• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అక్షరాలతో వెన్నెల పూయించిన యుద్ద కవికౌముది

By Pratap
|

''కుండపోతగా కురుస్తున్న వెన్నెల్లో
నేను అభ్యంగనస్నానం చేస్తున్నాను
ఎన్ని తరాల మురికో
మనసంతా పేరుకుంది
నేనిప్పుడు తేటతెల్లని మనిషిని కావాలి...''వాక్యాలు చూస్తేనే తెలిసిపోతుంది ఒక బహుజన కవి కలం నుండి దూసుకు వచ్చిన విప్లవ వాక్యాలివని.

అవును మురికి ఎలా పోతుంది..?కొన్ని వందల ఏండ్లుగా ఆధిపత్య వర్గాలు ఈ దేశ బహుజనులపై రుద్దిన భావదాస్యపు మురికి కదా...అంత సులువుగా పోదు...అందుకే ఈ దేశ బహుజనులు ఈ మురికిని వదిలించుకోవడానికి రకరకాల పోరాటాలు చేపట్టవలసి వస్తున్నది. అందులో భాగమే విప్లవోద్యమాలు. విప్లవోద్యమాలు బహుజనులకు మేలు చేసాయా? కీడు చేసాయా?అనే అంశం మరెప్పుడైనా చర్చిద్దాం...కాని విప్లవోద్యమంలో అక్షరాలైంది...అసువులు బాసింది బహుజనులే. అలా అసువులు బాసిన వేగుచుక్కలు కొన్ని లక్షలు తెలంగాణ పల్లె ఇంటి ముందరి పెద్దర్వాజాలై మనకు కనిపిస్తుంటాయ్...కొన్ని స్థూపాలై కనిపిస్తే మరి కొన్ని కన్నుల్లో కనుబొమ్మలై కనిపిస్తాయ్...కొన్ని అక్షరాల్లో ఒదిగిపోయి మన మస్తిష్కాన్ని తట్టిలేపుతాయ్. అలా రాలిన ఒక వేగుచుక్క,యుద్ద కవి కౌముది. కౌముది గురించి మాట్లాడుకోవడమంటే కుండపోతగా కురుస్తున్న వెన్నెల్లో స్నానం చేస్తున్నట్టుగా వుంటుంది. అమ్మ చనుబాలధారామృతాన్ని సేవిస్తున్నట్టుంటుంది...యుద్దరంగంలో బందూకై పేలినట్టుంటుంది.

కౌముది అలియాస్‌ సదానందం గౌడ్‌. తెలంగాణ కవి. అంతకన్నా ముందు తెలంగాణ బిడ్డ. విప్లవోద్యమా పురిటి గడ్డ వరంగల్లుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న తరాలపల్లి అనే ఊరు కౌముది సొంతూరు. తెలంగాణ అన్ని పల్లెల్లాగే తరాలపల్లికి ఒక త్యాగపూరిత చరిత్ర ఉంది. ఒక విప్లవోద్యమ ఉద్విగ్నపూరితమైన చరిత్ర ఉంది. ఆ చరిత్రకు కవిత్వాక్షర రూపం కౌముది. సాధారణంగా విప్లవ కవుల కవిత్వం ఒక వర్గం కవిత్వంగానే చెలామణీలో ఉంచడం చూస్తుంటాం. కాని కౌముది కవిత్వం కేవలం విప్లవ కవిత్వంగానే చూడలేం. గన్ను పట్టిన చేతుతోనే పెన్ను పట్టి తూటా కన్నా శక్తివంతమైన కవిత్వాన్ని అరణ్యంలోంచి అమ్మ చనుబాల గుండా అందరి హృదయాల్లోకి ప్రవాహింపజేసి అక్షరాలతో వెన్నెలలు పూయించిన యుద్ద కవి కౌముది. కౌముది కవిత్వం ''చనుబాధార''గా వెలువడినది.

కౌముది కవిత్వం చదువుతుంటే విప్లవాన్ని చదువుతున్నట్టుండదు. విప్లవోద్యమ సగటు కవిత్వంలో ఉన్నట్టు నినాదాలు, స్లోగన్సు,జిందాబాదు కవిత్వం కాదు కౌముదిది. సాయుధమై ఉన్నా అక్షరాయుధాన్నే అంగంగా ధరించినోడు కౌముది. కౌముది కవిత్వంలో టెక్నిక్కు చూసిన తర్వాత విప్లవ కవిత్వం ఇలా కూడా రాయొచ్చా అనే ఆశ్చర్యం కలుగుతుంది. ట్రిగ్గరు పై వేలుపెట్టి అతడు విసురుతున్న కవిత్వ తూటాలు హృదయానికి తాకి విలవిల్లాడిపోతాం. మెదడు పోటెత్తి ఆలోచనల్లో మునిగిపోతాం.

Chintam Praveen writes on Koumudi's Chnaubala dhara poetry

''మీ గాయాల నుండి స్రవిస్తున్న
మానవీయ అక్షరాలనివ్వండి
రాజ్యం గరుకు పెదవులపై సుతారంగా సున్నితంగా పద్యం రాస్తాను''అంటూ రాజ్యస్వభావాన్ని చెబుతూనే...
''చావుదేముంది
బతకడం శాశ్వతమైతే కదా
క్షణకాలం బతికినా సరే
పరిమళభరితంగా బతకడం
చుట్టూ ప్రపంచాన్ని పరిమళభరితం చేయడం'' అంటాడొక చోట.

'శిల్పాన్ని సాన చేసిన కొద్దిమంది కవుల్లో కౌముది ముందుంటాడు. శివసాగరు ఒరవడి వ్లల కావచ్చు.శిల్పసాధన చేసిన విప్లవ కవులంతా కాల్పనిక ఆశావాదుయ్యారు. కౌముది కవిత్వం అయితే విప్లవం ఇంత రోమాంటిక్ ఉంటుందా అని పులకరింత కలిగిస్తుంది.మమకార,వాత్స్యల దశనుండి యవ్వన సుందర స్వప్నాలోకి మనల్ని ఆశావహంగా తీసుకొనిపోయిఎక్కడా నిరాశ,నిస్పృహా,దు:ఖం,విషాదం లేని దు:ఖం,విషాదం ఉన్నావాటిని ఒక మెలాంకలీగా,స్మృతిగామళ్లీ భవిష్యత్తులోకి సుందరస్వప్నంగా మలుచుకునే దినుసుగానే కనిపిస్తాయి' అంటారు వరవరరావు కౌముది కవిత్వానుద్దేశించి.

కౌముది అక్షరాలు కేవలం అక్షరాలు కావు. విప్లవోద్యమంలోకి దూకిన సగటు తెలంగాణ యువకుడు ఈ వ్యవస్థపై ఎక్కు పెట్టిన కవిత్వ శరమది. వరంగల్ తరాలపల్లి నుండి మెతుకుసీమ గుండా ఆంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని,రాజ్యపు రహస్యపు మరో ముఖాన్ని ఆవిష్కరించిన కవిత్వమతనిది.

జాతీయ మానవహక్కు కమీషను తెలంగాణను సందర్సించడానికి వచ్చిన సందర్బంగా తెలంగాణ బిడ్డగా తెలంగాణ పల్లె గురించి రాసిన కవిత చూడండి. ఈ ఒక్క కవితలోని కొన్ని పంక్తులు తెలంగాణపల్లె కోల్పోయినతనాన్ని అక్షరీకరిస్తూ కంటతడి పెట్టిస్తాయి...

''నా పల్లెకు రండి
నా పల్లెను చూడండి
మీరూ మీ కార్లూ రావడానికి నా పల్లెకు రోడ్లు కూడా ఉన్నాయి
మీరు వస్తే స్వాగతతోరణాలు ఉండకపోవచ్చు కాని
పోగొట్టుకున్న బిడ్డల జ్ఞాపకం కోసం కట్టుకున్న స్దూపాలు
దారుకిరువైపులా కూల్చబడి మీకు స్వాగతం చెబుతాయి..
నా పల్లె కోడి కూతతో మేల్కోవడం ఎప్పుడో మరిచిపోయింది
ఎక్కడో పేలిన తుపాకి శబ్దానికి దిగ్గున లేచి కూచుంటుంది''అంటూ దశాబ్ధాల తెలంగాణ పల్లె కన్నీటి గోసను తెలంగాణాలో మాయమవుతున్న పల్లె యువత గురించి అత్యంత సహజంగా చెబుతాడు.
అలాగే రైతు అత్మహత్యను చూసి చలించి నల్లమట్టిని కవిత్వం చేస్తాడు. ఆ నల్లమట్టికి నాగలికి..,నాగలికి మనిషికి ఉన్న సంబందాన్ని చరిత్రక వాస్తవిక ధోరణిలో చెబుతాడు. 'నా చరిత్ర మొదటి అక్షరం' అనే కవితలో...

''నాగలి నా శ్వాస
నాగలి నా చరిత్ర మొదటి అక్షరం
శ్వాసలో నాగలి వాసన కోల్పోయినవాడు
ఇక,మనిషిగా మరణించినట్టే లెఖ్ఖ
నాగలి ఆత్మహత్య చేసుకుందంటే
మనిషి చరిత్ర యావత్తూ
ఆత్మహత్య చేసుకున్నట్టే లెఖ్ఖ..అంటూ రైతు ఆత్మహత్యను మాస్ హిస్టీరియాగా ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసిస్తాడు. ప్రపంచీకరణ పెట్టుబడిదారితనం రైతు ప్రాణాన్ని ఎక్సుగ్రేషియాతో వెలకట్టడాన్ని ఖండిస్తాడు. మానవ చరిత్ర యావత్తూ రైతుతో ముడిపడి ఉందని రైతు మరణిస్తున్నాడంటే మనిషి చరిత్ర మరణించినట్టేనని కుండబద్దలు కొడతాడు.

ఇక కౌముది అవ్వ గురించి రాసిన వాక్యాలు చూస్తే మనస్సు కలుక్కుమంటుంది. అత్యంత సున్నితంగా అతడు అవ్వ గురించి పేర్చిన అక్షరాలు గుండెను పిండుతాయి. కౌముది అవ్వ అక్షరపు చనుబాధారలో నిలువెల్లా తడిసి పచ్చిపచ్చిగా పసిపసిగా పిల్లాడిలా మారిపోతాం.

''ముఖాన్ని అరచేతులో దాపుకుంటే
ఎన్ని సముద్రాలు నా వేళ్ల సందుల్లోంచి కారిపోయ్యాయో
అవ్వా... నా దోసిల్నిండా నువ్వే'' అంటూ కంటనీరు పెట్టిస్తున్న కన్నీటి అక్షర సంద్రాన్ని చూసి శాపగ్రస్త తెలంగాణతల్లులు...తల్లులకు,ఇంటికి దూరంగా అడవిబాట పట్టిన తెలంగాణ బిడ్డలు గుర్తొచ్చి ఆవిరావిరైపోతాం. అల్లకల్లోలమైపోతాం...గుక్కపట్టి ఏడవకుండా ఉండలేం...మనస్సంతా అలలై పోటెత్తకుండా ఉండలేం.

మనం ఇలా దు:ఖ సంద్రంలో మిగిలుండగానే మళ్ళీ అంతే వేగంగా యుద్దరంగానికి తన అక్షరాలను పరుగులు పెట్టించి అమ్మకు,మనకు తన అస్తిత్వాన్ని అమరమని చెబుతాడు. దు:ఖ సంద్రంలో మునిగిన మనల్ని అంతే సుతారంగా తట్టిలేపి అలెర్టు చేస్తాడు.

''ఈ యుద్దరంగంలో నుండి నేను రాకపోతే
ఎన్నటికీ రాలేకపోతే
ఒకవేళ నేను చనిపోతే
నా కోసం నువ్వెప్పుడూ ఏడ్వకమ్మా
కదిలే మేఘాల వైపు చూడు
నా రూపు కన్పిస్తుంది
నా పుట్టినరోజు వాకిట్లో నెత్తుటి ముగ్గు వేసి
కదనరంగానికి రంగం సిద్దం చెయ్యమ్మా
కత్తీడాలునై నీ చేతుల్లోకి వస్తాన''ంటాడు...ఈ విధంగా ఆయుధం మీద మమకారం అక్షరాల మీద మమకారం...యుద్దం,కవిత్వం కలిసిపారిన జీవితం కౌముది. ఆయన కవిత్వానికి తల్లితరాల పల్లి ఆత్మబంధువు. ధిక్కారం, పోరాటం, అసమానతపై అక్షర బందూకై పేలడం అతని కవిత్వంలో ఒక పార్శ్వంగా కనిపిస్తే.., ఆర్తి, అనురాగం, అమ్మ ఒడి,ప్రణయం, మరొక పార్శ్వంగా కనిపించి విప్లవ కవుల మార్కు కవిత్వానికి విభిన్నంగా ఉంటూ మనలో ఒక కాన్షియస్‌నెస్‌ని క్రియేట్‌ చేస్తుందతని కవిత్వం.

అతని కవిత్వమే కాదు అతని వ్యక్తిత్వం కూడా వెన్నెలే అంటారు అతని మిత్రులు . "అక్షరమే కాదు అతని చూపు వెంటాడుతుంది. తడితడిగా నిన్ను చుట్టేసి రాగంలో ముంచెత్తే చూపు. ఒళ్లంతా తడిమితడిమి ఉద్వేగభరితం చేసే చూపు. ఎక్కడెక్కడి కన్నీళ్లనో ఒక్కటి చేసే శక్తివంతమైన చూపు. ఎవరెవరి కోపానో ఒక చోట చేర్చే పదునైన చూపు. మట్టిలో కలిపినా మొలకెత్తే మొలకనవ్వుల చూపు"అంటారు కోమల్.

మనుషుల్నిమనసుల్ని ధ్వంసం చేస్తున్న ఈ విధ్వంసక విలువల ముఖమ్మీద నేనిప్పుడు కాండ్రిరచి ఉమ్మేస్తున్నానని ప్రకటించిన కౌముది మన మధ్యలో లేనప్పటికీ తుపాకీ బ్యారల్లో కన్నుపెట్టి ఆ కంటితో గురి పెట్టి అతడు సంధించిన కవిత్వం మాత్రం చనుబాలధారై మనలో ప్రవహిస్తూనే ఉంటుంది.

డా.చింతం ప్రవీణ్‌ కుమార్‌
9346 886 143

English summary
Telugu literary critic Dr Chintam Praveen appreciates Koumudi's Chanubala Dhara poetry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X