• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జాజుల గౌరి - 'వొయినం' నవల

By Pratap
|

జానపదుల నిత్య జీవితం ఎలా ఉంటుందో 'వొయినం' నవలలో హృద్యంగా చిత్రించబడింది. జానపదుల జీవితాన్ని ఇంత వివరంగా అనేక కోణాల్లో చిత్రించడం జానపదులకే సాధ్యం. ఈ నవల జానపద దళిత జీవితాన్ని చిత్రించినప్పటికి గ్రామాల్లోని వ్యవసాయ సమాజాలలోని కోట్లాది పేద ప్రజల జీవితాన్ని ప్రతిఫలిస్తుంది. ఏ గ్రామంలోనైనా గ్రామీణ వ్యవసాయ జీవితం ఇంతకన్నా భిన్నంగా ఉండేది కాదు.

ఈ నవలలో పేద మహిళల జీవితం, పరిణామాలు సంస్కృతి, తెలంగాణ భాష, తెలుగు సాహిత్యంలో అస్తిత్వ చైతన్యంతో చిత్రించబడ్డాయి.

దళితుల జీవితాల గురించి ఇటీవల అనేక నవలలు వెలువడ్డాయి. ఒక సామాన్య మాదిగ మహిళ కష్టాలను అధిగమించి రచయిత్రిగా ఎదుగుతు మహిళా దృక్పథంతో రాసిన తొలి నవల ఇది. తొలి నవల ఇంత చక్కగా వుండడానికి జీవితాన్ని వాస్తవికంగా దర్శించడమే కారణం. (వొయినం, తెలంగాణ నవల, ముద్రణ 2012, బి.ఎస్‌. రాములు ముందుమాట నుండి)

ఎలికట్టె శంకర్‌రావు 'దేవుని రాజ్యం' అనే నవలను, గుండెపంగు రవికుమార్‌ 'మహిళ' అనే నవలను రాశారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఉంటూ కేశవరెడ్డి అనేక నవలలు రాశారు. అవి చిత్తూరు జిల్లా ప్రాంత రచనలు అయితే వాటిని తెలంగాణ నవలలుగా లెక్కించవచ్చునా, చర్చించవలసి ఉంది.

1990 నుండి తెలంగాణ నవల ఆధునిక సాహిత్యంలో అంతదాకా చిత్రణకు రాని జీవితాలను దళిత బహుజనులను, ఆదివాసీలను, వారి సంస్కృతిని, భాషను, అపూర్వకంగా, అద్వితీయంగా చిత్రిస్తూ వస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే 1970 నుండి గత నలభై ఏళ్ళలో తెలంగాణ కథానవల సాహిత్యం బహుముఖాలుగా విస్తరించింది. అనేక కోణాలను చిత్రించింది.

విప్లవ రచయితల సంఘం, విప్లవ సాహిత్యాన్ని ఆకాశానికెత్తి మిగితా సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేయడంవల్ల కొంతకాలం పాటు ఆయా రచనలు రచయితలు వారి నైపుణ్యం ప్రాచుర్యంలోకి రాలేదు. ఉదాహరణకు దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్యవేదిక, 1991 నుండి విస్తృతంగా ఉధ్యమంగా చేసే కార్యక్రమాల్లో సభలు, సమావేశాల్లో, విశ్లేషణల్లో భాగంగా ఎందరో రచయితలు, తిరిగి కొత్తగా అర్థమయ్యారు. అది యిచ్చిన స్ఫూర్తితో అంబేడ్కరిజం దృక్పథంతో, బీసి దృక్పథంతో, వందల కథలు నవలలు వెలువడ్డాయి.

అందులో భాగంగా కంచె ఐలయ్య రాసిన 'వై అయామ్‌ నాట్‌ హిందూ' నవల, వేముల ఎల్లయ్య రాసిన 'కక్క', 'సిద్ధి' నవలలు; నేరెళ్ళ శ్రీనివాస్‌గౌడ్‌ రాసిన 'గౌడజీవితాల బతుకుతాడు', మాదిగ వ్యవసాయ జీవితాలు చిత్రించిన జాజుల గౌరి నవల 'వొయినం', కాలువ మల్లయ్య రాసిన నవలలు ఎన్నో వెలువడ్డాయి. పెద్దింటి అశోక్‌కుమార్‌ అరబ్‌ దేశాల వలసల జీవితాల గురించి, 'ఎడారి గుంటలు', గుడ్డెలుగును ఆడించి బతికే జీవితం, దానితోగల అనుబంధం చిత్రించిన 'జిగిరి', నీళ్ళ సమస్య గురించి చిత్రించిన నవల ఇలా అనేక కోణాలు చిత్రించబడ్డాయి.

BS Ramulu on Jajula Gowri's novel and on Telangana novel

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి 'మృత్యుంజయులు', 'తెలుగుగడ్డ', 'ప్రజలమనిషి', 'గంగు', 'జనపదం', 'మోదుగుపూలు', 'చిల్లరదేవుళ్ళు', 'బతుకు పుస్తకం', 'మలగని బత్తి', 'జబ్‌ ఖేత్‌ జాగే', 'సింహగర్జన' అనేక కోణాలను చిత్రించాయి. అయితే కుల వివక్ష, కులసమస్య గురించి ఈ నవలల్లో పెద్దగా కనపడదు. ఆయా రాజకీయ పార్టీల ఉద్యమాల పరిమితి దృక్పథమే ఆయా నవలల పరిమితిని నిర్దేశించింది.

బోయ జంగయ్య 'జాతర' నవలలో మూఢ విశ్వాసాలను చిత్రిస్తే, 'జగడం' నవలలో దళితులు తొలితరం విద్యావంతులుగా ఎదుగుతూ విద్యా ఉద్యోగాలు అందుకొనే క్రమంలో సహకరించినవారు ఎదుర్కొన్న అవరోదాలు, ఉద్యమాల ప్రభావాలు, వాటి మలుపులు, చర్చలు, అవి జీవితాలను ఎదిగించిన తీరు, అడ్డగించిన తీరు గురించి అపూర్వంగా చిత్రించారు. చిలకమర్తి లక్ష్మీనరసింహారావు రాసిన 'గణపతి' నవలలో, కొడవటిగంటి కుటుంబరావు రాసిన 'చదువు' నవలలో చదువుకొనే క్రమంలోని సమస్యలు, జీవితాలు వేరు, దళితులు, గడచివచ్చిన సమస్యలు జీవితాలు, సంస్కృతి భాష వేరు అని 'జగడం' నవల చదివితే స్పష్టంగా అర్థమౌతుంది.

కులవివక్ష ఎన్ని రూపాల్లో కొనసాగుతుందో ఎస్సీలు, బీసీలు రాసిన నవలల్లో కొంత చిత్రించబడింది. అయితే విప్లవ సాహిత్యంలో అల్లం రాజయ్యగానీ, సాహుగానీ, సాధనగానీ, రావిశాస్త్రి గానీ, కుల వివక్షను, కుల సమస్యలను, కులం సృష్టించే పరిణామాలను పట్టుకోలేకపోయారు. అందువల్ల ఆయా విప్లవ రచనలు సామాజిక వాస్తవికతను ప్రతిఫలించలేకపోయాయి. సామాజిక వాస్తవికతకు భిన్నంగా ఆయా ఉద్యమాలు చెప్పిన మేరకే అర్థం చేసుకున్న మేరకే జీవితాన్ని ఉద్యమాలను చిత్రించారు. అందువల్ల అవి సమాజాన్ని ఒక సమగ్రతలో ప్రతిఫలించలేక పోయాయి. ఉద్యమించే ప్రజలయొక్క సంస్కృతిని, జీవితాన్ని కూడా సరిగ్గా చిత్రించలేకపోయాయి.

- బిఎస్ రాములు

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A prominent critic BS Ramulu has analysed Jajula Gowri's novel Voyinam and other Telangana novels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more