• search

మహాశ్వేత భాణుడి కాదంబరి పాత్ర: చినవీరభద్రుడు

By Pratap
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  'నేను రాసేదంతా అణగారిన మనుషులగురించే...వాళ్ళనుంచే నేను నా శక్తి కూడదీసుకుంటున్నాను.మన చుట్టూ నడుస్తున్న ఆదివాసి ఉద్యమాల్ నుంచే నా శక్తి కూడగట్టుకుంటున్నాను.సింగూరు,నందిగ్రాం లు నా జీవితంలో కొత్త అధ్యాయం తెరిచాయి. నేనూ, మేధాపాట్కరూ ఏ రాజకీయ పక్షమో స్వాగతిస్తే సింగూరు వెళ్ళలేదు.సింగూరు ప్రజలు మమ్మల్ని తమ మధ్యకు ఆహ్వానించేరు.ప్రజాశక్తిలో నా విశ్వాసాన్ని బలోపేతం చేసినందుకు వారికెంతో ఋణపడి ఉంటాను. బిర్సాముండా నుంచి నందిగ్రాం, సింగూరు ప్రజల దాకా,ఎవరైనా కావచ్చు, నేనెప్పుడూ ప్రజలతోటే కలిసి నడుస్తాను.'

  అయిదేళ్ళ కిందట ఒక ఇంటర్వ్యూలో మహాశ్వేతా దేవి చెప్పిన మాటలివి.

  అందుకనే, మహాశ్వేత నిష్క్రమించిందంటే, ఒక సాహిత్యవేత్త మాత్రమే మనమధ్యనుంచి వెళ్ళిపోయినట్టుకాదు, ఒక ప్రజా ఉద్యమకారిణి, అరుదైన ఒక సాహసి కూడా ఇక నుంచీ మనకు కనిపించదు.

  మామూలుగా గొప్ప సాహిత్య సృజన చేసినవాళ్ళు, ప్రజాజీవితంతో మమేకం కావటం అరుదు. ప్రజల్తో కలిసి తిరిగినా వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి సంఘాన్నీ, రాజ్యాన్నీ నిలదీసేవాళ్ళు మరీ అరుదు. సామాజికంగా ఎంతో క్రియాశీలకంగా ఉండే ఉద్యమకారులు స్వయంగా రచయితలైన వాళ్ళు లేకపోరు గానీ, సాహిత్యశిల్ప దృష్ట్యావారిని గొప్ప రచయితలుగా గుర్తించలేం. కాని మహాశ్వేతాదేవి లో ఈ రెండు పార్శ్వాలూ ఎంతో శ్రేష్టంగా వికసించేయి. అందుకనే, ఆమె లేదంటే, ఈ దేశం నిజంగా పేదదైందనిపిస్తుంది. 'ఆ లోటు పూడ్చలేనిది 'అని ఇట్లాంటి సందర్భాల్లో వాడే పడికట్టుపదం నిజంగానే ఈ సందర్భంలో ఎంతో నిజమనిపిస్తున్నది.

  మహాశ్వేత బాణభట్టుడి కాదంబరిలో పాత్ర. మహాశ్వేతాదేవిని తలుచుకున్నప్పుడు ఏ అతీత కావ్యయుగం నుంచో ఏ ఆకాశలోకాలనుంచో భూమ్మీదకు దిగి మట్టిమనుషుల మధ్యకు చేరుకున్న పాత్రలాగా తోస్తుంది. ఆమె పుట్టిందే విద్వాంసుల, కళాకారుల కుటుంబంలో. తండ్రి మనీష్ ఘటక్ 'యువనాశ్వ 'పేరిట కల్లోల ఉద్యమంలో భాగంగా కవిత్వం చెప్పాడు. చిన్నాన్న, భారతీయ సినిమా గర్వించదగ్గ తొలితరం దర్శకుల్లో ఒకరైన ఋత్విక్ ఘటక్. తల్లి ధరిత్రీ దేవి నిజమైన విదుషి. ఆమె మహాశ్వేతాదేవికి చిన్నతనంలోనే చెకోవ్ నీ, టాల్ స్టాయి నీ, డికెన్స్ నీ పరిచయం చేసింది. మహాశ్వేత మొదటి భర్త, బిజొన్ భట్టాచార్య ప్రసిద్ధ నాటకకర్త, ప్రజా రంగస్థల ఉద్యంకారుడు, కొడుకు నవారుణ్ భట్టాచార్య కూడా ప్రసిద్దిచెందిన నవలా రచయితే. ఆమె కొన్నాళ్ళు రవీంద్రుడి సన్నిధిలో శాంతినికేతనంలో చదువుకుండి. 36-38 మధ్యకాలంలో తనని టాగోర్ తీవ్రంగా ప్రభావితం చేసాడని కూడా చెప్పుకుంది.
  కాని ఆమె జీవితం ఆ కళాత్మకతకీ, ఆ కాల్పనికతకే పరిమితం కాలేదు. ఆమె జీవితంలో మూడు దశలున్నాయి. మొదటి దశ 1926లో ఆమె పుట్టినప్పటినుంచీ, 1975 దాకా దాదాపు యాభై ఏళ్ళు నడిచింది. ఆ దశలో ఆమె చదువుకుంది, రచనలు మొదలుపెట్టింది, ఝాన్సీ రాణి మీద తానే స్వయంగా వివరాలు సేకరించి ఒక నవల రాసింది, పెళ్ళి చేసుకుంది, విడిపోయింది కూడా.

  Vadrevu China Veerabhadrudu on Mahaswetha Devi

  నగ్జల్బరీ ఉద్యమం నేపథ్యంగా ఆమె 1975 లో రాసిన 'హజార్ చౌరాసీర్ మా '( 1084 తల్లి) ఆమె ను ఒక జాతీయ స్థాయి రచయితగా మార్చేసింది. ఆ నవలకే ఆమెకు 1996 లో జ్ఞానపీ పురస్కారం లభించింది.ఆ ఇరవయ్యేళ్ళ మధ్యకాలంలొ ఆమె అసంఖ్యాకంగా కథలు, నవలలు రాసింది. వాటిల్లో బిర్సాముండా ఇతివృత్తంగా రాసిన 'అరణ్యేర్ అధికార్'( 1977, తెలుగులో 'ఎవరిదీ అడవి '), అగ్నిగర్భ (1978), 'బసాయి తుడు ', 'ఛోటీ ముండా ఏవం తార్ తీర్ '(1980) లాంటి సుప్రసిద్ధ రచనలున్నాయి. ఆమె ముఖ్యమైన నవలలు, కథలు ఇంగ్లీషులోకి, చాలా భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. స్వాతంత్ర్యానంతర బెంగాల్ నుంచి అంత విస్తారంగా అనువాదమైన రచయిత మరొకరు లేరు. అంతగా పాఠకాదరణ పొందిన రచయిత కూడా మరొకరు లేరు. ఆమె రాసింది ప్రతీదీ ఏడాది తిరక్కుండానే రెండవముద్రణకు వచ్చేదని ఒక ప్రచురణ కర్త అన్నాడు.

  ఈ ఇరవయ్యేళ్ళ సాహిత్య సృజనలో ఆమె లేవనెత్తిన ప్రశ్నలు దాదాపుగా 60 ల నుంచీ ఆమెని బాధిస్తున్నవే. 67 లో నక్సల్బరీ గ్రామంలో రక్తం చిందకముందే ఆమె సంతాల్ వారి దయనీయ స్థితిని కళారా చూసి, వారి పరిస్థితి గురించి తక్కిన ప్రపంచాన్ని హెచ్చరిస్తూనే ఉంది.

  అట్లానే ఆమె జీవితంలో మూడవ దశ 1982 లో మొదలై, చివరిదాకా కొనసాగింది. ఈ దశలో ఆమె ఒక రచయిత్రిగానే కాక ఒక సామాజిక ఉద్యమకారిణిగా కూడా ప్రత్యక్షంగా పాల్దొంది. అత్యంత క్రియాశీలకంగా పనిచేసింది.

  ఆమె రచనల్లో ఆదివాసుల అధికారాల గురించీ,భూస్వాములూ, వడ్డీ వ్యాపారస్థులూ, ప్రభుత్వాధికారులూ ఒక్కటై వారినెట్లా అణగదొక్కుతున్నారో ఆ వైనమంతా అత్యంత సాహసంతో, కత్తివాదరలాంటి వ్యంగ్యంతో చిత్రించింది. కాని, ఆమె క్రియాశీల జీవితం ప్రధానంగా విముక్తజాతుల ( denotified tribes) చుట్టూ అల్లుకుంది.
  విముక్త జాతులంటే, బ్రిటిష్ ప్రభుత్వం 1871 లో చేసిన క్రిమినల్ ట్రిబ్స్ చట్టం కింద నోటిపై అయి, తిరిగి 1952 లో స్వతంత్ర భారతదేశంలో డీ నోటిపై అయిన తెగలు. బెంగాల్లో అటువంటి జాతులు మూడున్నాయి. మేదినీపూర్ జిల్లాలో లోధాలు, పురులియా లో ఖేడియా సొబర్లు, భీర్ భూమ్ లో ధికారో లు. కాని సుమారు ఒక శతాబ్ద కాలం పాటు నేరస్థ జాతిగా ముద్రపడ్డందువల్ల, వారిని స్థానిక సమాజాలూ, స్థానిక ప్రభుత్వాధికారులూ ఎట్లా హింసిస్తున్నారో, వేధిస్తున్నరో మహాశ్వేతాదేవి స్వయంగా చూసింది, వారి గురించి ఆందోళన చెందింది. వారికి న్యాయం జరగడంకోసం చెయ్యవలసిందింతా చేస్తూనే వచ్చింది.

  ముఖ్యంగా 1998 లో పురులియా కి చెందిన బూదన్ శొబర్ అనే గిరిజనుణ్ణి పోలీసులో రెండువారాల పాటు లాకప్ లో హింసించి కిరాతకంగా చంపారు. అది తన జీవితంలో అత్యంత హీనమైన అత్యాచారంగా మహాశ్వేత దేవి చెప్పుకుంది. ఆమె అతడి కోసం హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి, అతడి భార్యకి నష్టపరిహారంతో పాటు, అందుకు కారణమైన అధికారులకి శిక్ష పడేలా చేసింది. ఆ అనుభవం ఇచ్చిన ఉత్తేజంతో ఆమె గుజరాత్ లో జి.ఎన్.దెవితో, మహారాష్ట్రలో లక్ష్మణ గయక్వాడ్ (అతడు కూడా ఒక నేరస్థ జాతికి చెందిన కుటుంబం నుంచి వచ్చాడు. తన అనుభవాల్ని 'ఉచల్యా ' పేరిట నవలగా రాసాడు. ఆ పుస్తకం తెలుగులో కూడా లభ్యమవుతున్నది) లతో కలిసి విముక్తజాతుల సంక్షేమం కోసం దేశవ్యాప్త ఆందోళన కొనసాగించింది. జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్ గా పనిచేసిన జస్టిస్ వర్మ వారికి అందించీన సహకారం వల్ల ప్రభుత్వం విముక్త జాతుల అధ్యయనానికి ఒక జాతీయ కమీషన్ ను ఏర్పాటు చేసింది. (కాని ఆ కమిషన్ ఇప్పటిదాకా ఏమీ చెయ్యలేకపోయిందని మహాశ్వేతాదేవి వాపోయింది. ఇక ముందు చెయ్య్గగలదని కూడా నేననుకోను. ఎందుకంటే, ఆ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తోందన్నప్పుడు, విముక్త జాతులంటే ఎవరని ప్రభుత్వంలో ఒక సీనియర్ సెక్రటరీ నన్ను ప్రశ్నించాడు. ఆ విషయం మీద సాదికారికంగా మాట్లాడగలిగింది వకుళాభరణం లలిత గారేనని ఆమె నంబరు ఆయనకిస్తే, ఇప్పటిదాకా మాట్లాడటానికి ఆయనకి సమయం దొరకలేదు.)

  టాగోర్ నుంచి మహాశ్వేతాదేవి దాకా బెంగాలీ సాహిత్యంలో ఆదివాసులు ఎట్లా చిత్రించబడ్డారో చూడటం గొప్ప ఆసక్తి కలిగించే అంశం. టాగోర్ కవిత్వంలో ప్రశాంత వృక్షఛాయలోనో, అటవీక్షేత్రాల్లోనో కనిపించే సంతాల్ లు, అత్యంత దుర్భరమైన జీవనస్థితిగతుల మధ్య మహాశ్వేతాదేవి రచనల్లో కనిపిస్తారు. గోపీనాథ మొహంతి కూడా ఆ దుర్భర స్థితిగతుల్ని చూశాడు గాని, అది స్వాతంత్ర్యం కన్నా ముందటి మాట. స్వతంత్ర భారతదేశంలో ఆదివాసులకి బతకడానికి కూడా హక్కు లేకపోయిందనేది మహాశ్వేతాదేవి చూసి,చెప్పిన మాట. దాదాపుగా ఆమెకి సమకాలికంగా తెలుగు కళింగాంధ్ర కథకులు భూషణం వంటివారు కూడా ఆ మాటే చెప్తూ వచ్చారు. పురులియా నుంచి పాడేరుదాకా పరిస్థితులవే. కాని తాము చూసినదాన్ని ఆమెలాగా విస్తృతమైన కాన్వాసుమీద, నిష్టురమైన వ్యంగ్యంతో, విస్తారంగా రాయగలిగిన రచయితలు తెలుగులో లేకపోయారు.

  మేధాపాట్కర్, గోపీనాథ మొహంతి ఒక్కరిలో కలిసి కనిపిస్తే,ఆమె మహాశ్వేతాదేవి అవుతుందనుకుంటాను.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A prominent Telugu writer Vadrevu China Veerabhadrudu expresses his feelings about a renownd Indian writer Mahasewetha Devi.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more