Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రివైండ్-2016: దూరమైనవాళ్ల కోసం ఓ మనన వాక్యం..

తెలుగు సాహితీ లోకానికి 2016 కొన్ని చేదు జ్ఞాపకాల్నే మిగిల్చింది. తమ రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో బలమైన ముద్ర వేసిన కొంతమంది కవులు, రచయితలు భౌతికంగా దూరమయ్యారు.

విశ్రాంతి భౌతికమే.. వాక్యం సజీవం. రూపం కళ్లముందు లేకపోయినా.. వాళ్లిచ్చిన కొన్ని అక్షరాలున్నాయి. ఆవేదన నుంచో.. ఆత్మశోధన నుంచో పుట్టుకొచ్చిన అక్షరాలు.. కొన్ని బరువెక్కి, మరికొన్ని ధిక్కరాలై.. సజీవంగా ఈ తెలుగు నేల మీద ప్రవహిస్తూనే ఉంటాయి.

తెలుగు సాహిత్యంలో తమదైన ముద్రవేసి తమ రచనలతో ఎంతోమందిలో స్పూర్తిని రగిలించిన పలువురు ప్రముఖ కవులు, రచయితలు ఈ సంవత్సరం సాహితీ లోకానికి 'గుడ్ బై' చెప్పెళ్లారు. వాళ్లలో కొందరి గురించి..

అరుణ్ సాగర్:

అరుణ్ సాగర్:

'అరుణ్ సాగర్'.. అక్షరంతో దు:ఖశీలి. భావుకతలో కోటానుకోట్ల విస్పోటనాలకు మూలకేంద్రంగా పరివ్యాప్తి చెందినవాడు. కన్నీరు నిషిద్దమని పైకి ప్రకటించినా.. లోపలంతా క్యూసెక్కుల ప్రవాహాలు.. కల్లోలిత కర్ఫ్యూలు విధించుకున్న అంతరంగాలు..

మొత్తంగా అరుణ్ సాగర్ ఓ అత్యాధునికుడు. పతనమైన మార్కెట్ విలువల జాడ్యంలో.. అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కొనసాగుతూనే కించిత్తు సున్నితత్వాన్ని ఎక్కడా కోల్పోనివాడు. అన్నింటికి మించి అతనో మేథోనిగర్వి.

రచనల గురించి:

చాలామంది మగవాళ్లకు ఆయన కవిత్వమొక రిలీఫ్ స్పేస్. మగవాడు ఏడవద్దన్న కర్కషపు నిబంధనను తెంచేసుకుని.. ఆయన వాక్యాల్లో తనివితీరా ఆ లోటును భర్తీ చేసుకోవచ్చు. కళ్లతో కాకుండా హృదయంతో కన్నీళ్లను స్రవింపజేసే కవిత్వమది.. 'మేల్ కొలుపు'ను గుండె మీద పెట్టుకుని దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచే మగవాళ్లందరు.. అరుణ్ సాగర్ కి ఎప్పటికీ రుణపడి ఉంటారు.

వేదన మాత్రమే కాదు.. వచన నిర్మాణంలోను అరుణ్ సాగర్ శైలి ప్రత్యేకమైనది. సరళమైన వాక్యం.. కాస్తంత వ్యంగ్యం.. కాసిన్ని విరుపులు. రచనలన్ని ఆసాంతం ఏకబిగిన చదివించేవే. వాక్యం వేలు పట్టుకుంటే చాలు.. అలా నడిచెళ్లిపోవచ్చు.

నేపథ్యం:

చూడటానికి అత్యాధునికుడిగా కనిపించే అరుణ్ సాగర్.. భద్రాచలం లాంటి ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చాడంటే.. వినడానికి కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. వామపక్ష భావజాలంతో తండ్రి టివిఆర్ చంద్రం అడుగు జాడల్లో.. లంబాడా, గిరిజన తదితర అమాయక గిరిజన జీవితాలను దగ్గరగా పరిశీలిస్తూ పెరిగిన వ్యక్తి.

జనవరి2,1967న జన్మించిన ఆయన ఫిబ్రవరి12,2016న శ్వాసకోశ సమస్యతో కన్నుమూశారు. ఆయన చివరి రోజుల్లో టీవీ5 సీఈవోగా కొనసాగారు. తను పుట్టి పెరిగిన మూలాలు అభివృద్ది పేరిట ఛిద్రమైపోతుంటే ఓ విస్థాపితుడిగా తన వేదననంతా చివరి రోజుల్లో మ్యూజిక్ డైస్ అంటూ మరణ వాంగ్మూలం రాసెళ్లారు.

రచనలు: మేలు కొలుపు, మ్యూజిక్ డైస్, మ్యాగ్జిమమ్ రిస్క్, మియర్ మేల్

బోయ జంగయ్య:

బోయ జంగయ్య:

తెలంగాణ దళిత జీవన వైచిత్రిని తన రచనల ద్వారా ఆవిష్కరింపజేసిన రచయిత బోయ జంగయ్య. దళితుల సాధక బాధకాలన్ని ఎక్కువగా కవిత్వ రూపమే తీసుకుంటున్న తరుణంలో.. తన కథల ద్వారా, నవలల ద్వారా దళితుల అసలు సిసలు బతుకును అక్షరాల్లోకి తర్జుమా చేశారు.

దాదాపు యాభై ఏళ్ల పాటు సాహిత్యంలో విశేషమైన కృషి చేశారు. దళితవాదంతో పాటు మానవ వాదాన్ని ప్రతిబింబించే రచనలతో అభ్యుదయ వాదంలో నడిచారు. 1969 తెలంగాణ ఉద్యమంలో జంగయ్య జైలుకు కూడా వెళ్లొచ్చారు.

రచనల గురించి:

శైలి పరంగా బోయ జంగయ్య ప్రజా శిల్పాన్నే అనుసరించారు. షోకిల్లా మెరుగలేవి లేని అచ్చ తెలంగాణ పలుకుబడితో గ్రామీణ దళిత జీవిత వ్యథలను ఆయన తన కథా వస్తువుగా స్వీకరించారు. రచన ప్రక్రియకు సంబంధించి దాదాపు అన్ని ప్రక్రియల్లోను బోయ జంగయ్యకు స్పష్టమైన అవగాహన, పట్టు ఉంది.

దళిత రచనలు మాత్రమే గాక పిల్లల కోసం ఆయన రాసిన చాలా పుస్తకాలు ఆయన సున్నిత మనస్తత్వానికి అద్దం పడుతాయి. అరసం, విరసం ప్రభావం ఎక్కువగా ఉన్న కాలంలోను ఆయన స్వంత మార్గ నిర్దేశాన్నే నమ్ముకున్నారు.

నేపథ్యం:

బోయ జంగయ్యను ఆయన సన్నిహితులు, ఆయన్ను అభిమానించేవారంతా ముద్దుగా 'బోజ' అని పిలుచుకుంటుంటారు. అక్టోబర్01, 1942న నల్లగొండ జిల్లా పంతంగి గ్రామంలో ఎల్లమ్మ, మల్లయ్య దంపతులకు బోజ జన్మించారు.

పుట్టింది పంతంగి అయినా.. ఆయన మన్యం చెల్క ప్రాంతంలో నివసించారు. ప్రభుత్వోద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. మే07,2016న ఆయన కన్నుమూశారు.

రచనలు: లోకం, గొర్రెలు (1981), ఎచ్చరిక (1984), దున్న(1989), రంగులు (1984), చీమలు (1996)[1], తెలంగాణ వెతలు (1998), బోజ కథలు ( 2000), బమ్మలు (2002), ఉప్పనీరు (2002), ఇప్పపూలు (2003), ఆమె ( 2004), కష్టసుఖాలు (నాటిక); నవలలు: జాతర,జగడం, పుట్టుమచ్చ

చిలుకూరి దేవపుత్ర:

చిలుకూరి దేవపుత్ర:

దళిత మూలాల నుంచి.. రాయలసీమ కరువు నేపథ్యం నుంచి.. భిన్న పార్శ్వాలతో కలం పట్టిన రచయిత చిలుకూరి దేవపుత్ర. ఆధిపత్య సంస్కృతిని ధిక్కరిస్తూ దళిత బావుటాను ఎగరేస్తూ ఆయన తన రచనా ప్రక్రియను కొనసాగించారు.

దళిత జీవన వాస్తవికతను సృజనాత్మకంగా ఒడిసిపట్టుకోవడం చిలుకూరి దేవపుత్ర ప్రత్యేక రచనా శైలికి నిదర్శనం. అద్దంలో చందమామ, పంచమంలాంటి దళిత ఇతివృత్తంతో ఆయన రాసిన నవలలు దళిత సాహిత్యానికి కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి.

రచనల గురించి:

రాయలసీమ దళిత దృక్కోణాన్ని తనదైన రచనా శైలి ద్వారా వ్యక్తీకరించారు. జీవితపు వ్యథలను అక్షరాల్లోకి ఒంపేటప్పుడు ఎదురయ్యే సంక్లిష్టతలను వైవిధ్యంగా తన రచనా ప్రక్రియల్లో ప్రతిబింబించారు. రాయలసీమ ప్రజల నాడిని, అక్కడి నేపథ్యాన్నితన కథావస్తువులుగా మలుచుకున్నారు.

దేవపుత్ర రచనలు అనుభవం-పరిశీలన, దృక్పథం-పరిణితి అనే రెండు దశలుగా సాగినట్టుగా విమర్శకులు చెబుతారు.

*ఓ దళితుడు రాజకీయాల్లోకి అడుగుపెడితే అగ్రకులపోళ్లకు ఎంత కంటగింపుగా ఉంటుందో ఊడల మర్రి కథలో ఆయన అద్భుతంగా చిత్రీకరించారు.

'అయ్య ముందే గ్రామ ప్రెసిడెంటు కుర్చీలో కూర్చుంటే ఆయన ప్రాణం ఓర్చుకుంటదా?' అంటూ ప్రెసిడెంట్ గా గెలిచిన ఓ దళిత వ్యక్తిని ఉద్దేశిస్తూ సహచర దళితుడు పలికే ఈ మాట.. సమాజంలో వేళ్లూనుకున్న కులవ్యవస్థను పట్టిస్తుంది.

నేపథ్యం:

అనంతపురం జిల్లా బెళగుప్ప మండలంలోని కాలువపల్లిలో 1952వ సంవత్సరం ఏప్రిల్ 24న చిలుకూరి దేవపపుత్ర జన్మించారు. తల్లిదండ్రులు సరోజమ్మ-ఆశీర్వాదంకు దేవపుత్ర తొలి సంతానం.

కర్నూల్ జిల్లాలోని నంద్యాల, నందికొట్కూర్, ఆలూరు, ద్రోణాచలం ప్రాంతాల్లో దేవపుత్ర బాల్యం గడిచింది. తండ్రి సర్వేయర్ కావడంతో ఆయన విద్యాభ్యాసం స్థిరంగా ఒకచోట సాగలేదు.

రచనలు:
కథా సంకలనాలు: ఓ ఆరు గ్లాసులు, వంకర టింకర, ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ
నవలలు: అద్దంలో చందమామ, పంచమం, చీకటిపూలు, కక్షశిల,

చిలకూరి దేవపుత్ర రచనలు చాలావరకు హిందీ, కన్నడ, ఒడియా భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి.

ఆవంత్స సోమసుందర్:

ఆవంత్స సోమసుందర్:

అభ్యుదయ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన రచయిత ఆవంత్స సోమసుందర్. వజ్రాయుధం వంటి మహాకావ్యం ఆయన సుదీర్ఘ రచనా ప్రయాణంలో ఓ మైలురాయి. విమర్శకునిగా, సాహితీ పరిశోధకునిగా ఆయన తెలుగు సాహిత్యానికి తనదైన క్రుషి చేశారు.

బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944లో అరసంలో చేరిన ఆవంత్స సోమసుందర్.. 1945 రాయల్ ఇండియన్ నేవి ధర్నా సందర్బంగా 'ఇంక్విలాబ్ జిందాబాద్' పేరిట తొలి కవిత రాశారు.

రండి రండి ఉక్కుముక్కు కాకుల్లారా
రండర్రా గద్దల్లారా రండి రండి
సమరంలో క్షతగాత్రుడనై పడిపోయిన
నా శరీరాన్ని తినివేయండి ...........

రచనల గురించి

తిరుగుబాటు ధోరణి.. ధిక్కారం.. ప్రగతిశీల భావాలతో ఆయన రచన ప్రక్రియ కొనసాగింది. సమాజ పరివర్తనను నిశితంగా పరిశీలిస్తూ.. తనను కదిలించే ప్రతీ సంఘటన మీద ఆయన స్పందించారు. ఈ క్రమంలోనే బాబ్రి మసీదు కూలగొట్టిన తరువాత బొంబాయిలో చెలరేగిన మతకలహాలపై స్పందిస్తూ.. రక్షరేఖ అనే దీర్ఘ కవితా సంపుటి వెలువరించారు.

దేశి సారస్వతము-సమాజ వాస్తవికత. దేశి సాహిత్యంలో ఉండే సామాజిక స్పృహపై ఆయన రాసిన విశ్లేషణాత్మక గ్రంథం. నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా వజ్రాయుధం కవితాసంకలనం, ఆంధ్రరాష్ట్ర ఉద్యమ సమయంలో కాహళి కవితా సంపుటిలు వెలువరించారు.

నేపథ్యం:

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని శంఖవరం గ్రామంలో నవంబర్18,1924న ఎనిమిదో సంతానంగా ఆవంత్స సోమసుందర్ జన్మించారు. చిన్నతనంలో సోమసుందర్ చిన్నమ్మ
ఆయన్ను దత్తత తీసుకుంది. వారికి సాహిత్యంపై ఉన్న అభిలాషే ఆ తర్వాతి రోజుల్లో సోమసుందర్ సాహితీ ప్రయాణానికి బీజం వేసింది.

కవిగా, కథకుడిగా, విమర్శకుడిగా దాదాపు 74ఏళ్ల పాటు విశేషమైన సాహితీ కృషి చేసిన సోమసుందర్.. ఆగస్టు12,2016న తుది శ్వాస విడిచారు.

గూడ అంజయ్య:

గూడ అంజయ్య:

'గజ్జలు గజ్జాలు రెండు.. గజ్జలో రాజన్నా..',
'పుడితే ఒకటి.. సత్తే రెండు రాజిగ ఓరి రాజిగా.. ఎత్తరా తెలంగాణ జెండా రాజిగా ఓరి రాజిగా'
శబ్దం లయబద్దంగా సాగే పాటలతో గూడ అంజయ్య తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఎత్తుకున్న తీరు చిరస్మరణీయం.

'దొర ఏందిరో.. వాని పీకుడేందిరో..' అని ఆధిపత్య వర్గాలపై ఆయన ఎగరేసిన ధిక్కార గేయం.. పల్లె పల్లెన చైతన్యపు ఆవేశాన్ని రగలించింది. వాగ్గేయకారుడిగా.. ప్రజా ఉద్యమకారుడిగా.. విప్లవోద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమం దాకా ఎన్నెన్నో ఆటంకాలను అధిగమిస్తూ గూడ అంజయ్య తన పాటలతో ప్రకాశించాడు.

జనం నోళ్లలో ఇప్పటికే నానే పాటలు:

భద్రం కొడుకో.. కొడుకో కొమరన్న జర..
అసలేటి వానల్లో ముసలెడ్ల కట్టుకుని
ఊరిడిచి నే పోదునా.. అయ్యో ఉరిపోసుకుని సద్దునా
ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా( ఈ పాట దేశంలోని 16ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా అయింది)

అరుణోదయ సాంస్కృతిక సంస్థను స్థాపించి.. ప్రతీ పల్లెనా తన పాటలతో చైతన్య స్పూర్తిని రగిలించారు. ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన పదాలను, వారి మాటలనే బాణీలతో కైగట్టడంలో ఆయన ప్రదర్శించిన నేర్పు చాలా గొప్పది.

నేపథ్యం:

1955లో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురం గ్రామంలో అంజయ్య జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం లింగాపురంలో.. ఆ తర్వాత లక్షెట్టిపేటలో కొంతకాలం కొనసాగింది. దాదాపు నలభై ఏళ్లు కవిగా, రచయితగా, వాగ్గేయకారుడిగా.. సాహితీ జగత్తులో తనదైన ముద్ర వేశారు.

గూడ అంజయ్య పాటల ద్వారానే ఎక్కువగా సుపరిచితమైనప్పటికీ.. పొలిమేర(నవల), దళిత కథలు(కథాసంపుటి) వంటి రచనలు కూడా ఆయన సాహితీ సృజనకు అద్దంపడుతాయి. చివరి రోజుల్లో కామెర్లు, మూత్రపిండాలు వ్యాధితో బాధపడ్డ గూడ అంజయ్య జూన్21, 2016న రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలోని స్వగృహంలో కన్నుమూశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+