• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ స్త్రీల ఆత్మకథలు

By Pratap
|

Jajula Gowri
జాజుల గౌరి 'మన్నుబువ్వ' కథా సంకలనాన్ని, చంద్రకళ 'కలుపు తీశిన కంప్యూటర్‌ చేసిన...' అనే పుస్తకాన్ని ఒకే సమయంలో చూసేసరికి నాకెందుకో ఈ రెంటి మధ్య ఏదో ఒక పోలిక ఉంటుందని అనిపించింది. రెండింటిని ఒకటి తర్వాత ఒకటి చదివేసరికి పుస్తకాల మధ్యనే కాదు, ఈ ఇరువురి జీవితాల మధ్య కూడా పోలిక ఉందనిపించింది. చదువు కోసం పడిన ఆరాటం ఇద్దరిలోనూ కనిపిస్తుంది. పెళ్లయిన తర్వాత తాను చదువుకున్న తీరును, తన అనుభవాన్ని చంద్రకళ వ్యక్తీకరించింది. ఎనిమిదో తరగతి చదువుతున్న జాజుల గౌరికి పెళ్లయి చదువు ఆగిపోయింది. ఆ తర్వాత ఓపెన్‌ యూనివర్శిటీలో డిగ్రీ చేసింది. ఉస్మానియా యూనివర్శిటీలో జర్నలిజంలో పి.జి. చేసింది. కథల పుస్తకం అచ్చయ్యేనాటికి 'లా' చదువుతోంది.

శ్రామికవర్గ దృక్పథంతో చూస్తే దాదాపుగా ఇద్దరి నేపథ్యాలూ ఒక్కటే. కలుపు తీసిన చంద్రకళ ఇప్పుడు కంప్యూటర్‌ చేస్తోంది. కాయకష్టం చేసి అదనంగా కుల అణచివేతను కూడా అనుభవించిన గౌరి ఇప్పుడు తనవారి కోసం తన అనుభవాలను కథలు కథలుగా రాస్తోంది. కంప్యూటర్‌ తెర మీద అక్షరాల నాట్లేస్తున్న మా సరస్వతి అనుభవం నా కళ్ల ముందే ఉంది. ఈ ముగ్గురి సామాజిక జీవితాల్లో అంతరాలు ఉన్నప్పటికీ ఆధునిక ప్రపంచంలోకి వచ్చి కొత్త జీవితాన్ని ఆహ్వానించే విషయంలో ముగ్గురి అనుభవమూ ఒక్కటే. దళిత కుటుంబంలో జన్మించిన గౌరి అదనంగా సామాజిక అణచివేతను ఎదుర్కొంది. 1960, 1970 థకాల్లో అక్షరాల ముఖం తెలియని శ్రామిక కుటుంబాల్లో జన్మించిన స్త్రీలు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత పడే యాతనను, పరిష్కార మార్గాలను ముందు తరాలకు అందించవలసిన అవసరాన్ని చంద్రకళ, గౌరి పుస్తకాలే కాదు, వారి జీవితాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ స్త్రీల ఆత్మకథల అవసరం ఎంత ఉందో ఆ పుస్తకాలు అర్థం చేయిస్తున్నాయి.

చంద్రకళ 'కలుపు తీశిన, కంప్యూటర్‌ చేసిన...' పుస్తకం పరిమిత ప్రయోజనంతో కూడింది. ప్రచురణకర్తలు ఆ పుస్తకానికి ఆ పరిమిత ప్రయోజనాన్నే ఉద్దేశించారు. నూతన అక్షరాస్యుల కోసం ఆమె అనుభవాన్ని ఆమె మాటల్లోనే రికార్డు చేయించి అచ్చేయించారు. ఆ రకంగా వయోజన విద్యను అభ్యసించే విషయంలో ఇతర స్త్రీలకు ఇది స్ఫూర్తిని అందజేస్తుంది. అయితే దీంట్లో చంద్రకళ జీవిత నేపథ్యం, సామాజిక అంతరాల జాడలు అక్కడక్కడా వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ఆమె రాసిన భాషను మార్చే ప్రయత్నం ప్రచురణకర్తలు చేయలేదు. దీని వల్ల దానికి అదనపు ప్రయోజనం కొంత చేకూరింది. ఆమె తన ఆత్మకథ రాస్తే విస్తృత స్థాయి ప్రయోజనం సాధించే అవకాశం ఉంది. ఈ విషయం జాజుల గౌరి కథల సంపుటి చెప్పకనే చెప్పుతుంది.

జాజుల గౌరి పుస్తకంలో చదువుకు సంబంధించిన కథలు చాలా ఉన్నాయి. అసలు పుస్తకమంతా చదువు గురించేనని అనుకోవచ్చు. అయితే 'అక్షరం', 'సదువు' కథలు చదువుతున్నప్పుడు ఇవేవో గవర్నమెంట్‌వారి కార్యక్రమాల కోసం రాసినవేమోనని అని అనిపించవచ్చు. అయితే గౌరి జీవితాన్ని, గౌరి దళిత కుటుంబ జీవిత నేపథ్యాన్ని మిగతా చాలా కథలు పట్టిచ్చిన తర్వాత దళిత కుటుంబాలకు ఆ కథల అవసరం ఎంతగా ఉందో అర్థమవుతుంది. సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం పొంది, తర్వాత ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచనలు చేసి ఒకటి, రెండు తరాలు ముందున్న అగ్రకుల మేధావులకు, రచయితలకు అటువంటి కథలు ప్రయోజనరహితమైనవిగా కనిపించడంలో తప్పేమీ లేదు. తెలంగాణ దళిత, శ్రామిక కుటుంబాలకు నేరుగా ప్రత్యామ్నాయ రాజకీయ చైతన్యం ఇచ్చే ప్రయత్నం తెలంగాణలో జరిగింది. వారి ఆలోచనల్లో అది సరైందే కావచ్చు. అయితే దళిత కుటుంబాల పిల్లలకు, ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు అవసరం ఎంతగా అవసరమో గౌరి కథలు అర్థం చేయించడం ఇక్కడ సానుకూలాంశం.

జాజుల గౌరి చాలా వరకు తన అనుభవాలనే కథలు కథలుగా రాసుకుంటూ పోయింది. 'మన్నుబువ్వ' సంకలనంలోని ఆ కథలను చదువుతూ పోతుంటే తెలంగాణా దళిత కుటుంబాల పరిస్థితులు మన కళ్ల ముందు మెదులుతాయి. ఇదే ప్రాంతంలోని అగ్రకులాలవారికి తెలియని దళితుల జీవితాల్లోని ఎన్నో అంశాలు తెలిసి ఆశ్చర్యపెడతాయి. 'మన్నుబువ్వ'లో మొత్తం 25 కథలున్నాయి. వీటిలో మన్నుబువ్వ, దస్తకత్‌, నిట్టూర్పు, విచ్ఛిన్నం, అక్షరం, నేన్‌ నేన్‌లెక్కనే, సేరుపట్లు, గుండం, పగటిబెల్లు, పండగ, కోటీలు, పట్టాలు, బతుకు, భంగిమ, సదువు, విద్యార్థి, నీళ్లబాయి, కంచె, మైల, మార్పు కథలు గౌరి తన అనుభవాల నేపథ్యం నుంచి రాసినవి. మిగతావి తాను స్పష్టంగా చూసిన సంఘటనల ఆధారంగా రాసినవి. గౌరి తన అనుభవాల నేపథ్యం నుంచి రాసిన కథలకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది. తన అనుభవాలను నిర్మొహమాటంగా, స్పష్టంగా ఆమె తన కథల్లో వ్యక్తీకరించింది. తన జీవితం గురించి న్యూనత పడకపోవడం వల్లనే అంత స్పష్టంగా ఆమె రాయగలిగింది. చిన్నతనంలో పాఠశాలలో, ఇతరత్రా ఆమె న్యూనత పడిన సంఘటనలకు ఆమె తర్కబద్దంగా, మనస్సుకు తాకే విధంగా కథనరూపం ఇచ్చింది. ఆ తర్కాన్ని ఆమెకు తన తల్లి అందించింది. ఈ తర్కం మానవత్వం ఇరుసుగా కలిగింది. మంచీచెడుల విచక్షణలో మానవత్వం వైపు నిలిచేది. చేయని నేరానికి శిక్ష అనుభవించ వలసిన అవసరం లేదని నేర్పిన తర్కం. 'కంచె' కథను చదివినా, 'మైల' కథ చదివినా ఈ విషయం అర్థమవుతుంది. 'కంచె' కథ చిన్న వయసులో, తెలిసీ తెలియని తనంలో జరిగిన ఘోరానికి బలైన అమ్మాయికి తల్లి ఆత్మగౌరవాన్ని నూరిపోస్తుంది. అయితే, 'మైల' కథలో అంటరానితనాన్ని, ఆర్థికంగా చితికిపోయినా కూడా అగ్రకుల దురహంకారంతో అంటరానితనాన్ని పాటించే వైనాన్ని చైతన్యం సంతరించుకున్న దళితస్త్రీ నిలదీసి సగర్వంగా నిలబడే స్త్రీ 'మైల' కథలో కనిపిస్తుంది. రెండో కథను రాసిన పద్ధతి గౌరి కథనప్రతిభకు అద్దం పడుతుంది. ఎక్కడా అసహజత్వం కనిపించదు. సహజాతి సహజంగా అతి సామాన్యంగా సమాజంలోని ధిక్కారధోరణిని ప్రదర్శించిన నగర దళిత స్త్రీని, అంటరానితనాన్ని పాటించడం అతి మామూలు విషయంగా, అదేమంత అసహజ విషయం కాదన్నట్టుగా చూసే గ్రామీణ దళిత స్త్రీని పక్కన పక్కన నిలబెట్టి మనకు అందిస్తుంది.

తన అనుభవాల నుంచి రాసిన కథల్లో చదువుకోవాలనే తీవ్ర తపన, కూలీనాలి దొరక్క పడే ఇబ్బందులు, పూట గడవకపోవడం, తత్కారణంగా భార్యాభర్తల మధ్య తలెత్తే ఘర్షణలు, పిల్లల ఆకలి మంటలు, దొరల దౌర్జన్యాలు, కళ్ల ముందే చరాస్తులను కూడా కొల్లగొట్టే వారి దోపిడీలతో పాటు పాఠశాలలో మామూలు పాఠాలతో పాటు జీవిత పాఠాలు నేర్చుకోవడం, సామాజిక అంతరాలకు సంబంధించిన నిత్య సంఘర్షణ, వాటిని ధిక్కరించాలనే ధర్మాగ్రహం, ప్రకృతికీ దళిత శ్రామిక కుటుంబాలకూ మధ్య గల విడదీయరాని సంబంధం, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆదరణా ప్రేమా పట్టింపులూ, ప్రకృతి విధ్వంసాలు జాజుల గౌరి కథల్లో కనిపిస్తాయి. దళిత శ్రామిక కుటుంబాల జీవితాలు మన కళ్ల ముందు కదులుతాయి. 'మన్నుబువ్వ'లాంటి కథలు చదివితే సంభ్రమా శ్చార్యాలతో కొద్ది సేపు నోట మాటరాదు. గుండె ఆగిపోయినంత పనవుతుంది. 1976 లోనో, 1977లోనో తెలంగాణలో కరువు విలయతాండవం చేసింది. 'తూర్పు దేశం' నుంచి ఎండు గడ్డి లారీలు వస్తే గడ్డి మోపులు కొనుక్కుని తెచ్చుకున్న సందర్బాలున్నాయి. పశువులు ఆకలితో కడుపులు మాడి ఒక్కటొక్కటే ప్రాణాలు విడిచి దొడ్లు ఖాళీ అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బహుశా గౌరి రాసిన ఆకలికి సంబంధించిన కథల్లోని సంఘటనలు అప్పటివి అయివుంటాయి. 'మన్నుబువ్వ' లాంటి కథలు చదివినప్పుడు నాకు ఆ సంఘటనలు ఒక్కసారిగా కళ్ల ముందు కదలాడాయి. అప్పటికి గౌరికి ఏడెనిమిదేళ్లు వయస్సు ఉంటుంది. ఆ వయస్సులోని కథలను కూడా ఆమె రాసింది కాబట్టి నా అంచనా తప్పు కాకపోవచ్చు.

గౌరి రాసిన 'సదువు' కథ చదివినప్పుడు దార్ల రామచంద్ర రాసిన 'బాలచంద్రుడు' కథ గుర్తొచ్చింది. ఈ కథలోని పాత్ర పాలేరు జీవితాన్ని తప్పించుకుని చదువుకోవడానికి పారిపోయి తన లక్ష్యాన్ని సాధిస్తుంది. బహుశా తెలంగాణ దళితులకు చాలా మందికి ఈ అనుభవం ఉండి ఉంటుంది. అది తన ఆత్మకథేనని దార్ల రామచంద్ర చెప్పుకున్నాడు. అయితే కథనం విషయంలో గౌరి కథంత బిగువుగా దార్ల రామచంద్ర కథ లేదు. కథనంలో గౌరి విశేష ప్రతిభ కనబరించింది. ఆమె కథనంలో సారళ్యం ఉంది. ఆ సారళ్యం పాఠకులను కథ వెంబడి నడిపిస్తుంది. ఆమె రాసిన ఏ కథలోనూ కథన నిర్మాణ వ్యూహం లేకపోవడం అందుకు కారణమని నేను అనుకుంటున్నాను. స్త్రీలు అతి సాధారణంగా, అలవోకగా ఆసక్తికరంగా కథ చెప్పే పద్ధతి అది. ఈ కథన నిర్మాణాన్ని మనం ముదిగంటి సుజాతారెడ్డి కథల విషయంలో గమనించవచ్చు. జాజుల గౌరి చాలా లోతైన విషయాలను అలవోకగా వ్యక్తీకరించింది. ఇది జానపద శ్రామిక స్త్రీల సహజ నైపుణ్యాన్ని తలపిస్తుంది.

ప్రాంతీయ భాష వాడాలనే లౌల్యం వల్ల అతివ్యాప్తి దోషానికి గురి కావడం చాలా మంది రచనల్లో మనం చూస్తాం. దాని వల్ల వస్తువు పల్చబడి, సృజనాత్మక రచన బిగువు తగ్గుతుంది.ఈ దోషం జాజుల గౌరి కథలకు అంటలేదు. జాజుల గౌరికి కథ పరిధి, పరిమితి, విస్తృతి బాగా తెలుసు. ఈ లక్షణం బోయ జంగయ్య చీమలు, బొమ్మలు, ఇంకా కొన్ని కథల్లో చూస్తాం. తన విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, అభిప్రాయాలను చెప్పాలనే దుగ్ధ లేకపోతేనే సృజనాత్మక రచయితలకు ఆ సుగుణం అలవడుతుంది. తనకు తెలిసిందంతా చెప్పేయాలనే మేధోలక్షణాలను వదిలేసినప్పుడు మాత్రమే సృజనాత్మక రచయితల నుంచి మంచి రచనలు వస్తాయి. ఆ రచయిత రచనలతో పాఠకులు సహానుభూతి పొందుతారు. కథా పరిధి, పరిమితి, విస్తృతి తెలిసిన రచయితల్లో మనకు తెలంగాణలో ఇంకా నందిగం కృష్ణారావు, జింబో కనిపిస్తారు.

భాష విషయంలో ప్రధానమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమం బలంగా ముందుకు వచ్చిన తర్వాత ప్రాంతీయ భాషలోనే రాయాలనే వాదన బలంగా ముందుకు వచ్చింది. అది చాలా మంచిది. అయితే కేవలం క్రియారూపాలను మార్చినంత మాత్రాన ప్రాంతీయ లక్షణాన్ని తేలేమనే విషయాన్ని గుర్తించడం ఈ సందర్భంలో అవసరం. ఈ విషయంలో పాత తరంలో పి. యశోదారెడ్డి, ఈ తరంలో జాజుల గౌరి ఆదర్శమైతే తెలంగాణ కథకు పుష్టి చేకూరుతుంది. దీన్ని నిరూపించడానికి జాజుల గౌరి కథల్లోంచి అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. పెద్ద పత్రికలకు ఎక్కని వరంగల్‌ జిల్లాకు చెందిన బాపురెడ్డి కథలు ఈ గుణాన్ని సంతరించుకున్నాయి. జాజుల గౌరి తెలంగాణ భాషను ఎంత సమర్థంగా వాడగలదో, శిష్టవ్యావహారికాన్ని అంతే సమర్థంగా వాడగలదు. స్త్రీ దృక్కోణం నుంచి ఈ భాషలో ఆమె కొన్ని కథలు రాసింది. ఈ కథలు స్త్రీల సమస్యలకు సున్నితమైన పరిష్కారాలను చూపుతాయి. తనను తాను నిలబెట్టుకోవడం ఎలాగో స్త్రీలకు తెలియజేస్తాయి. ఆత్మగౌరవాన్ని కాపాడుకునే లక్షణాలను పెంపొందిస్తాయి. ఈ కథలు స్త్రీ దృక్కోణం నుంచి మానవసంబంధాలను పునర్నిర్వచించి, స్త్రీపురుష సమానత్వాన్ని ప్రతిపాదిస్తాయి. జాజుల గౌరి రాడికల్‌ ఫెమినిజాన్ని ప్రతిపాదించలేదు. స్త్రీపురుష సంబంధాలను చిన్ననాటి నుంచి తన తల్లి నేర్పిన తార్కికత నుంచి నాయిన అందించిన మంచితనం వారసత్వం నుంచి అందించడమే ఆమె ప్రధాన ధ్యేయం.

నిజానికి జ్ఞాపకాల భావనలు మంచి రచనకు మూలధాతువులవుతాయి. అయితే పాత జ్ఞాపకాలను తవ్వుకోవడం, పల్లెలను కీర్తించడం వంటివి అభివృద్ధి నిరోధక లక్షణమనే భావన కొంత మందిలో బలంగా ఉంది. నిజానికి, మన జీవితాలను కుంచింపజేస్తున్న ప్రపంచీకరణ ధాటిని తట్టుకుని ఎదుర్కోవడానికి స్థానీయ ఉద్యమాలే ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచిస్తాయి. దానివల్ల మానవసంబంధాలను కాపాడుకోలుగుతాం. నిత్య జీవన మనుగడ కోసం మనం నిరంతర యాతన ఆగిపోతుంది. నడి వయస్సులోనే గుండెపోట్లు తెచ్చుకునే ఒత్తిడి నుంచి బయటపడి ఆరోగ్యకరమైన వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని సాధించుకోగలం. ఇదే సమయంలో అంధ విశ్వాసాలను వదిలించుకుంటూ ముందుకు సాగే ఒక నూత్న నిశబ్ద సాంస్కృతిక విప్లవం నిరంతర సాగాల్సిన అవసరం ఉంది. మన జీవన విధానాన్ని మార్చే ఉద్యమం అది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి ఆ లక్షణం ఉంది. ఉత్పత్తి, వినియోగం, పంపిణీ వంటి విషయాల్లో దేశీయ (స్థానీయ) వ్యవస్థల రూపకల్పన స్వయం సమృద్ధి సాధనకు ఉపయోగపడి ప్రపంచీకరణ దుష్పలితాలకు సమాధానం ఇస్తాయి. ఇందులో భాగంగానే జాజులగౌరి వంటి వారి రచనలను చూడాలి. ఈ దృష్ట్యా అటువంటి రచనల అవసరం విరివిగా ఉందనే విషయాన్ని గుర్తించాలి. వనరులపై దేశీయ దళిత శ్రామిక కుటుంబాలకు ఆధిపత్యం చిక్కే మార్గాన్ని ఈ రచనలు కళాత్మకంగా చెబుతాయి.

జాజుల గౌరి తన అనుభవాలను, ఆత్మానుభూతులను నిర్మమమకారంగా, ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా కథలు కథలుగా చెప్పుకుంటూ పోయింది. ఈ లక్షణం చాలా కొద్ది మందిలో కనిపిస్తుంది. ఈమె కథలు చదివిన తర్వాత తెలంగాణ స్త్రీలు తమ ఆత్మకథలు రాయాల్సిన అవసరం ఎంతగా ఉందో అర్థమవుతుంది.

మళ్లీ మొదటికి వస్తే, కొత్త విద్యలు నేర్చిన జాజుల గౌరి, చంద్రకళ, సరస్వతి వంటివారు, చిన్నపాటి ప్రైవేట్‌ పాఠశాలల్లో టీచర్‌ ఉద్యోగాలు, ఇతర సంస్థల్లో చిన్నాచితక పనులు చేస్తున్న తెలంగాణ స్త్రీలు తాము చేపట్టిన వృత్తుల్లో కొనసాగడానికి 'ఇకమతులు' నేర్చుకోవాల్సిన అగత్యం ఉండనే ఉంది. వృత్తులో ఎదురయ్యే ఇబ్బందులను మనసుకు పట్టించుకోకుండా ముందుకు సాగే లక్షణాన్ని అలవరుచుకుంటారో, ఆ ఇబ్బందులను అధిగమించే మార్గాలను తర్వాతి తరం వారికి మార్గం చూపుతారో, ఏదైనా వారి చేతుల్లోనే ఉంది. జీవితంలోని సున్నితత్వాన్ని, మానవ సంబంధాలను పోగొట్టుకోకుండా ముందుకు సాగడం ఆధునిక సమాజంలో అతి పెద్ద సవాల్‌. జాజుల గౌరిలాంటివారి రచనలు ఈ విషయంలో మనోనిబ్బరాన్ని అందిస్తాయి.

- కాసుల ప్రతాప రెడ్డి

English summary
Telangana women auto biographical writings revealing new aspects of the social evolution. Jajula Gowri short stories are adding new dimension to Telugu literature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X