• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గడుసైన మెత్తని కవి

By Pratap
|

ఆకాశం ఉరుముతుంది. అందరూ ఉలిక్కిపడతరు.

సునామీ విరుచుకు పడుతుంది. లేచి కూర్చుంటరు- యంత్రాంగం సన్నధ్ధమవుతుంది.

ఆకు రాలిన శబ్దం ఎవరి చెవినా పడదు. పైరు కంటినుండి ఓ చినుకు రాలుతుంది. ఎవరి కంటా పడదు. అగో అసొంటి వినే ఒక కవి ఏనుగు నరసింహా రెడ్డి.

సీరియస్ విషయాలే కాకుండా, వాటిమధ్య జారిపోతున్నదయనీయ జీవన దృశ్యాల్ని పట్టుకోవడం; అనేక వాదాలు, ధోరణులు, ఉద్యమాల్లో ఇమడకుండా సమకాలీన సాహిత్యంలోకీ, చరిత్రలోకీ ఎక్కకుండా మిస్ అయ్యే మానవీయ సంఘర్షణలను పట్టుకోవడం నరసింహా రెడ్డి ప్రత్యేకత.

"పీఠభూమిలో నాగలి కర్రు కింద

నీటిమట్టం కూడా

నిర్దయగా జారుకుంటుంది" - అంటూ ఒక తెలంగాణ వ్యవసాయ దైన్యాన్ని చిత్రించడం -

Dr Sunkireddy Narayana Reddy

"పక్షులు వాలిన చెట్టు

అర తెర తీసిన రంగస్థలం

వివిధ వర్ణాల పుష్పాల వింత తోట

గట్టును దాటేయాలని

ఎగిసిపడుతున్న అలల సమూహం

వంకర్లు తిప్పుకున్న ప్రవాహాన్ని కలుపుకొని

తళతళ మెరుస్తోంది" - అని కాలేజీ జీవిత యవ్వన సందర్భాన్ని ద్రుశ్యమానం చేయడం -

"కొన్ని వృత్తులు బాధ్యతల బరువుతో కుంగిపోతూ

సమస్త శక్తుల్ని ఒడ్డి చేయాల్సిన పోరాటాలు" - అని మధ్య తరగతి ఉద్యోగ వేదనను చిత్రించడం అట్లాంటిదే.

ప్రతి మనిషిలో ఒక లోపలి మనిషి ఉంటాడు. ఆ లోమనిషిని గతంలో అంతరాత్మ అన్నరు. ఆధునిక కాలంలో కాన్షియస్ అన్నరు. ఆధునికానంతర కాలంలో ఆ కాన్షియస్ నెస్ మరో కన్సెర్న్ అంటున్నరు. మనిషి తప్పు చేసినప్పుడు ఆ కాన్షియస్ ఓ హెచ్చరిక చేస్తుంది. తప్పు అంటుంది ఆ మనిషి విన్నా వినకపోయినా. అది తనపని తాను చేసుకుంటూ పోతుంది నిరంతరాయంగా.

మనిషి సహస్ర శతసహస్ర రూపం లోకం. లోకం కాన్షియస్ కవి. వేమనను లోకం విన్నా వినకున్నా వేమనలు ఎప్పుడూ ఉంటారు. అలాంటి కవి ఏనుగు నరసిం హా రెడ్డి. కాన్షియస్ని లోపలి స్వరం అంటున్న. ఈ లోపలి స్వరం నర్సింహారెడ్డి కవిత్వంలో రెండు పొరల్లో కనపడుతుంది. లోకం గురించి మాట్లాడుతున్నప్పుడు నరసింహా రెడ్డి కవిగా లోకం లోపలి స్వరం అవుతాడు. తనగురించి మాట్లాడుతున్నప్పుడు తనలోని లోపలి స్వరం అవుతాడు.

న్యాయ వ్యవస్థలాగ నిస్పక్షపాతంగా నిజాయితీగా విలువల నిర్మాతగా ఉండాల్సిన మీడియా వాటిని వదిలేయడం ఎప్పుడో ప్రారంభమయినా ఇప్పుడది పరాకాష్టకు చేరుకుంది. అయితే దాన్ని విమర్శించడమంటే అందరికీ భయమే. కవులూ అందుకు మినహాయింపు కాదు. అలా ఎవరూ స్పందించడానికయినా భయపడే మీడియా మీద నిష్కర్ష విమర్శ చేస్తాడు.

"మీకు అనుకూల భావాల

రచయితల్ని పుట్టించగలరు

నచ్చిన కవులకు కిరీటాల్ని తొడగగలరు"- అంటాడు. ఒకరికి అనుకూలంగాను మరొకరికి ప్రతికూలంగానూ కాయితం ఉద్యమాన్ని నిర్మించగలరు. ఇలాంటి దానికి ఒకప్పటి సారస్వతోద్యమం, ఇప్పటి సమైక్యాంధ్రోద్యమం ప్రబల నిదర్శనాలు. ఇలా సాధారణంగా కవిత్వంలో మిస్సవుతున్న చాలా అంశాల్ని పట్టించుకున్నాడు నరసింహా రెడ్డి. చూడండి -

"రద్దీ లేమిని చూడడం మర్చిపోయి

అదే పనిగా వెలుగుతున్న సిగ్నల్ స్టాండ్"

కవిత్వ నిర్మాణపరంగా కూడా నరసింహా రెడ్డిలో కొన్ని ప్రత్యేకతలున్నవి. కొన్ని సార్లు సూటిగా కంటే వ్యంగ్యంగా చెప్పినప్పుడు అది బాగా తాకుతుంది. తెలంగాణ పరిభాషలో దీన్ని దెప్పిపొడవడం అంటరు. ఈ పద్ధతిని కవి సమర్ధవంతంగా వాడుకుంటాడు. కోస్తాంధ్రులు తమను తాముకష్టపడి పైకి వచిన వాళ్ళుగా తెలంగాణ వాళ్ళను సోమరిపోతులు కావడం వల్ల వెనుకబడ్డారనే ప్రచారం చేసి తెలంగాణ ప్రజల్ని గాయపరుస్తున్నరు. అది కవిని కూడా గాయపర్చింది. ఆ బాధలో, కోపంలో -

"ఫ్యాక్టరీల మిషతో ద్రవ్య సంస్థల్ని ముంచేసి

నింపాదిగా జెండా లేపేస్తరు

వాళ్ళు కష్టపడ్తరు సార్" - అని వాళ్ళ కష్టం ఎట్లాంటిదో దెప్పి పొడుస్తడు. అక్కడక్కడ నిరలంకారంగా సరళంగా చెప్పినా ఈయన ఇమేజెస్ శక్తివంతంగా వాడుకుంటడు. అందులో తెలంగాణ నేటివిటి ఉంటుంది.

"రంగురంగుల వాహనాల నగల్ని ధరించిన రోడ్డు

ఎప్పుడో అర్ధరాత్రికాని

అలంకారాల బరువు దింపి

కాస్త కునుకు తీయదు"

***

పరవళ్ళు తొక్కే అల

హఠాత్తుగా ఆగిపోయినట్లు

రాసిన వాక్యాలన్ని దిమ్మరపోయినై"

***

"తల్లులు మాసిన పిల్లల నెత్తుల్లోంచి

పేండ్లను ఏరి కుక్కినట్లు

పక్షులు కొమ్మల రెక్కలనడుమ

గండు చీమల్ని ఏరిపారేస్తుండేవి"

***

"ఎండలో కన్నెర్రజేసిన

మోదుగు పూలు"

నరసింహా రెడ్డిలోని భావుకతకు, భావనా శక్తికి, వస్తువును ఆత్మగతం చేసుకునే తత్వానికి గొప్ప నిదర్శనం 'తంత్రీ హాసం'.

"తంత్రి నుండి నువ్వొక

నవ్వు రువ్వుతావు

ఆకాశం నుండి

మృదుల సాంద్రపు

వడగండ్లు కురిసినట్లు

నేలనీటి నిశ్చలత్వం మీద

ఒక వింత అలజడి మొదలవుతుంది"

"నాలో తుఫానొకటి

నిరంతరం కలయదిరుగుతుంది

మబ్బు సందుల్లోకి ఎగిరి కోయిల పాడినట్లు

కొండవాలుపై ఎడ్లబండి సాగినట్లు

ఒడ్డుల్ని ఒరుసుకొని ఏరు నిండుగా పారినట్ట్లు

చిన్నప్పటి జారుడు బండపై

సర్రున జారింట్లు"

రెండు ప్లాన్లలో సాగే ఈ కవితలు అమూర్తతకు మూర్తిమత్వం ఇచ్చి మన మనో ప్రపంచం ముందు నిలబెట్టడం అద్భుతం -హాట్సాఫ్.

మనిషి నాగరీకుడు అవుతున్న కొద్దీ హృదయంలో సంగీతం అంతర్ధానమవుతుంది. ఈ కవి నగరీకుడయినా ఇంకా పూర్తి నాగరీకుడు కాలేదు. ఊరునుండి వెంట తెచ్చుకున్న సంగీతం అతనితో సహజీవనం చేస్తూనే ఉన్నది. అందుకే ఇతని కవిత్వంలో ఒక ధార. ఆగని ధార కనబడుతుంది. తూచి మాత్రలు వేసినట్లు వాక్యాల్లో సమత కనబడుతుంది. వెరసి ప్రజల భాషలో నాటి నుండి వెలువడే హార్మోనియం చప్పుడు సుదూర నేపథ్యంలో వినపడుతుంది.

"చెట్లు వెనక్కెల్తున్నయో

బస్సే ముందుకెల్తుందో అర్ధం కాదు

ఎండాకాలం మిట్టమధ్యాహ్నం కూడా

చెమ్మ గాలి చెంపల్ని తాకుతూనే ఉంటుంది

తొలకరి వానకు లేచిన పసిరిక మీద

ఎర్రని ఆరుద్ర పురుగులు నడిచినట్లు

ఒంటి మామిడి ప్రజ్ఞాపురాలను కలుపుతూ...

నిర్లక్ష్యపు క్రాసింగ్ వల్లనో

నిద్రమత్తు డైవింగ్ వల్లనో"

బహుశా అందువల్లనేమో నరసింహా రెడ్డి కవిత్వంలో మెత్తని నడక, లోతూ గాఢత ఉన్న లో ప్రొఫైల్ ఉండటం. ఇది మరొక ముఖ్య లక్షణం.

"రాచకాలువొస్తే

తుమ్మలగూడెం చెరువు అలుగు బారినట్లు

వరికోతలైనంక

ఎన్నారం మారెమ్మ తీర్తం మొదలైనట్లు

నేను ఊరికి చేరుకోగానే

కల్లోనికుంటకు నాన యాది కొస్తడు

(మా నాన్న బహుశ తెలంగాణల అందరి నాన్న గుర్తుకొచ్చి దుఖం ఆగలే)

నరసింహా రెడ్డిలో ప్రతిభావంతమైన కవి ఉన్నాడు. ఒక ఊరు, బతికి పోండ్రి, పలక, కల్లోనికుంట, కాడమల్లె పూల చెట్టు, వాలూ కష్టపడుతరు సార్ మనోల్లు సోమరిపోతులు, చక్రం, కలల గ్రహం మీద, వలస కాలం, కొత్త కిటికి, ఔను సుమా, ఫౌతీ, పేర్వారం, తంత్రీహాసం, సమాంతరం, తూకం, అంతరంగం, జీవపదం, పట్నంల వాన మొదలైన కవితలన్ని కవిలోని ప్రతిభకు ప్రబల నిదర్శనాలు.

ప్రపంచీకరణ వల్ల కొందరు రాత్రికి రాత్రి కోటీశ్వరులైతే అయి ఉండొచ్చు. మధ్య తరగతి ఒక మెట్టు పైకి ఎక్కి ఉండొచ్చు. సాంకేతిక రంగంలో విప్లవమే జరిగి ఉండొచ్చు. అది ప్రపంచమంతా పరివ్యాప్తమై ఉండొచ్చు. అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి ఉండొచ్చు. కాని ఇదంతా అగ్ర రాజ్యాలకు, అగ్రధనికులకు అనుకూలంగా జరుగుతున్న పరిణామం. ఇది వ్యవసాయన్ని, ముఖ్యంగా తెలంగాణ లాంటి మెట్ట వ్యవసాయాన్ని, గ్రామాలను, గ్రామాలతో ముడిపడి ఉన్న అన్ని వృత్తులను చిన్నాభిన్నం చేసింది. ఈ పరిణామాన్ని నరసింహా రెడ్డి ప్రతిభావంతంగా పట్టుకున్నాడు. సామాజిక చలనాన్ని కవిత్వంలో సరిగ్గా బంధించడం మంచి కవి లక్షణం. ఈ పరిణామంలో తాను ఒక ప్రభుత్వాధికారిగా అసౌఖ్యానికి గురైన వాళ్ళవైపు నిలబడడం గొప్ప విషయం. గ్రామాలు ఛిద్రం కావడం మంచిదేనని కొందరనవచ్చు. కాని ఆ ఛిద్ర దృశ్యం చూసి వేదనకు గురికాకుండా ఉండడం మానవ మాత్రుడికి సాధ్యం కాదు. కవికి అంతకంటే సాధ్యం కాదు.

"వెనకట ఇక్కడొక ఊరుండేది

మనుషులకు రక్షణ కవచంగా

గుంపులు గుంపులుగా చెట్ల సమూహం

ఆకాశంలో తిరగాడే నల్ల మబ్బులకి

వలపు బాణాలొదిలేవి

..............

ఇక్కడికి రసాయనం రాకముందు

ఊర్లోని మకిలినంతా

చినుకులు పరాచికాలాడుకుంటూ

వాగులోకి ఊడ్చేసేవి

..................

పచ్చని నేలపలకమీద

పరుగెత్తలేని ఆరుద్ర ఆటబొమ్మలు

.................

అప్పుడు ఊరు పైసలతో కాదు

పసిరికతో జీవించేది"

గ్రామ విధ్వంసాన్ని, అది బతుక్కోసం వలసలకు దారితీయడాన్ని చెబుతూ -

"ఏట్లో ఇసక రెక్కలొచ్చి ఎగిరి పోయింది

ఏరగాలి దుమ్ము మొహాన చిమ్మింది

బోరుపొక్కలు నోరుదెరిశినయి

బావులు భంగపడ్డయి

బజార్ దివాలా తీసింది

పోండ్రి బిడ్డ పోండ్రి

పటేండ్లకే పని లేదు

మనకు కూలేడ దొరుకుతది"

ఈ విధ్వంసాని బోధనం నర్సిరెడ్డి బోరుపొక్కలు కథలో బాగా చిత్రించిండు. గోరటి వెంకన్న ఒక పాటలో బలంగా పట్టుకున్నడు. ఐతే ఆ పాటలో అందరి బోర్లు ఎండి పోయినై పెద్ద బోరు మాత్రం జోరుగ పోస్తుంది అని రాసిండు తొలుత. (తరువాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సవరించుకున్నడు). నిజానికి ప్రపంచీకరణ సూత్రధారులకు ఆ దృష్టి భేదం లేదు. మొత్తం మన దేశ వ్యవసాయాన్ని విధ్వంసం చేయడమే వారి లక్ష్యం. ఎవరికైనా అనుమానముంటే పైకి మంచి పథకంగా కనిపించే ఉపాధి హామీ పథకం వ్యవసాయం మీద చూపే ప్రతికూల ప్రభావాన్ని గమనించవచ్చు. సబ్సిడీలను ఎత్తేసి ఫర్టిలైజర్ ధరను 150 శాతం పెంచడాన్ని గమనించవచ్చు.

"బాయికి చెల్కకూ నడుమ

లోలకంగా స్థిరంగా నర్తించి

పేదరికం వ్యాధితో పోరాడి

జీవితం నర్తనశాలలో

జీవించి మరణించిన నాన్న

కాలనికి ఆరబెట్టిన

నీటిరంగుల వర్ణచిత్రంలా

నాన్న నాకొక అస్పష్ట గ్నాపకం "

గొప్ప ఇమేజెస్తో వర్ణించిన ఛిద్ర దృశ్యం నాన్న. వ్యవసాయ విధ్వంసంలో భాగమైన ఈ కవితను చదివితే ఏ వ్యవసాయదారుల కొడుకులకైనా దుఖం ఆగదు.

"మనం ఎదురవగానే

తెగిపోయిన జన్మాంతర

తంత్రినెవరో లాగినట్లుంది

లోకం నుండి లోకానికి

స్నేహయానంలో భాగమై

చంద్రకాంత శిలలమీద

సేదదీరినట్లుంది

కలలు సమాంతరమై

సంఘర్శించుకున్న దుఖం

వడిపెడుతున్నట్లుంది

ఎలాగూ కలుస్తూ

ఎప్పటికీ విడిపోతున్నందుకు"

పాశ్చత్య దేశాల్లో అంతా వేగం. యంత్రజీవంలా వేగం. మనవ సంబంధాలు లుప్తమైన ఒక శూన్యస్థితి. ప్రపంచీకరణ పుణ్యమా అని మన నేల మీదికి పాకిన స్థితిని తద్వారా కలిగే వేదననీ చక్కగా వర్ణించిండు నరసింహా రెడ్డి.

మొత్తంగా చూస్తే నరసింహా రెడ్డి ప్రధానంగా మూడు విషయాల గురించి కల్లోలం చెంది రాసిండు. తెలంగాణ వ్యవసాయ జీవితం, తెలంగాణ ఉద్యమం, మధ్యతరగతి ఉద్యోగ జీవితం. ప్రపంచీకరణ బాక్ డ్రాప్ లో పల్లె పట్నం మధ్య ఆసులా తిరగడం కనిపిస్తుంది. ఆసులా తిరుగుతూ రెండు బొమ్మల్ని రూపుకట్టించడం కనిపిస్తుంది. తద్వారా కవి తనలోని ఊరి స్వభావాన్ని నిలుపుకున్నాడు. కవిగా మెత్తగా, అమాయకంగా కనిపిస్తూనే మరోవైపు అర్బనిటిని సాధించిన గడుసైన కవిగా కనిపిస్తాడు. మెత్తని గడుసైన కవి నరసింహా రెడ్డి సాహిత్య ప్రపంచానికి దగ్గరైనవాడు.

- డాక్టర్ సుంకిరెడ్డి నారయణ రెడ్డి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dr Sunkireddy Narayana Reddy, a prominent literary critic, Anugu NarismhaReddy poetry depicts rural environment with a distruction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more