వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్ర - చారిత్రక నవల

By Pratap
|
Google Oneindia TeluguNews

Velidenda Nithyananda Rao
'చారిత్రక నవల' అన్నప్పుడు మొట్టమొదటి చారిత్రక నవలకు తేదీ ఏమిటి? ఏ ఇతివృత్తం ఎంతవరకు చారిత్రక నవల కాగలదు? అన్న ప్రశ్నలు మదిలో మెదలక తప్పదు. చరిత్ర అంటే గతానికి సంబంధించింది. ఆ గతం కొన్ని వేల ఏళ్ల క్రింది నుండి నిన్నటి దాక వ్యాపించిన సవిస్తృత రూపం. ఆధారాలు లభించని ప్రాచీన కాలానికి సంబంధిం చనవన్ని బహుశా పౌరాణికాలు అవుతాయేమో! మనం జీవిస్తున్న వందేళ్ల ఇతివృత్తాన్ని గ్రహిస్తే సాంఘిక నవలలు కావచ్చు. ఈ మధ్యకాలంలోని ఇతివృత్తం చారిత్రకేతివృత్తం అవుతుంది. ఇది కాలానికి సంబంధించిన పర్యాలోచనం. ఎందుకంటే రాచమల్లు రామచంద్రారెడ్డిగారు స్వాతంత్య్రోద్యమాన్ని చిత్రించిన మహీధర రామ్మోహనరావుగారి 'కొల్లాయి గట్టితేనేమి?' నవలను 'ఉత్తమ చారిత్రక నవల' అంటూ చక్కటి చర్చ చేశారు. చూడండి! తాళ్లపాక అన్నమయ్య చరిత్రను 'శ్రీపదార్చన' పేరుతో ముదిగొండ శివప్రసాదు గారు రాస్తే అందరు 'గొప్ప నవల' అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయంవారు 'ఉత్తమ చారిత్రక నవల'గా బహుమానమిచ్చారు. పేచీలేదు. మరి ఝాన్సీ లక్ష్మీబాయిని కానీ, అల్లూరి సీతారామరాజును కానీ, స్వాతంత్య్రోద్యమాన్ని గానీ వర్ణిస్తూ నవలలు రాస్తే 'చారిత్రక నవల'లు అంటారా? మరి అనడం లేదు. కారణం ఆ వ్యక్తులు సమీప గతానికి సంబంధించిన వారు, ఆ ఉద్యమం మన కళ్ల ముందు జరిగింది కావడమే. దాశరథి రంగాచార్యుల 'చిల్లరదేవుళ్లు', వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజల మనిషి' చారిత్రక నవలలుగా వ్యవహరించకపోవడానికి కేవల సమీప గతానికి సంబంధించినవి కావడమే ప్రధాన కారణం.

కేవలం చరిత్ర గ్రంథం సరళరేఖలాగ ఇతివృత్త నివేదన మార్గంలో కాలక్రమంలో సాగిపోతుంది. నవల తన ఇచ్చ వచ్చిన మార్గంలో అంటే ఫ్లాష్‌ బ్యాక్‌ పద్ధతిలోను, ఏకాంశ ప్రాధాన్యంతోను నడిచిపోతుంది. ఇది చరిత్రకు, నవలకు ఇతివృత్త నిర్వహణలో కొట్టొచ్చినట్లు కనిపించే భేదం. ఇంకొకటి చారిత్రక వాతావరణ కల్పనం, సంవాదాత్మక ధోరణి (సన్నివేశ వర్ణనం) ఇవన్నీ చారిత్రక నవలలలో ఉంటాయి. చరిత్ర గ్రంథంలో ఉండవు. ఈ తేడాను ఆధారం చేసుకొని ఇంతకు ముందు వేటినయితే చారిత్రక నవలలు కావని తిరస్కరించామో అవన్నీ చారిత్రక నవలలవుతాయి. అయితే చారిత్రకమే అయినా 'చిల్లరదేవుళ్లు' మొదలైన నవలల్లోని పాత్రల పేర్లు చరిత్రలోనివి కావు. కనుక సాంఘిక నవలలు అనో, ఉద్యమ నవలలు అనో వ్యవహరిస్తున్నాం. ఇంతవరకు ఎవరూ రాసినట్లు కనిపించని ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకాశం మొదలైనవారి మీద చక్కటి చారిత్రక నవలలు రాయడానికి ఎవరైనా పూనుకోవచ్చును. 'వివేకానందస్వామి' మీద కూడా మంచి ఆధ్యాత్మిక ఐతిహాసిక నవల రాయవచ్చు. రామానుజాచార్యుల మీద రెండు నవలలు వచ్చాయి. మరి శంకరాచార్యుల మాటేమిటి?

సాంఘిక నవలలోని వస్తువు మీద రచయితకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. చారిత్రక నవలా రచయితకు ఇతివృత్తం మీద పూర్తి స్వేచ్ఛ ఉండదు. ప్రధానేతివృత్తంలోని 'చారిత్రక'త భంగం కలగకుండా పాక్షిక స్వాతంత్య్రంతో రచించవలసి ఉంటుంది. ప్రధాన పాత్రల మనస్తత్వాలను రూపురేఖలను ఏ మాత్రం మార్చకుండా అవి బాగా ప్రకాశమానం అయ్యేలా అనుషంగిక పాత్రలను కల్పించుకోవడం వరకే చేయాల్సి ఉంటుంది.

చరిత్రలో అప్రధాన పాత్రలుగానో, అప్రధాన సంఘటనలుగానో కొన్ని వుండిపోయి చరిత్ర పుటల్లో అంటే ఇతిహాసపు చీకటి కోణంలో దాగిపోవచ్చు. అలాంటి సంఘటనలు రచయితలు గుర్తించి చారిత్రక నవలలుగా రచించవచ్చు. దానివల్ల ఆ వ్యక్తులకు, సంఘటనలకు ప్రాచుర్యం లభింప చేసినవారవుతారు.

'చరిత్ర' వాస్తవం, సత్యనిష్ఠ ప్రమాణంగా సాగేదయితే 'నవల' కళావిలువలను, పాత్రపోషణను ప్రమాణంగా పెట్టుకొని సాగేది. చారిత్రక నవలలో 'వాస్తవికత', కళాత్మక విలువలు రెండూ సంగమిస్తాయి. చరిత్రకు ఎంతటి కళాత్మక సౌందర్య ఆచ్ఛాదనం కలిగించినా చారిత్రక నవల అని పిలవరు. అట్లాగే చారిత్రక నవలలో ఎంత సత్యనిష్ఠను, వాస్తవికతనూ పొందుపరిచినా చరిత్ర కాబోదు. చరిత్రకర్తకు నీతిబోధ మొదలైన ప్రబోధాలు చేయాల్సిన అవసరం లేదు. చారిత్రక నవలా రచయిత నీతిబోధ, ఉత్తేజం, సందేశం, ఆనందం మొదలైన ఆశయాలతో కలం పడ్తాడు. అందువల్లే చరిత్ర కన్నా చారిత్రక నవలకు వివేచనాశీలం, జీవితతత్త్వాన్ని వ్యాఖ్యానించే లక్షణాలు అదనపు విలువలుగా ఉంటాయి.

ఐ.హెచ్‌. కార్‌ అన్నట్లు చరిత్ర అంటే గతానికి వర్తమానానికి మధ్య సాగే అనంతమైన సంభాషణం. వర్తమానపు స్పృహ లేకుండా ప్రాచీన చరిత్రను చరిత్రకారుడు పరిశీలించనట్లే చారిత్రక నవలారచయిత కూడా ఈ కాలపు దృష్టితో, ఆ కాలపు సమస్యల పరిష్కారానికి ఆ కాలపు చరిత్రలో ఆధారాలు, అవకాశాలు అన్వేషిస్తాడా? 'మహతి' వ్యాస సంకలనంలో ముదిగొండ వీరభద్రశాస్త్రిగారు ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. 'సమకాలీన సమస్యలను పరిష్కారాలను కూడా కొందరు నవలాకర్తలు ప్రాచీన ఇతివృత్తాలలోనికి చొప్పిస్తున్నారు. చొప్పించడమే కాదుఅందులో కృతకృత్యులవుతున్నారు. దీనివల్ల ఒక విషయం స్పష్టం అవుతున్నది. నవీనంగా చొప్పించబడిన కొన్ని అంశాలు కథాకాలం నాడు లేకపోయినా అవి 'అవాస్తకవికం' అన్న భావన కలగకుండా రచయిత తన నైపుణ్యంతో భ్రమపెట్టవచ్చు' (మహతి, పుట 118). విస్తారమైన సాహిత్య ప్రక్రియగా 'నవల'ను భావిస్తే 'చారిత్రక నవల' మరో ఉప సాహిత్య ప్రక్రియగా భావించుకోవచ్చు. ఈ చారిత్రక నవలను మూడు ఉప విభాగాలు చేయడానికి వీలుంది. 1. శుద్ధ చారిత్రక నవలలు 2. చారిత్రక కల్పనలు 3. మిథ్యా చారిత్రక నవలలు.

నోరి నరసింహశాస్త్రి, అడవి బాపిరాజులవి శుద్ధ చారిత్రక నవలలయితే, విశ్వనాథ వారివి చారిత్రక కల్పనలు. ఏకవీరలోను, బద్దన్న సేనానిలోను చరిత్ర కన్నా నాయికా నాయకుల ప్రణయ సంఘర్షణమే ముఖ్యం తప్ప చరిత్ర కాదు. చారిత్రక నేపథ్యాన్ని విశ్వనాథ వాడుకున్నాడు, అంతే. ఆ పేర్ల బదులు వేరే పేర్లు పెట్టినా ఇతివృత్తానికి భంగం కలగదు. కాని నోరి నరసింహశాస్త్రి 'రుద్రమదేవి', 'కవి సార్వభౌముడు' నవలల్లో అట్లా కాదు.

మిథ్యా చారిత్రక నవలలకు పరుచూరి నారాయణాచార్యుల నవలలను నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పరుచూరి నారాయణాచార్యులంటే మరెవరో కాదు 'లల్లాదేవి'. 2500 నాటి గణతంత్ర వ్యవస్థ గురించి, ద్రావిడుల జీవితగాథలను గురించి లల్లాదేవి ఎలాంటి ఆధారాలు లేకపోయినా తన కల్పనా చాతుర్యంతో 'ఆత్మ చెప్పిన కథ' పేరుతో 295 పేజీల నవల రాసేశారు.

లల్లాదేవి 'సమ్రాట్‌ అశోక' అనే మరో నవలలో అశోకుని భార్యలలో ఒకరైన తిష్యరక్షిత అశోకుని కొడుకైన కునాలుని మరులుగొనడం, అతడు నిరాకరించడం, పగ బట్టి భర్తతో అతని కళ్లు పెకలింపజేయడం కనిపిస్తుంది. ఇదంతా చిత్రాంగి సారంగధర కథను తీసుకొని వెళ్లి అశోకుని కుటుంబానికి అంటగట్టడమే. అసలు చిత్రాంగి సారంగధర కథ కూడా చారిత్రకం కాదు.

చారిత్రక నవలలోని చారిత్రక ప్రావీణ్యాన్ని పనిగట్టుకొని డాక్టరేటు కోసం పరిశోధించవలసి వచ్చింది. జడ్‌. ఎలిజబెత్‌ కుమారి అనే ఆవిడ 1979లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. కాని గ్రంథం నేటికీ అముద్రితమే. ఎనిమిది అధ్యాయాలున్న ఆ సిద్ధాంత గ్రంథంలో చారిత్రక నవల లక్షణాలు, పరిణామం, ఇతివృత్తం, పాత్ర నిర్మాణాదులు, కథాకథన పద్ధతి, సన్నివేశ కల్పనలు, సంభాషణలు ఇత్యాదులు సాంఘిక ఆర్థిక రాజకీయ మతపరిస్థితులు, రచయితల విభిన్న దృక్పథాలు, ప్రయోజనం మొదలైన అంశాల గురించి చర్చించారు. రచయిత్రి అనుబంధంలో తెలుగులోని స్వతంత్ర చారిత్రక నవలల పట్టిక ఇవ్వడం ప్రయోజనదాయకం.

'చారిత్రక నవల'ల మీద ఈ కాస్త వెలుగైనా ప్రసరించింది. కాని 'తెలుగులో చారిత్రక కథలు' అని ఎవరూ పరిశోధించలేదు. ఎవరైనా పరిశోధన చేస్తే బాగుంటుంది. పరిశోధక విద్యార్థులను కవ్వించడానికి రాచమల్లు రామచంద్రారెడ్డిగారి కొటేషన్‌తో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఆయనేమన్నాడో చూడండి.

'దురదృష్టవశాత్తు తెలుగులో చారిత్రక నవలాకారులుగా పేరుకెక్కినవారందరూ; ఫ్యూడల్‌ కుసంస్కారానికి, సనాతన మూఢాచారాలకు అంతో ఇంతో బానిసలైనవారే. వాళ్లు రాసిన నవలల్లో గతకాలపు మూర్ఖత్వాలకు, అజ్ఞానానికి, బానిసబుద్ధికి, భోగలాలసతకు, ధర్మ పరిరక్షణ పేరుతో పట్టాభిషేకం చేయడం తప్ప నిజమైన చారిత్రకత అనేది దాదాపు శూన్యం.'

దీనితో నేను ఏకీభవించడం లేదు. పూర్తిగా తిరస్కరించడం లేదు. ఈ చారిత్రక నవలా శతాబ్ది సంవత్సరంలో పరిశోధించి నిగ్గు తేల్చవలసిందిగా నివేదిస్తూ ముగిస్తున్నాను.

- డాక్టర్ వెలిదండ నిత్యానంద రావు

English summary
Proffessor Velidanda Nithyanada Rao, who is working in Telugu department of Osmania University, has discussed about the history and how it tronsformed into Telugu historic novel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X