ముద్దెర - అస్తిత్వవాద చర్చ

సిద్దాంతాల నియంతృత్వాన్ని తెంచుకుని బయటపడ్డ జాతీయవాదం, నూతన సామ్రాజ్యవాదం, వలసవాదనలో నలిగిపోయే వివిధ జాతుల భాషా సంస్కృతుల పరిరక్షణ ఆకాంక్షలు - తెలంగాణా ప్రాంతీయ అస్తిత్వవాదానికి పునాదులుగా చెప్పి తెలంగాణ సాహిత్య చర్చకు ఒక సిద్ధాంత ప్రాతిపదికను రూపొందించారు. ఉత్తర ఆధునిక సాహిత్య వాదాలలో అస్తిత్వవాద సాహిత్యం ఎక్కువ ప్రభావం కలది వేగంగా విస్తరించే స్వభావం కలదానిగా గుర్తించారు.
ముద్దెరలోని మూడు తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాద విమర్శ వ్యాసాలలో సుజాతగారు నిశిత పరిశీలనతో సమస్యను గుర్తించారు. ఆ సమస్యకు కారణాలు వెదికారు. ఈ కారణాలు విశ్లేషించటంలో నిర్దిష్ట అభిప్రాయాలను ప్రకటించారు. తెలంగాణ అస్తిత్వ వేదనవాద సాహిత్యాన్ని అంచనా కడుతూ కొన్ని ప్రామాణికమైన అంశాలు వెల్లడించారు.
ప్రపంచీకరణ, సామ్రాజ్యాధిపత్యాలను- ఎదిరించే ఈ తరుణంలో పరాయి అధికారం తమ ప్రాంతం అస్తిత్వాన్ని ఎక్కడ తుడిచి వేస్తుందోననే భయం కలగడం సహజం! అందుకని తెలంగాణ అస్తిత్వవాదంలో సామ్రాజ్యాధిపత్యాన్ని ఎదిరించే సాహిత్య వాసనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ అస్తిత్వ వేదనావాదం ప్రపంచీకరణాన్ని ఎదిరించే అస్తిత్వ వాదంలో భాగంగానే అనిపిస్తుంది.
అందుకే తెలంగాణ అస్తిత్వవాదంఓ సార్వజనీనత గోచరిస్తున్నది. ఒక సాహిత్యవాదంగా తెలుగు సాహిత్య చరిత్రలో నిలుస్తున్నది!
ప్రజలను వాళ్ల భుక్తి నుంచి తరతరాల వ్యవసాయ కృషి నుంచి, గ్రామాల నుంచి, మూలాల నుంచి దూరం చేయటంతో తెలంగాణ ప్రాంతీయులు నిజాం పాలనలో కన్నా వేరే విధమైన భూమిసమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ వేదన మనకు అస్తిత్వవాదం కవిత్వంలో బాగా గోచరిస్తుంది అని ప్రపంచీకరణ ప్రభావం, పాలకుల వివక్ష ఆధిపత్య భావజాలపు వలలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న తెలంగాణ ప్రాంతీయుల స్థితిని ఆవిష్కరించారు. ముద్దెరలోని మరి రెండు సుజాత గారి వ్యాసాలు - 'తొలితరం తెలంగాణ కథల పునర్నిర్మాణం', 'తెలంగాణ సాహిత్య విమర్శలో తోవలు' పాఠకులను ఆలోచింపజేసే విశ్లేషణాత్మక వ్యాసాలు. తెలుగు సాహిత్య ప్రారంభ కాలం నుంచి తెలంగాణలో కవులు, విమర్శకులు ఆయా ప్రక్రియలకు ఆద్యులై ఎట్లా తోవ చేశారో ఒక చారిత్రక క్రమంలో నిదర్శనపూర్వకంగా ఈ వ్యాసంలో చర్చించారు. వాటిని ఈ విధంగా స్పష్టీకరించవచ్చు.
సంస్కృత అలంకార శాస్త్రగ్రంథాలు, అలంకార సిద్ధాంతాలు తెలంగాణ నుంచే మొదట వచ్చాయి. ఓరుగల్లు నివాసి విద్యానాథుడు వ్రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం.
అదే విధంగా తెలుగులో మొట్టమొదటి ఛందోగ్రంథం తెలంగాణ నేల మీద ఆవిర్భవించింది. అది కరీంనగర్ జిల్లా వేములవాడ భీమకవి రాసిన 'కవిజనాశ్రయం'.
ప్రాచీన సాహిత్య విమర్శ ఛందోగ్రంథాలు, వ్యాఖ్యానాల రూపంలోనే వచ్చింది. ఆ విధంగా అప్పకవి, మల్లినాథుడ, సోమనాథుడు, శేషాద్రిరమణకవులు సాహిత్య విమర్శలో మార్గగాములై బహుమూల్యమైన సాహిత్య విమర్శ అవశేషాలను అందించారు.
అదే విధంగా ఆధునిక కాలంలో 1950 థకం నుంచి ఇక్కడి సాహిత్య విమర్శకులు తెలుగు సాహిత్య విమర్శలో ప్రధానమైన మూడు సాహిత్య ప్రస్థానాలకు మార్గం వేశారు. అవి:
1. సురవరం ప్రతాపరెడ్డి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'ను వ్రాసి సాహిత్యం అధారంగా చారిత్రక సామాజిక చరిత్ర సంస్కృతుల అధ్యయనానికి శ్రీకారం చుట్టాడు. దీనికి 1952లో తెలుగుకు మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
2. ఆచార్య బిరుదురాజు రామరాజు గారు జానపద సాహిత్యాన్ని సేకరించి విశ్లేషించి 'తెలుగు జానపద గేయ సాహిత్యం' అనే పరిశోధన గ్రంథాన్ని రచించి జానపద సాహిత్య పరిశోధనకు విశ్వవిద్యాలయంలో పీఠం వేసి అకడమిక్ స్థానం కల్పించారు. ఇప్పటికి జానపద సాహిత్య అధ్యయనానికి విమర్శకు ఈ గ్రంథమే మూలాధారంగా వుంది.
3. ఆచార్య సి. నారాయణరెడ్డి ఆధునికాంధ్ర కవిత్వం మీద వ్రాసిన పరిశోధన గ్రంథం - ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు - ప్రయోగాలు ఆధునిక సాహిత్య పరిశోధన క్షేత్రంలో వచ్చిన మొదటి సిద్ధాంత గ్రంథ:. ఆధునిక సాహిత్య విమర్శ చేయాలంటే ఎవరైనా తప్పక ఉపయోగించుకునే గ్రంథం.
ఈ విధంగా తెలంగాణ నేల మీదనే తెలుగు సాహిత్యంలోని ఈ మూడు విమర్శనామార్గాలకు తోవలు పడ్డాయి.
- డాక్టర్ కె. విద్యావతి












Click it and Unblock the Notifications