నాగరికతను ఓడించిన కవి

''మరో పుస్తకానికి మరో పదేళ్లు తీసుకోవద్దని'' ప్రముఖ కవి కె. శివారెడ్డి కృష్ణమూర్తి యాదవ్‌ను అభ్యర్థించారు. మార్చి 2000లలో వెలువరించిన కవితా సంపుటి 'శబ్నం'కు రాసిన ముందుమాటలో శివారెడ్డి ఆ అభ్యర్థన చేశారు. ఆ అభ్యర్థనను మన్నించేందుకు తెలంగాణ పల్లెకవి కృష్ణమూర్తి యాదవ్‌ ముందుకు కదిలారు. తన మరో కవితా సంకలనం వెలువరించేందుకు వాహనంపై తిరుగుతూ ప్రమాదానికి గురయ్యారు. అంతే ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఈ నెల 25వ తేదీన ఆయన గొంతు శాశ్వతంగా మూగబోయింది. తెలంగాణ గుండె చెరువైంది.

ఆయన 63 ఏళ్ల వయస్సులో కవిత్వం గురించి యువకుడిలా ఆలోచించేవాడు. ప్రతి సాహిత్య సమావేశానికి ప్రేక్షకుడిగా హాజరయ్యేవారు. సహృదయత, ఎదుటి వారిని అక్కున చేర్చుకునే ఆత్మీయత ఆయన మాటల్లో, చేతల్లో కనిపించేది. తెలంగాణ మాండలికాన్ని కవిత్వీకరించిన కొద్ది మంది కవుల్లో కృష్ణమూర్తి యాదవ్‌ ఒకరు. 'తొక్కడుబండ' అనే తెలంగాణ మాండలిక కవితా సంపుటిని ఆయన 1988లో వెలువరించారు. ఆ తర్వాత దాదాపు 12 ఏళ్లకు 'శబ్నం' కవితా సంకలనం వెలువరించారు. ఈ రెండు కవితా సంకలనాల మధ్య ఉన్న ఇంత కాలవ్యవధిని దృష్టిలో పెట్టుకునే శివారెడ్డి కృష్ణమూర్తి యాదవ్‌కు ఆ విజ్ఞప్తి చేశారు.

కృష్ణమూర్తి యాదవ్‌ 1988లో తొక్కుడుబండ కవితా సంపుటి వెలువరించేనాటికి తెలంగాణ మాండలికంలో మూడే కవితా సంపుటులు వెలువడ్డాయి. అవి డాక్టర్‌ దేవరాజు మహరాజు 'గుడిసె గుండె', పంచరెడ్డి లక్ష్మణ 'ఇసిత్రం', భాను 'ఊరోల్లు'. మొదటి రెండు కవితా సంపుటాలు 1973-74లలో కొద్ది రోజుల తేడాతో వెలువడ్డాయి. ఊరోల్లు 1983లో వెలువడింది. ఆ తర్వాత అర్థశతాబ్దికి కృష్ణమూర్తి యాదవ్‌ 'తొక్కుడుబండ' తెలంగాణ భాషలో పలుకరించి హత్తుకుంది.

కృష్ణమూర్తి యాదవ్‌ తన కవిత్వంలో ప్రజల కన్నీళ్లను, ఆనందాలను, విషాదాలను చిత్రీకరించారు. అందుకు ఆయన కవిత్వం మాండలికంలో ఉన్నా అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణను చూరగొన్నది. ఆయన వ్యక్తిత్వం లాగే ఆయన కవిత్వం కూడా సరళమైంది. సంక్లిష్టతలు, ఆడంబరాలు ఆయన కవిత్వానికి దూరం. హైదరాబాద్‌ నగరంలో ఉన్నా ఆయన భాష కలుషితం కాలేదు; వ్యక్తిత్వం కలుషితం కాలేదు. తమ భాషను, వ్యక్తిత్వాన్ని కాపాడుకునే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి కొద్ది మందిలో కృష్ణమూర్తి యాదవ్‌ ఒకరు. ఆయన కవి కూడా కావడం సాహిత్య లోకానికి మరింత మానుషత్వాన్ని ప్రసాదించింది.

'కృష్ణమూర్తి యాదవ్‌ ముందు నాగరిక ప్రపంచం ఓడిపోయింది..... భాషలో, యాసలో, ఊహలో, ఊపిరిలో - ఆయనలోని బాహ్య అంతర ప్రపంచాలన్నింటిలో ఒక సామాన్యుడే కనిపిస్తాడు. సామాన్యుడి ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని అక్షరాల్లోకి చేసిన అనువాదమే ఆయన కవితలు.' అని డాక్టర్‌ దేవరాజు మహారాజు మాటలు అక్షర సత్యాలు. ఆయన మరణం వల్ల తెలుగు సాహితీ ప్రపంచం ఒక మంచి మిత్రుడిని కోల్పోయింది. కవిత్వ ప్రపంచం సారళ్యాన్ని పోగొట్టుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+