'మునుం'పై కోదండరామ్ మాట

విశాలాంధ్రను ప్రజా పోరాటాల ద్వారా వెలసిన వ్యవస్థగానూ సమిష్టి వికాసానికి ఇది తప్ప మరో మార్గం లేదని సమైక్యవాదులు అంటారు. విశాలాంధ్ర విడిపోతే దేశమే ముక్కలైతుందంటరు. ఈ వాదనల వెనుక వాస్తవిక అంచనా గానీ చారిత్రక అవగాహన గానీ హేతుబద్దమైన దృక్పథం గానీ లేవు. చాప మందు వేయడం వేసుకోవడం అశాస్త్రీయమన్న హేతువాదులు సమైక్యవాదానికి బలాన్నివ్వడం విచిత్రం.
తెలంగాణ ఉద్యమం సమైక్యవాదం ముసుగులో సాగుతున్న ఆంధ్ర ఆధిపత్యాన్ని ఎదిరించడం ద్వారానే స్థిరపడింది. సమైక్యవాదం భాష పేరిట ఏర్పడిన విశాలాంధ్ర దోపిడీ స్వభావాన్ని వెలుగులోకి రాకుండా అడ్డుకున్నది. ఈ సమైక్యవాదం ముసుగును తొలగించి తెలంగాణత తన అస్తిత్వాన్ని తెలుసుకోగలిగింది. తనకు జరిగిన అన్యాయాలను చుడగలిగింది. అన్యాయాలకు వ్యతిరేకంగా సంఘటితంగా కాగలగింది.
సమైక్య భావజాలాన్ని ఎదిరించడంలో కవిత్వమే కీలక పాత్ర వహించింది. కవిత్వం మనిషి అనుభవాన్ని రంగరించి సారాన్ని ఒక పంక్తిలో ఎదుటివాడి మనసులోకి చేరేట్టుగా చెప్పగలుగుతుంది. వచ్చినవాడు ఫల్గుణుడు... అన్న కవితాపంక్తి తెంలగాణ చరిత్ర క్రమాన్ని వివరిస్తే ట్యాంకుబండు విగ్రహాలు మీవి శవాలు మావి అన్న ఫంక్తులు అన్యాయాన్ని కళ్ల ముందుంచినవి.
ప్రతి కవి తాను చేసిన ఈ పనిని విడివిడిగా గ్రహించలేక పోవచ్చు. అన్ని కవితలూ ఒక చోట చేర్పినప్పుడు చరిత్ర నిర్మాణంలో కవిత్వం పాత్ర అర్థమవుతుంది. అనాదిగా ఉన్న మంచి రచయితల అద్భుత రచనల్ని గురించి ఆనాటి గోల్కొండ సంచిక ద్వారానే తెలిసింది. పూలు విడిగా ఉన్నా అందంగానే ఉంటాయి. దండగా మార్చి అన్నిటి అందం కలబోసినప్పుడు ఆ వెలుగు చూడడానికి రెండు కళ్లూ చాలవు. ప్రకృతి నుంచి ఎన్నుకున్న స్థానిక ఉపమానాల వల్ల నుడికారం వల్ల ఈ కవితలు ప్రత్యేకంగా నిలబడ్డాయి.
పాలపిట్ట మాసపత్రిక సౌజన్యంతో....












Click it and Unblock the Notifications