• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రపంచీకరణ - తెలంగాణ - దళితీకరణ

By Pratap
|
Globalisation: Telangana and Dalithisation concepts
గ్లోబలైజేషన్‌ వల్ల దేశానికి, దేశ ప్రజలకు మేలు జరుగుతుందనే భావన కొంత మంది మేధావుల్లో బలంగా నాటుకుపోయింది. అందుకు అనుగుణంగానే వీరు ప్రచారానికి పూనుకున్నారు. వీరు దళితతత్వాన్ని సూత్రీకరించి, దళితీకరణను ప్రోత్సహించినవారు కావడం మరీ గమనార్హం. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది 'నేను హిందువునెట్లయిత' (వై ఐ యామ్‌ నాట్‌ ఎ హిందూ) అనే ప్రసిద్ధ పుస్తకాన్ని రాసిన కంచె ఐలయ్యను, 'కులం'పై విప్లవ పార్టీతో విభేదించి బయటకు వచ్చి 'దళిత రచయితలు, మేధావులు, కళాకారుల ఐక్య వేదిక'ను ఏర్పాటు చేసిన వారిలో ఒకరైన ప్రముఖ రచయిత బి.యస్‌. రాములును. ఆర్థిక ప్రపంచీకరణ సంపన్నులను మరీ సంపన్నులుగానూ, పేదలను మరీ పేదలుగానూ చేస్తుందని కంచె ఐలయ్య అంగీకరిస్తూనే సాంస్కృతిక ప్రపంచీకరణ దళితులకు మేలు చేస్తుందని, ఇది బ్రాహ్మణీయ సంస్కృతి నుంచి దళితులకు విముక్తి ప్రసాదిస్తుందని వాదిస్తున్నారు.

ప్రపంచీకరణ వల్ల ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అనేది విస్తృతంగా అభివృద్ధి చెంది దళితులకు విముక్తి ప్రసాదిస్తుందని ఆయన వాదిస్తున్నారు. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అనేది విస్తృతంగా అభివృద్ధి చెంది దళితులకు, వెనకబడిన కులాలకు అమెరికాలో ఉద్యోగాలు వచ్చాయని, అమెరికాకు వెళ్లి డాలర్లను మూట కట్టుకోవడం సులభమైందని బి.యస్‌. రాములు తన కథల ద్వారా సూత్రీకరిస్తున్నారు. ఈ ఇద్దరి వాదనల్లో వైరుధ్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఐలయ్య వాదన సంస్కృతికి సంబంధించినదైతే బి.యస్‌. రాములు వాదన ఆర్థిక రంగానికి సంబంధించింది. ఈ ఇద్దరు కూడా వెనుకబడిన కులాలకు చెందినవారే.

ప్రపంచీకరణ అంటే ఏమిటనే ప్రశ్నకు పలువురు పాశ్చాత్య పండితులు నిర్వచనాలు ఇచ్చారు. సరళంగా, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చడం. కుగ్రామంగా మార్చడమంటే దూరం తగ్గించడం. సమాచారాన్ని క్షణాల్లో గుప్పించడం ఇందులో ప్రధానాంశం. సాంస్కృతిక ఏకీకరణను సాధించడం అనేది ఇందులో ఇమిడి వున్న లక్షణం. భిన్న సంస్కృతులను, ఆచారాలను ఇది మింగేస్తుందన్న మాట. ఈ ప్రపంచీకరణ ధాటికి రూపు మాసిపోయే సంస్కృతులు ఏవి? అవి తప్పకుండా వర్ధమాన దేశాల సంస్కృతులే. ఈ సంస్కృతులను రూపుమాపడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి? అన్ని రకాలుగా ఏకీకృత జీవన విధానం అమలులోకి వస్తుంది. ఆచార వ్యవహారాలు మారిపోతాయి. ప్రపంచీకరణ ద్వారా ప్రచారమయ్యేది వ్యాపార సంస్కృతి, అంటే మార్కెట్‌ సంస్కృతి. సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత ప్రపంచాన్ని నియంత్రిస్తున్నది అమెరికా ఒక్కటే. కాబట్టి ఆ మార్కెట్‌ సంస్కృతి తప్పకుండా అమెరికాదే అయి వుంటుంది. మరోటి కావడానికి వీలు లేదు. దీన్ని ప్రచారం చేయడానికి ప్రసార మాధ్యమాలు గొప్పగా ఉపయోగపడతాయి. ఈ ప్రసార మాధ్యమాలు క్రమక్రమంగా చాప కింద నీరులా వెనుకబడిన దేశాల సంస్కృతులను కబళించివేస్తాయి. టీవీ చానళ్లు మన మీద చేస్తున్న కనరాని దాడి ఇదే. ఏది మంచి, ఏది చెడు? ఏది తక్కువ, ఏది ఎక్కువ? అనే విషయాలను నిర్ధారించి అది మనకు అందిస్తూ వుంటుంది. అందుకు అనుగుణంగానే మన జీవితాలు, జీవనశైలులు, అవసరాలు మారిపోతుంటాయి.

ఇప్పటికే ఈ దుష్ఫలితాలు మనం చూస్తున్నాం. ప్రపంచీకరణ వినిమయ సరుకులను ప్రజల అవసరాలుగా మార్చివేస్తున్నది. ఇందులో భాగంగానే ప్రజల అవసరాలు పెరిగిపోతూ వుంటాయి. కేవలం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉల్లాసానికి జానపదా కళా ప్రదర్శనల సందర్శన లేదా జానపద కళారూపాల్లో ప్రజలే భాగం పంచుకోవడం వంటి వాటితో జీవితం గడిచిపోవడం గగనమై పోతుంది. మానసికోల్లాసానికి సంబంధించిన కళారూపాలను, ప్రదర్శనలను కూడా ప్రపంచీకరణ నిర్దేశిస్తుంది. ఈ అవసరాలకు, మార్కెట్‌కు విడదీయరాని లంకె వుంటుంది.

ఒక రకంగా చెప్పాలంటే, వర్ధమాన దేశాలను ప్రపంచీకరణ అనేది అగ్రరాజ్యాల (ఇప్పుడై అమెరికా) వలస ప్రాంతాలుగా మార్చి వేస్తుంది. ఒకప్పుడు సైనిక దాడులతో భౌతిక ఆక్రమణలతో వలస ప్రాంతాలుగా మార్చుకొని కొల్లగొట్టే విధానం ఉండేది. సామ్రాజ్య వాదులు ఆ పని చేసేవారు. దీన్నే మనం సామ్రాజ్యవాదం అనేవాళ్లం. ఈ సామ్రాజ్యవాదాన్ని ఇటీవలి కాలం దాకా తెలుగు మేధావులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించారు. సామ్రాజ్యవాదం కొల్లగొడుతుందనే ఎరుక ఉండేది. ఈ సామ్రాజ్యవాదం అత్యున్నత స్థాయే ప్రపంచీకరణ అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే దాన్ని ఎందుకు వ్యతిరేకించాలనే విషయం కూడా స్పష్టమవుతుంది.

వర్ధమాన దేశాలను తమ వలస ప్రాంతాలుగా, అంటే మార్కెట్‌ వలసలుగా మార్చుకోవడానికి భౌతికదాడులకు పాల్పడవలసిన అవసరం లేదు. సంస్కృతులను మార్చేయడం ద్వారా, తమ సంస్కృతినే సర్వవ్యాప్తం చేసి ప్రపంచాన్ని 'కుగ్రామం'గా మార్చేయడం ద్వారా తన పనిని అమెరికా సులువుగా చేసుకుంటూ పోతున్నది. అవసరమైన చోట అది సైనిక దాడులకు కూడా పాల్పడుతుంది. అఫ్ఘానిస్తాన్‌పై దాడి చేసి అక్కడ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో (తాలిబాన్‌ల మంచిచెడుల గురించి ఇక్కడ అప్రస్తుతం) అమెరికా నిర్వర్తించిన పాత్ర, ఇప్పుడు ఇరాక్‌ను నేలమట్టం చేయడానికి పూనుకోవడం ఈ నేపథ్యం నుంచే చూడాలి. తన తైనాతీలుగా ఉండటానికి ఇచ్ఛగించని ప్రభుత్వాలను మార్చేయడానికి అమెరికా బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడబోదని ఇరాక్‌ విషయంలో స్పష్టం అవుతూనే వున్నది. ఇదంతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి, తన ఆర్థిక ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి చేస్తున్నదే.

దురాక్రమణలు లేనంత మాత్రాన ప్రపంచీకరణ అనేది సామ్రాజ్యవాదం కన్నా మంచిదై పోదు. అంతకన్నా ప్రమాదకరమనే విషయం కంచె ఐలయ్య, బి.యస్‌. రాములు వంటి వారి వాదనలే తెలియజేస్తున్నాయి. అంటే మన ఆలోచనాధోరణులను ప్రభావితం చేసి తనకు అనుకూలంగా మార్చుకునే లక్షణం ప్రపంచీకరణకు ఉన్నది. ప్రపంచీకరణ అనేది సమాజాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది. ఇక్కడి మార్కెట్‌ను సొంతం చేసుకోవడంలో భాగంగా అది పనిచేస్తుంది. సమాజాన్ని ప్రభావితం చేసే ఆలోచనాపరులను కూడా అది చీల్చగలదు. అందులో భాగంగానే ప్రపంచీకరణ మంచిచెడుల గురించి చర్చ జరుగుతూ వుంది. ప్రపంచీకరణ అనేది ముఖ్యంగా ఆర్థికపరమైన దోపిడీకి సాధనమే. కాబట్టి అది సాంస్కృతికంగా ఇక్కడి దళితులకు మేలు చేస్తుందనే కంచె ఐలయ్య మాటలు సత్యదూరాలే అవుతాయి. అలాగే అమెరికాలో ఉద్యోగాలు చేసి డాలర్లు సంపాదించి సంపన్నులు కావడమనేది పరిమితమవుతూ పోతుంటుందనేది, అక్కడి హైటెక్‌ భారతీయ కూలీలకు ఇచ్చేది వర్ధమాన దేశాల నుంచి కొల్లగొట్టిన సంపదలోంచి అణుమాత్రమేననేది బి.యస్‌. రాములు గ్రహింపు లోకి రాకపోవడం విచిత్రమే.

అయితే సాంస్కృతిక దాడి ద్వారా ఆర్థిక దోపిడీకి పాల్పడే ఎత్తుగడలను సాంస్కృతికం గానే ఎదుర్కోవాల్సి వుంటుంది. బ్రాహ్మణీయ సంస్కృతి విశ్వరూపమే ప్రపంచీకరణ సంస్కృతి తప్ప మరోటి కాదు. బ్రాహ్మణీయ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా కంచె ఐలయ్య దళితీకరణను ప్రతిపాదించారు. దళితీకరణ అనేది కేవలం సాంస్కృతిక ఆధిపత్యానికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదని, అది ఆర్థికపరమైన అసమానతలకు కూడా పరిష్కారం చూపుతుందని కంచె ఐలయ్య గుర్తించారా, లేదా అనేది అనుమానంగా వుంది.

దళితీకరణ ప్రక్రియ ద్వారా భారతదేశంలోని బ్రాహ్మణీయ సంస్కృతికి విరుగుడు మాత్రమే కాదు, తాను సృష్టించిన ఉత్పత్తుల ద్వారా మాత్రమే తన జీవితావసరాలను తీర్చుకునే జీవన విధానాన్ని స్వీకరించడం ప్రంచీకరణ ఆధిపత్యాన్ని తిరస్కరించడం కూడా అవుతుంది. తమ ఉత్పత్తి సాధనాల ద్వారా తాము ఉత్పత్తి చేసే 'వస్తువు'ల ద్వారా తమ జీవనానలు సాగించడం అవుతుంది. తద్వారా అన్ని రకాల ఆధిపత్యాలను తిరస్కరించడం అవుతుంది. సరుకుల ప్రాబల్యాన్ని తగ్గించడం అవుతుంది. దళితవాదం ద్వారా ఈ ప్రక్రియను బోధించిన కంచె ఐలయ్య తప్పుడు అవగాహనకు ఎందుకు లోనయ్యారో అర్థం కాదు. ఆచరణలో దళిత ఉద్యమాలు విఫలం కావడం వల్ల అది ఆధిపత్యాలను ఎదిరించలేని థకు చేరుకున్నాయి. అదే సమయంలో వాటాల డిమాండ్‌కు మాత్రమే పరిమితమై పోయింది. ఈ వాటాల డిమాండ్‌ పోరాటం వల్ల సమాజంలో గుణాత్మక మార్పు సాధ్యం కాదు. ఈ వాటాల డిమాండ్‌కే పరిమితమై బి.యస్‌. రాములు మాట్లాడుతున్నారు. బి.యస్‌. రాములు వాదనలకు వాటాల డిమాండ్‌ పోరాటానికి మించిన విస్తృతి లేదు.

నిర్దిష్టత ద్వారా ప్రపంచీకరణ దాడిని ఎదుర్కోవడం సాధ్యం అవుతుంది. గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణ అనే నిర్దిష్ట పోరాట రూపం ద్వారా సామ్రాజ్యవాదంపై ఎదురుదాడికి పూనుకున్నాడు. ఆ రకంగా అన్ని రకాల నిర్దిష్ట గుణాలను సొంతం చేసుకోవడం ద్వారా ఆధిపత్యాలను ప్రశ్నించి, ఎదిరించే బలం చేకూరుతుంది.

దళిత ఉద్యమాలు దీర్ఘకాలిక, విస్తృత ఫలితాల సాధన కోసం సాగడంలో విఫలమైన నేపథ్యం నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చూడాలి. తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి ప్రపంచీకరణను ఎదిరించే లక్షణం చారిత్రకంగానే సమకూరిందనేది ముందు మనం గమనించాలి. తమ వనరుల మీద తమకే ఆధిపత్యమని, తమ జీవన విధానం ప్రత్యేకమని, తమ సంస్కృతి విశిష్టమైనదని, తమకూ చరిత్ర ఉన్నదని తెలియజేసుకునే క్రమంలో సాగే తెలంగాణ సాంస్కృతికోద్యమం ప్రపంచీకరణకు జవాబు చెప్పగలదు. ఒక తెలంగాణ ఉద్యమమే కాదు, ఏ దేశీయ/ స్థానీయ అస్తిత్వ ఉద్యమానికైనా ఆ గుణం ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే తెలంగాణకు ఆ లక్షణం వున్నది. ఈ దృష్ట్యా ప్రపంచీకరణను వ్యతిరేకించే శక్తులు కూడా తెలంగాణ అస్తిత్వ ఉద్యమాన్ని బలపరచాల్సిన అవసరం వుంది. ఇదే సమయంలో ఇది కేవలం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మాత్రమే పరిమితమైన ఉద్యమమనే భ్రమను విడనాడటం అవసరం.

- కాసుల ప్రతాపరెడ్డి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 In the context of Glonalisation, the concepts of Telangana and Dalithisation should take their coarse of actions.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more