ప్రేమపూరిత 'సామాన్య' కథలు

Kandukuri Rameshbabu
మనం నలుగురు నడిచి నలిగిపోయిన తొవ్వ మీద నడుస్తుంటే పిల్లలు పిల్లదారులు దేవులాడుతుంటారు; చెట్టునూ పుట్టనూ తరచి తరచి కళ్లతో, చేతులతో చూస్తుంటారు. ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలనే జిజ్ఞాస నుంచి పుట్టిన అన్వేషణ అది. మనిషిలో ఈ లక్షణం ఉండనే ఉంటుంది. కొందరిలో ఇతరత్రా విషయాలు ప్రధానమైపోయి అది గూడుకట్టుకుని పోతుంది. ఆ జిజ్ఞాసను బతికించుకున్నవాడు కందుకూరి రమేష్‌బాబు. చెప్పుకోవలసి వస్తే రమేష్‌ చాలా మంది ఒక జర్నలిస్టు. అయితే అతను సచివాలయానికి, అసెంబ్లీకి ఎన్నిసార్లు వెళ్లాడంటే చెప్పడం కొంచెం కష్టమే. అందుకని చాలా మందికి ఇతను జర్నలిస్టుగా తెలుసో తెలియదో చెప్పడం అంత తేలిక కాదు. అదంత ముఖ్యం కాదు. కానీ జర్నలిస్టుగా అతనికి ఓ ప్రత్యేకత ఉంది. నేను 'సుప్రభాతం'లో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా ఉన్నప్పుడు రమేష్‌తో కలిసి పని చేసే అవకాశం లభించింది. కొత్త ఆలోచనలను ముందు పెట్టి అతను సవాల్‌ విసురుతాడు. ఆ ఆలోచనను విన్నప్పుడు అది మొదట అనవసరమైందిగానూ, ఆ విషయం మన మాటల ద్వారా అర్థం చేసుకుని మనలను ఒప్పించడానికి అతను సర్వం సిద్ధం చేసుకున్నవాడిలా ఒక్కొటొక్కటే తన ఆలోచనాతరంగాలను మాటలను పరుస్తూ పోతుంటాడు. అలా కొద్దిసేపు గడిచిన తర్వాత అతను చెప్పే ఆలోచనలను ఆచరణలో పెట్టడం కష్టమనిపిస్తుంది. మనం మెత్తబడ్డామని తెలిసిన తర్వాత దాన్ని ఆచరణలో పెట్టే పనిని కూడా తన భుజాల మీద వేసుకుంటాడు. ఆ తర్వాత మనం ఆ పని గురించి గానీ, రమేష్‌గురించి గానీ పట్టించుకోవలసిన అవసరం ఉండదు. అలా తనకు నచ్చిన పనిని తనకు ఇష్టమైన పద్ధతిలో మనం ఇష్టపడేలా చూసి చూపిస్తాడు. అలా ఇష్టమైన పనిని మనసు పెట్టి చేయాలనే జీవనతాత్త్వికత రమేష్‌దని నాకు ఆ విధంగా అర్థమైంది.

జర్నలిస్టుగా తనకు ఇష్టమైనపని అందరికీ ఇష్టమైన పనిగా ఎలా మారుతుందో అది గరక మీది తాజా నీటి చుక్కలా ఎలా మెరుస్తుందో 'కోళ్ల మంగారం, మరికొందరు' అనే పుస్తకం ద్వారా లోకానికి కూడా అనుభమయ్యే సన్నివేశాన్ని కందుకూరి రమేష్‌బాబు కల్పించాడు. ఈ పుస్తకంలో 18 యధార్థ జీవన దృశ్యాలున్నాయి. అంటే 18 మంది వ్యక్తిగత జీవితాలున్నాయి. ఈ 18 మంది చుట్టూ అల్లుకొని మరి కొంత మంది జీవితాలున్నాయి. వీరందరూ సాదాసీదాగా కనిపించేవారే. అయితే వారిందరిలో ఏదో ఒక విశిష్టత ఉంది. జీవన తాత్వికత ఉంది. రమేష్‌ పట్టుకున్న వ్యక్తులు ధగధగ మెరిసే కీర్తికిరీటాలు ధరించి, ఆ వెలుగులో మన కళ్లను మూసేసేవారు కారు. అయితే వీరిలో చాలా మంది ఎంతో మంది కన్నా గొప్పవాళ్లు. ప్రజలతో ముడివేసుకుని చేసిన, చేస్తున్న ప్రయాణం వారిది. తమ ప్రయాణానికి అర్థం కల్పించుకున్నవారు. కోళ్ల మంగారం అనే ఆర్టిస్టునే తీసుకుంటే మనకు ఆశ్చర్యంతో నోరు తెరిచే విషయాలు తెలుస్తాయి. ఇతనో ఆర్టిస్టు. ఇతను చికెన్‌ సెంటర్‌ల కోసం వేసిన కోడిపుంజు ఎంత ప్రఖ్యాతి వహించిందో రమేష్‌ పుస్తకం చదివితే తప్ప తెలియలేదు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జనానికి మంగారం బొమ్మలు తెలుసు. కానీ అతను తెలియదు. ఈ పుస్తకంలోని సత్యశ్రీనివాస్‌, కాపు రాజయ్య వంటి కొద్ది మంది మనకు తెలిసినవారే. కానీ వారి జీవిత విధానానికి, వారు చేసే పనికి మధ్య ఉన్న సంబంధమేమిటో, వారి జీవిత దృక్పథమేమిటో మనకు తెలియదు. రమేష్‌ దాన్ని మనకు తెలియజేస్తున్నాడు.

విజయ గురించి, శంకర్‌ గురించి రమేష్‌ రాసింది చదివినప్పుడు ఇది నిజమా అని ఆశ్చర్యపోతాం. జీవితాలు ఇలా కూడా ఉంటాయా అనిపిస్తుంది. కానీ అటువంటి జీవితాలు చాలా వున్నాయని వారిద్దరి గురించి చదివిన తర్వాత మనం అర్థం చేసుకోవచ్చు. అయితే జర్నలిస్టుగా ఆ విషయాలను రమేష్‌ ఎలా రాబట్టాడా అనే సందేహం కలుగుతుంది. వారి నుంచి సమాచారం అటువంటి సమాచారం రాబట్టడానికి మనం ఎలా వ్యవహరించాలి, వారితో సంబంధాలు ఎలా నెలకొల్పుకోవాలి అనేవి అంతుబట్టని విషయాలుగా మారిపోతాయి. జర్నలిస్టులు తమ కన్నా కిందివారి, శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే 'అధో జగత్సహోదరుల' జీవిత చరిత్రలు వెలికి తీయడానికి మనం అనుసరించాల్సిన 'వాహకం' ఏది? ఈ విషయంలో రమేష్‌ నుంచి నేర్చుకోవాల్సింది ఉంటుంది.

నిజానికి, అట్టడుగున పడి కాన్పించని వ్యక్తులను గుర్తించడమే కష్టమైన పని. రమేష్‌ ఇంత మందిని ఎలా ఏరికోరి ఎంచుకున్నాడనేది, అందుకు అతను అనుసరించిన పథకం ఏమిటనేది అతని నుంచి వినాల్సిందే. ఇదే విషయం అడిగితే ఇప్పుడిప్పుడు కొంచెం తేలికవుతోంది. కొన్ని కథలు రాశాను కదా, కొంత మంది ఫోన్‌లు చేసి, కలిసి అటువంటి వ్యక్తుల గురించి తెలియజేస్తున్నారని చెప్తాడు. అలా చెప్పినప్పుడు అతని కళ్లలో వెలుగు కనిపిస్తుంది. ఆదిల్‌, రబ్బానీల కథ చదువుతున్నప్పుడు ఒక మంచి ఆర్ట్‌ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చేతులను, కాళ్లను గాలిలో ఊపుతూ చేసే 'యుద్ధాన్ని' మనం ఎప్పుడూ మరిచిపోలేం. ఆ చిన్ని యోధుడు కనిపిస్తే ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అతని ఆవేశం, మసి బూడిదై పోతున్న అతని కలలు, వాటిని అతను వ్యక్తపరిచే తీరు మనలను అనూరులను చేసి వెక్కిరిస్తాయి. అల్తాప్‌, ఖలీల్‌ల కథలు, గుడికాడి చిన ఐలయ్య, గర్భ నిరోధ్‌, మేఘరాజ్‌ అగర్వాల్‌ల కథలు చదువుతున్నప్పుడు మనుషులందరూ ఇలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. జీవితం పట్ల వారికి ఉన్న నిబద్ధత మాటల్లో చెప్పడం కొంచెం కష్టమే. రమేష్‌ కథలు చదివితే మనకు అది అర్థమైపోతుంది. అలా లేనందుకు మన మీద మనకు సిగ్గు వేస్తుంది. మేఘరాజ్‌ అగర్వాల్‌ కథ చదివినప్పుడు పశువుల మీద విపరీతమైన బెంగ కలుగుతుంది. అతను 'వెళ్లిపోయిన' తర్వాత ఆ 60 పశువులు ఏమైపోతాయనే బెంగ అది. దిక్కులేని పిల్లల్లాగా గుక్క పట్టి ఏడ్చి ఉసూరుమంటాయేమోననే భయం నుంచి పుట్టే బెంగ. అంటే వాటి ఆలనాపాలనా చూసే మేఘరాజ్‌ వారసులు ఈ సమాజంలో లేరనే మాటల్లో చెప్పలేని కలిగే బెంగ అది.

సుభాని అలియాస్‌ శైలి కథ ఇటు సాహిత్యానికి, అటు జర్నలిజానికి ఒక కొత్త కోణం. జీవన కారుణ్యం మేఘరాజ్‌ అగార్వల్‌లోనే కాదు, పట్టుపురుగును చంపకుండా పట్టును తీసి చీర నేసే విధానానికి శ్రీకారం చుట్టిన కుసుమ రాజయ్యలోనూ కనిపిస్తుంది. మాట్లాడే బొమ్మలకు జానపద బాణీలు నేర్పిన మల్లెల సుధాకర్‌ గురించిన కథ మనకు ఆనందాన్ని, ఆ కళాకారుడి పట్ల ప్రేమతో కూడిన అభిమానాన్ని పెంచుతుంది. తూర్పాటి కృష్ణ పద్యానికి, తన జీవితానికి లంకె కుదుర్చుకుని ఈ సమాజంలో స్వచ్ఛమైన నీటిబొట్టులా ఎలా జీవిస్తున్నాడో రమేష్‌ ఆవిష్కరించాడు. కొలచల చంథ్రేఖర్‌ జీవన తాత్వికతను, దాని ఆచరణను చదివి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ పుస్తకంలో కొందరు కళాకారుల కథలున్నాయి. వీరు తమ జీవితానికి, సమాజ శ్రేయస్సుకు మధ్య సంబంధాన్ని కుదుర్చుకుని ఎలా జీవిస్తున్నారో, తమ కలలను సాకారం చేసుకోవడానికి ఎంతగా తపన పడుతున్నారో తెలుస్తుంది. విజయరామ్‌, రమణారెడ్డి, జెల్లి మధు, గుండా ఆంజనేయులు అలియాస్‌ పాపర్‌ లాంటి కళాకారుల కథలు, వారి కలలూ పుస్తకం నిండా పరుచుకుని మనలను పలకరిస్తారు. ఇలా చూస్తే ఆర్టిస్టుల కథలు ఈ పుస్తకంలో ఎక్కువగా ఉన్నాయి. రమేష్‌ స్వతహాగా ఆర్టిస్టు, కవి. ఇంత మంది ఆర్టిస్టుల కళానైపుణ్యాలను పరిశీలించి, విశ్లేషించిన రమేష్‌ ఆర్టిస్టుగా మన ముందుంచుబోయేదేమో చూడాలి.

ఈ కథల నిండా జీవనపోరాటం కనిపిస్తుంది. జీవితం పట్ల ఆశ కనిపిస్తుంది. చిన్న చిన్న వాటినే కాదు, పెద్ద పెద్దవాటిని సాధిస్తూ కూడా మామూలుగా జీవించే వ్యక్తులున్నారు. తామెవరినో, దేన్నో ఉద్ధరిస్తున్నామనే 'గొప్పలు' పోయే వ్యక్తులను తన ప్రాజెక్టు నుంచి రమేష్‌ దూరం పెట్టడం గొప్ప రిలీఫ్‌. అలా పెట్టడానికే అన్నట్లు ఈ పుస్తకానికి 'సామాన్యుల పరిచయ వ్యాసాలు' అనే ఉప శీర్షిక పెట్టాడు. సమాజం కోసం తాము చేస్తున్న కార్యాన్ని తమ వ్యక్తిగత జీవితంగానే భావించి తమ రక్తంలో జీర్ణం చేసుకుని ఆచరిస్తున్నవారే చాలా మంది ఈ పుస్తకంలో ఉన్నారు. ఈ పుస్తకం చదివిన తర్వాత మనకు జీవితం మీద అనంతమైన ప్రేమ పుడుతుంది. మనుషులు మీద మమకారం పెరుగుతుంది. పుస్తకం చదివిన తర్వాత ఈ కథలోని వ్యక్తులను కలుసుకోవాలనే కోరిక పుడుతుంది. అది గ్రహించాడేమో రమేష్‌ వారి చిరునామాలు కూడా ఇచ్చాడు.

రమేష్‌ చెప్పిన ఈ కథల్లో మంచి శిల్ప నిర్మాణం ఉంది. కేవలం గీతలు గీసి బొమ్మలు వేయకుండా ఆ బొమ్మల్లో మనుషులూ, జీవితాలూ, మొత్తానికి సమాజానికి పనికి వచ్చే అంశాలు అంతర్లీనంగా పరుచుకుంటూపోయాడు. జీవిత సందేశాన్ని మనకు అందించాడు. నాకు తెలిసి రమేష్‌ వాక్యనిర్మాణం మీద చాలా కృషి చేశాడు. నా వాక్యనిర్మాణాన్ని తరిచి తరిచి చూసేవాడు. నేనేదో ప్లాన్‌ వేసుకుని వాక్యం రాస్తున్నట్లు నన్ను ఆరా తీసేవాడు. నాకు వాక్యనిర్మాణంలో ప్రత్యేకమైన పథకం ఏదీ లేదని చెప్తే వినేవాడు కాదు. మొత్తం మంచి వాక్యనిర్మాణాన్ని పట్టు బట్టి సాధించిన తర్వాతనే రమేష్‌బాబు ఈ కథలు రాశాడు. తెలుగు సాహిత్యంలో కథానికా సాహిత్యానికి, జర్నలిజంలో కొత్త వరవడికి 'కోళ్ల మంగారం, మరి కొందరు' అనే పుస్తకం ద్వారా అతను దారి చూపుతున్నాడు. అన్నింటినీ మించి ఈ పుస్తకం చదివిన తర్వాత మన ఆత్మలు ప్రకాశవంతమవుతాయి. తెలుగులో ఇటువంటి ప్రేమపూరిత కథలను మనకు అందించిన రమేష్‌ను మెచ్చుకోకుండా ఉండలేం.

- కాసుల ప్రతాపరెడ్డి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+