వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యష్టి సమస్యలకు సమష్టి ప్రయోజనాలుండవు: వసీరా

By Staff
|
Google Oneindia TeluguNews

''ఉద్యమాలు కవుల్ని సృష్టిస్తాయంటే నేనొప్పుకోను, కవుల పుట్టుకకు దారి తీసే వాతావరణాన్ని ఉద్యమాలు సృష్టిస్తాయి. అంతవరకే! కవుల ఆవిర్భావక్రమంలో వాళ్ల వాళ్ల వ్యక్తిగతమయిన- వ్యక్తిపరమైన అంశ పాత్ర 80 శాతం వరకూ ఉంటే, పరిసరాల పాత్ర 20 శాతం మాత్రమే. ఈ 'పరిసరాల'లోనే ఉద్యమాలూ అవి సృష్టించే వాతావరణమూ కూడా లెక్కకొస్తాయి''-ఇది వసీరా చేసిన సూత్రీకరణ! ''నిర్దిష్టమైన ఉష్ణోగ్రతలో కోడిగుడ్డు పిల్లగా మారుతుంది. అయితే అదే ఉష్ణోగ్రత కల్పించినంత మాత్రాన కంకరరాయి కోడిపిల్లగా మారుతుందా? కవితాంశ కోడిగుడ్డులాంటిదయితే, ఉద్యమ వాతావరణం ఉష్ణోగ్రతలాంటిది మాత్రమే. అందుకే అనేది-ఉద్యమాలు కవులను సృష్టించవని''- ఇది వసీరా ఇచ్చిన సోదాహరణ వివరణ!

''ఐడియాలజీ ఇంటి గడప దగ్గిరే ఆగిపోతుంది. సామాజిక సమస్యలకు సామూహిక, సమష్టి పరిష్కారాలు ఐడియాలజీలో ఖచ్చితంగా దొరుకుతాయి. కానీ వ్యక్తిగత సమస్యలకూ కేవలం వ్యష్టి స్వభావం ఉండే ప్రశ్నలకూ ఐడియాలజీలో సమాధానాలు దొరకవు. పిడుక్కీ బిచ్చానికీ ఒకే మంత్రం చదివినట్లు వ్యష్టి, సమష్టి, సామూహిక, సామాజిక సమస్యలన్నింటికీ ఐడియలాజికల్‌ పరిష్కారాలు సిఫారసు చేస్తూ పోవడం వల్ల గొప్ప విధ్వంసం జరిగిపోయిం''దని వసీరా ఆవేదన వ్యక్తం చేశాడు. ''తలనొప్పులు తొంభయి రకాలు. ఒక్కో తరహా తలనొప్పికి ఒక్కో కారణం వున్నట్లే, ఒక్కో విధమైన చికిత్స కూడా వుంటుంది. అలా కాకుండా అన్ని రకాలయిన తలనొప్పులకీ ఒకే మాత్ర-ఒకదానికి తగ్గకపోతే రెండు- తగిలించేయమని సిఫారసు చెయ్యడం శాస్త్రీయమూ కాదు, బాధ్యతాయుతం కానే కాదు! ఈ విధానంలో మందుల కంపెనీల సంక్షేమానికి ఉన్నంత ప్రాముఖ్యం రోగుల ఆరోగ్యానికి లేనే లేదు. ఐడియలాజికల్‌ సర్వరోగనివారిణులను బలవంతంగా అంటగట్టే సర్వజ్ఞులక్కూడా బాధితుల బాగోగుల కన్నా భావజాలం చెలామణీయే ముఖ్యం. నా దృష్టిలో ఇది పెట్టుబడిదారీ వాణిజ్య విషసంస్కృతి ప్రభావంలో పడిపోవడమే''నని వసీరా విమర్శనాత్మకంగా విశ్లేషించారు.

''దళితుల ఆవేదనను విడిగా కాకుండా, కలివిడిగా పరిశీలించాలన్నది నా దృఢాభిప్రాయ''మన్నారు వసీరా. మానవాళి అనుభవిస్తున్న విస్తృత వేదనాజాలంలో భాగంగానే దళితుల వేదనను నేను దర్శిస్తాను. దాన్ని వేరు చేసి, ఇండివిడ్యువల్‌ ఫినామినన్‌గా పరిగణించడం వల్ల దళితులకు మేలుకు బదులు కీడే జరుగుతుందన్నది నా అవగాహన'' అన్నారాయన. ''ప్రతి ఒక్క ఉద్యమంలోనూ, దాని ప్రభావంలో రూపొందే ఉద్యమసౌందర్యంలోనూ భిన్న పార్శ్వాలుంటాయి. వాటిని కలర్‌ఫుల్‌గా రిఫ్లెక్ట్‌ చేసేవాడే కళాకారుడు. ఉద్యమాల ఫలితంగా తలెత్తే వికృతాలనూ విపరీతాలనూ మాత్రమే కొందరు ప్రతిఫలింపచేస్తుంటారు. అది ఆయా కళాకారుల వ్యక్తిగత 'ఆరోగ్య' సమస్య మాత్రమేనన్నది నా అభిప్రాయ''మన్నారు వసీరా. ''మిగతా అన్ని ఉద్యమాల్లో లాగానే దళిత ఉద్యమంలో కూడా అన్ని అవలక్షణాలూ పరిమితులూ తలెత్తుతూనే ఉన్నాయి. అదే విధంగా, ఆ ఉద్యమం ఫోల్డ్‌లోకి వచ్చినవాళ్లలో అద్భుతమైన కవిత్వం రాసినవాళ్లూ వున్నారు. ఈ రెండు పరిణామాలకూ ఆయా వ్యక్తుల వ్యక్తిగతమయిన పరిమితులూ విస్తృతులే కారణాలు తప్ప ఉద్యమం కాదన్నది నా విశ్వాసం'' అన్నారాయన.

''లోపం నాదో, వాళ్లదో తెలియదు కానీ సమకాలికుల రచనలు ఎంజాయ్‌ చెయ్యలేకపోతున్నాన్నేను'' అంటున్నారు వసీరా. ''గురజాడ భుజాలపై నిలబడి భవిష్యత్తును దర్శించే మహదవకాశాన్ని మన పరం చేసింది చరిత్ర. కానీ మనం ఆయన మోకాలి ఎత్తుక్కూడా ఎదగలేక మూలుగుతున్నాం'' అని ఆవేదన ప్రకటించారాయన. ''గాఢమయిన భావుకత, తీవ్రమయిన ఆగ్రహం అంతర్వాహినులుగా లేని కవిత్వాన్ని నేనెన్నడూ ఎంజాయ్‌ చెయ్యలేను. ఇక వచనం విషయానికొస్తే సంఘర్షణలూ, రాగద్వేషాలూ, నిశితపరిశీలనా, లోతయిన విశ్లేషణ, నిపుణమైన పాత్రోన్మీలన-ఇవంటే నాకెంతో యిష్టం'' అన్నారు వసీరా.

''పత్రికల వల్ల కవిత్వానికి మేలయితే జరగలేదని చెప్పగలను'' అంటారు వసీరా. ''హాని జరిగిందనీ అనుకోను. ఎవరికి వాళ్లే కవులు ఆత్మహాని చేసుకున్నారు తప్ప నెపం పత్రికల మీద వెయ్యడం అనవసరం-అన్యాయం కూడా. ఇక కవిత్వం కారణంగా పత్రికలకు ఎలాంటి నష్టం జరగలేదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. పైపెచ్చు పత్రికపాఠకుల్లో కొత్తవర్గాన్ని సృష్టించింది కవిత్వం'' అన్నారాయన. ''కాఫీ క్లబ్‌ కల్చర్‌కూ ఇదే వర్తిస్తుంది. ప్రగాఢమయిన కవితాత్మ ఉన్న కవుల మీద ఈ హోటల్‌ సమావేశాలు మంచి ప్రభావమే చూపించాయి. తద్భిన్నమయిన కేసుల్లో భిన్నమయిన పరిణామాలూ సంభవించాయి. ఏతావాతా తేలేదేమిటంటే సదరు కవిలో సరుకు ఉందా లేదా అన్నదే సమస్య తప్ప కాఫీ క్లబ్‌ కల్చర్‌ మంచిదా కాదా అన్నది సమస్యే కాదు'' అని తేల్చేశారు వసీరా.

''శ్రీశ్రీ సప్తతిపూర్తి సభకు వెళ్లినప్పుడు-1980లో- మయ్‌కోవస్కీ లెనిన్‌ కావ్యానికి మహాకవి అనువాదాన్ని కొనుక్కుని, దారమ్మటే చదివేశాను. వాడుక మాటల్లో గొప్ప పదచిత్రాల సాయంతో ఉదాత్తమయిన విషయం చెప్పి పాఠకుడిలో భావావేశం పొంగులెత్తించడం నాకు తెగ నచ్చేసింది. అప్పట్నుంచి దాదాపు వచనంలాంటి శైలిలో సాదాసీదా మాటలతో రాసేవాణ్ని. ఓ రోజు పెమ్మరాజు గోపాలకృష్ణ గట్టిగా మందలించి, నన్ను తిరిగి నా దారిలో పెట్టా''డని జ్ఞాపకం చేసుకున్నారు వసీరా.

''పదేళ్ల పాటు సౌదా రచనల్ని బాగా ఎంజాయ్‌ చేశాను. ఇటీవల అతనెందుకో రాయడం తగ్గించేశాడు''అంటూ వసీరా బాధపడ్డారు. ''విమర్శకుల విషయానికొస్తే కొడవటిగంటి కుంటుంబరావులాగా అన్ని కోణాల నుంచి చూసి, చూపించేవాళ్లు మరొక్కళ్లు కూడా నా దృష్టికి రాలే''దని వసీరా అంటుండగా హోటల్‌ గడియారం ఠంగుఠంగుమని పన్నెండు గంటలు కొట్టింది. వసీరా ఉలిక్కిపడి లేచారు. ''బాబాగారికి హరతిచ్చే టైమయింది-నేనలా గుళ్లోకెళ్లొస్తా''నంటూ వడివడిగా సాయిబాబా మందిరం వైపు అడుగేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X