమస్థాయి కథలే.
తొలి, మలి, తర్వాతి తరాల్లో తెలంగాణ కథపై విశేష ప్రభావం చూపిన కథకుల గురించి వివరిస్తారా?
నో కామెంట్












Click it and Unblock the Notifications