వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తత్వాన్ని బోధపరిచే కవిత్వ వర్ణాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

B Narasingh Rao
'రంగులకల' సినిమా చాలామందే చూసి వుంటారు. బి. నరసింగరావు కవిత్వంలోని ప్రతీకలను మనసు మునివేళ్లతో స్పృశిస్తూ వుంటే 'రంగులకల' సినిమాలో తాను గీసిన చిత్రాన్ని ఫ్రేమ్‌ కట్టి దాన్ని పట్టుకుని నడుస్తున్న కళాకారుడు గుర్తొచ్చాడు. గదిలో అశాంతితో రగిలిపోతూ సిగరెట్ల మీద సిగరెట్లు కాలుస్తూ పీకలను చెల్లాచెదురుగా పడేసే కళాకారుడి కన్నా చిత్రాన్ని చేతితో మోస్తూ సుదీర్ఘమైన ఆలోచనాముద్రతో నడుస్తూ ముందుకు సాగే కళాకారుడే నరసింగరావు కవిత్వంలో కన్పిస్తాడు. మనసు పొరల్లో ఆలోచనాతరంగాలు ఎగిసిపడుతుంటే తీరమేదో చేరే ప్రయత్నం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. తెలుగు కళారంగంలో నరసింగరావుది ఒక ప్రత్యేకమైన స్థానం.

కళాసౌందర్యానికి, భౌతిక ప్రపంచానికి మధ్య హద్దులు చెరిపేసే ప్రయత్నం ఆయన కళాసృష్టిలో కనిపిస్తుంది. కళాకారుడిగా ఆయనది బహుముఖ వ్యక్తిత్వం. చిత్రకళ, సినిమా, ఫొటోగ్రఫీ, కవిత్వం - ఇలా ఆయన కళాప్రయాణం సాగుతున్నది. ఏది తీసుకున్నా ఆయన దానిలో తనదైన వ్యక్తిత్వశైలిని అద్దుతారు. నిశ్శబ్దాన్ని ఆయన ఆశ్రయిస్తారు. ఆర్తితో కూడిన ఈ నిశ్శబ్దం చేసే దిక్కులు పిక్కటిల్లే శబ్దం గుండె పొరలను చీల్చేంత శక్తిమంతమైంది. ఆయన కవిత్వం, చిత్రాలు, ఆయన ప్రాణం పోసిన సినీదృశ్యాలు 'స్టిల్‌ ఫొటోగ్రఫీ'లా కనిపిస్తూ ఏకకాలంలో అనేకార్థాలను వెల్లడించే ప్రయత్నం చేస్తాయి. ఆయన కవిత్వమంతా చదివిన తర్వాత పాఠకులకు కలిగే భావన ఇది. వైరుధ్యాలను రద్దుచేసి ఏకకాలంలో విరుద్ధాంశాల కవిత్వ చిత్రరూపాలను ఆయన మనకందిస్తారు.

ఒక దశాబ్దకాలంపాటు ఆయన ఎడతెరిపి లేకుండా కవిత్వం రాసినట్లు కనిపిస్తున్నారు. 'రంగులూ - రాగాలూ', 'రసరూప', 'అనూహ్య', 'అద్దం', 'సృష్టి' - వీటిని ఆయన కవిత్వ సంపుటాలుగా పరిగణించవచ్చు. ఇవన్నీ వివిధ పత్రికల్లో ధారావాహికంగా అచ్చయినవే. 'రంగులూ - రాగాలూ' మాత్రం పుస్తకంగా వచ్చింది. ఇంగ్లీషు, తమిళం, ఉర్దూ భాషల్లోకి కూడా అనువాదమైంది. మిగతావి పుస్తక రూపాల్లో రావలసినవి. అప్పుడప్పుడూ చదివినప్పటి కన్నా ఆయన కవిత్వాన్నంతా ఒకేసారి చదివితే ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. వెన్నెలను దోసిలి పట్టి మనసు లోతుల్లోకి వంచుకున్నట్లు అనిపిస్తుంది. 'చలినెగళ్లతో/ కాచుకునే మనసు/ లోకం' రూపుకడుతూ వుంటుంది.

ఆయన కవిత్వంలోని కలలు, ఆలోచనలు, కాలం, బాల్యం, గాలి - ఇలా అన్నీ పాఠకుల మనసును తాకుతూ మనిషి చేసే జీవితయాత్రలోని పరమరహస్యాన్ని విప్పి చెప్పేందుకు సహకరిస్తాయి. మానవప్రయత్నాలను, మానవశ్రమను, ప్రకృతికీ మానవ మనుగడకూ మధ్య గల అవినాభావ సంబంధాన్ని, వాటిని అంటిపెట్టుకుని ఉన్న సౌందర్యాన్ని ఈ లోకం పట్టకుండా లోకాన్ని గానం చేస్తూ సాగే కవిత్వ ప్రయాణికుడు నరసింగరావు అనిపిస్తారు. నరసింగరావు కవిత్వమంతా దృశ్యచిత్రాల పరంపర. గుండె స్పందనలకు అనుగుణంగా ఎగిసిపడుతూ తీరాన్ని ఢీకొని జీవితమంటే ఇదే అని మనకు రుచిచూపిస్తుంది. 'తరంగాలు/ ఒకదాన్నొకటి/ తరుముతూ వచ్చి/ తీరంలో/ రాజీపడతాయి' అంటూ ఆయన జీవితంలోని నగ్నసత్యాన్ని బయటపెడతారు. 'జీవితం/ పంచియిచ్చే/ వేపకాయ పసరు రుచి', 'వేపకాయ రుచి జీవితం' అనీ తెలిసీ మనిషి కలలు కనడం మానడు. ఆ కలలే మానవప్రయాణంలో నడకను అనివార్యం చేస్తాయి. కలలు కనే వరమే లేకుంటే జీవితం ఇంత అందంగానూ, జీవనయోగ్యంగానూ వుండేది కాదేమోనని బి. నరసింగరావు కవిత్వం చదివిన తర్వాత మరింతగా అనిపిస్తుంది. అందుకే 'జీవితానికో ఊతగర్ర/ కల' అన్నారు ఆయన. అదే సమయంలో ఆలోచనలూ ఉంటాయి. ఆ ఆలోచనలెప్పుడూ రాజుకునేవే అయి వుంటాయి. అలా వున్నప్పుడే మనిషి బహిరంగ ఆకర్షణకు ప్రాధాన్యం తగ్గి అంతరంగం ప్రకాశమానం అవుతూ వుంటుంది. 'కప్పుకోవడానికో/ వెచ్చని ఆలోచన కావాలి', 'రాజుకోవడానికి/ ఓ కుపంటి/ కావాలి' అన్నప్పుడు ఒక భావాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేయడం చూస్తాం. పునరుక్తి ఆలోచనలదే కానీ వ్యక్తీకరణది కాదు.

జ్ఞాపకాల దొంతరలు కలతపెడుతూనో, సంతోషపెడుతూనో గుండెను రాజేస్తూనే వుంటాయి. అవి మాసిపోవు. వున్న చోటే సుళ్లు తిరుగుతూ వివిధ రూపాల్లో వ్యక్తమవుతూ వుంటాయి. అలా సుళ్లు తిరిగే భావనలకు నరసింగరావు దృశ్యరూపమిచ్చారు. జీవితంలో అంతా తెలిసిందే అయినా మళ్లీ తెలుస్తున్నట్లుగా వుంటుంది. అనుభవాల దొంతరలు ఎప్పటికప్పుడు పునరావృతమవుతూ వుంటే 'అంతా తెలిసిందే/ మళ్లీ మళ్లీ తెలుస్తున్నట్లుగా/ బాల్యావస్థలా' అని అంటారు నరసింగరావు. మనిషికి కొన్ని కొత్తగానూ, అద్భుతంగానూ అనిపిస్తుంటాయి. వాటి ప్రాచీనత తెలిసిన తర్వాత మనిషి జీవనతాత్వికతలోకి జారిపోతాడు. రాగద్వేషాలకు అతీతమైన నిర్మమకార ధ్యానంలోకి జారిపోతాడు. అందుకే నరసింగరావు 'ఏదీ/ కొత్త కాదు/ భూమికి/ ఎన్నెన్నో/ కాలాల్ని/ దాటివచ్చిన/ అనుభవంతో/ కాకలు దీరిందది' అని ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తారు.
మానవజీవితంపై కాలం ఆధిపత్యాన్ని, నిరంకుశత్వాన్ని నరసింగరావు కవిత్వం స్థాపిస్తుంది. కాలాన్ని జయిస్తామని అనుకోవడం, జయించామని విర్రవీగడం ఎంత అర్థరాహిత్యమైన భావనలో మనకు ఆయన కవిత్వం అనుభవంలోకి తెస్తుంది. 'కనుచూపు మేరలో/ పచ్చగా/ రాజ్యమేలే/ స్వర్గకుటీరంంలోని/ ఈ కాలం నాది' అని ప్రకటిస్తున్న కవి 'ప్రకృతీ/ ఫలశ్రుతీ/ అన్నీ కాలమే'ననే నిర్ధారణకు వస్తారు. కొన్ని అనుభవాల కోసం మనిషి సుదీర్ఘ నిరీక్షణ చేస్తాడు. కానీ వాటి మనుగడ ఎంత? 'ఎంతగానో/ ఎదిరిచూసిన/ ఘడియ/ ఒక్క ఊపు ఊపి/ కాలగమనంలో/ కలిసిపోతాయి' అని నరసింగరావు ఎంతగానో ఎదిరిచూసి పొందే అనుభవాల క్షణికతను తెలియజేస్తారు.

మానవ జీవితంలోని అసంబద్ధతను ఆయన దృశ్యాలు దృశ్యాలుగా చిత్రీకరిస్తారు. 'గాలి/ గయ్యాళిది/ ఒకసారి/ నీ అవసరానికి/ మరోసారి/ దాని అవసరానికి/ వీస్తుంది' అని అనడంలోని అర్థం బహుశా అదే. ప్రకృతికి, మానవుడికి మధ్య గల అవినాభావ సంబంధాన్ని నరసింగరావు తన కవిత్వంలో ఆవిష్కరిస్తారు. నరసింగరావు కవిత్వం చదువుతుంటే చలం 'సుధ', ఇస్మాయిల్‌ కవిత్వం గుర్తొస్తాయి. ఆ ప్రభావం నరసింగరావు కవిత్వం మీద వుందని కాదు. చలం 'సుధ' భగవత్‌ తత్వాన్ని గానం చేస్తే, ఇస్మాయిల్‌ కవిత్వం ప్రకృతిని ఉన్నదున్నట్లుగా ఆవిష్కరించి తాదాత్మ్యం చెందుమని బోధిస్తుంది. నరసింగరావు కవిత్వం కాస్తా ముందుకెళ్లి మానవ జీవన యానాన్ని ప్రకృతిలో అంతర్భాగంగా చూస్తుంది. మానవ భౌతికజీవన మనుగడను ప్రకృతి తాదాత్మ్యంతో ఆయన ముడివేస్తారు. అందుకే ప్రకృతిని జయించి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే మానవుడి ప్రయత్నం ఎంత వ్యర్థప్రయాసో చెబుతూనే ప్రకృతితో మమేకమై మనుగడ సాగించడం ఎంత ఆనందదాయకమో, అవసరమో ఆయన చెప్తారు. అందుకే మానవ మనుగడ బాల్యంలోని అనుభవాల మాదిరిగా ఉండాలని తపించిపోతారు. 'పశువులు/ గుర్రాలు/ గాడిదలు/ అన్నీ వాహనాలే' అని అనడంలోనూ 'మబ్బులను తెంపుతూ/ ఇంధ్రదనుస్సులను/ చక్రాల్లా తిప్పుతూ' జీవితం సాగిపోవాలని ఆశించడంలోని తపనా అదే. ప్రకృతి విచిత్ర విన్యాసాలను చూసి మురిసిపోవడంలోని అంతరార్థం అందులో భాగమేనని మనకు బోధపడుతుంది. 'తరముతూ/ వస్తున్న గాలికి/ హొయలు పోయే/ పచ్చగడ్డి మైదానం' అని, 'వర్షంలో/ తడిసి ముద్దయిన/ ఆకులు/ అప్సరసలౌతాయి', 'అప్పుడే/ ఓ కుందేటి పిల్ల/ దూదిపింజలా/ గెంతుతూ/ మాయమౌతుంది' అని ప్రకృతి విన్యాసాలకు దృశ్యరూపం కల్పించి అలౌకిక ఆనందతీరాలను స్పృశిస్తారు.

అమూర్తమైన నిరంతర ఆలోచనాస్రవంతికి నరసింగరావు తన కవిత్వంలో అతి నిసర్గసౌందర్యంతో కూడిన ప్రతీకాత్మక దృశ్యాలను అద్ది మన కళ్ల ముందు నిలబెట్టారు. వస్తుశిల్పాల సమ ప్రాధాన్యాన్నెరిగిన ఆయన కవిత్వంలోని సౌందర్యాత్మకతను తెలుగు కవిత్వానికి రుచి చూపించారు. నరసింగరావు కవిత్వమంతటా ఖగిరీశిరిబీరిరీళీ పరుచుకుని వుంటుంది. అది ఒక తాత్వికస్థాయికి ఎదిగి మానవ జీవన సారాన్ని వ్యక్తీకరిస్తుంది. నరసింగరావు కవిత్వం పాఠకుడికి ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఆయన కవిత్వమంతా చదివిన తర్వాత మనం ఒక నిర్మమకార చిత్తవృత్తిలోకి జారిపోయి జీవితాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించడం నేర్చుకుంటాం. హిపోక్రటిక్‌ ఉడుపులను వదిలేసి సహజ మానవప్రవృత్తిని ప్రదర్శించేందుకు సిద్ధమవుతాం.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
A multi faceted artist B Narsing Rao has worked in several fields. In Telugu movie world he is the only artist for parallel cinema, with Rangula Kala and others. He has written Telugu8 poetry, in which he expresses abstract ideas with unique technique.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X