• search

వట్టికోట నవలలు - నిర్దిష్ట వాస్తవికత

By Pratap
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Vattikota Alwaru Swami Novels: creative reality
  తెలంగాణ నవలా ప్రక్రియ చరిత్రలో సాయుధపోరాటం ఒక మలుపు. అది వట్టికోట ఆళ్వారు స్వామి వంటి ప్రజా రచయితను తెలంగాణ సాహిత్యానికి మాత్రమే కాకుండా తెలుగు సాహిత్యానికి ఇచ్చింది. తెలంగాణ లోని ఫ్యూడల్‌ వ్యవస్థ దౌష్ట్యం, నిజాం రాచరిక పాలనలో చిల్లరదేవుళ్ల అణచివేత ధోరణి లోకానికి విదితమే. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన చారిత్రక ఉద్యమంపై నవలలు డజను దాకా ఉన్నాయి.. ఇందులో ప్రధానంగా ఎన్నదగింది వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజల మనిషి'. ఈ పోరాటం ఇతర ప్రాంతాల రచయితలకు స్ఫూర్తినిచ్చింది. వారు కూడా తెలంగాణ సాయుధ పోరాటంపై నవలలు రాశారు. అలా వచ్చిన నవలల్లో ప్రధానమైనవి బొల్లిముంత శివరామకృష్ణ 'మృత్యుంజయులు', మహీధర రామమోహనరావు 'ఓనమాలు', 'మృత్యువు నీడల్లో', లక్ష్మీకాంత మోహన్‌ 'సింహగర్జన'. ఈ నవలలు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని, స్థూల రాజకీయాలను ప్రతిబింబించినవే తప్ప నిర్దిష్టంగా తెలంగాణ ప్రజా జీవితాన్ని చిత్రించాయని చెప్పలేం. వాటిని తక్కువ చేయడం కాదు గానీ ఆ నవలలు నిర్దిష్ట వాస్తవికతను ప్రతిబింబించలేదని మాత్రం చెప్పవచ్చు. అయితే,

  ''తెలంగాణ ఆంధ్ర మహాసభ ఆవిర్భావం వరకు అంధకారమయమైన భూస్వామ్య వ్యవస్థలో ఉన్నది. అందుచేత ఆ కాలంలో నవలలు రావడానికి అవకాశం లేదు. తెలంగాణ జీవితాన్ని నవలలో చిత్రీకరించడానికి ప్రయత్నించినవాడు బొల్లిముంత శివరామకృష్ణ. ఆయన తెలంగాణవాడు కాకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఆయన రాసిన మృత్యుంజయులు నిజాయితీకి, ఆవేశానికీ చక్కని ఉదాహరణ. కాని తెలంగాణ వాస్తవిక వాతావరణం అందులో ఉందనలేం'' (వనం సావిత్రీనాథ్‌ పరిశోధనా గ్రంథం డాక్టర్‌ దాశరథి రంగాచార్య రచనల్లో జీవిత దృక్పథం, పేజీ 88) అనే రహి మాటలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణేతర రచయితల తెలంగాణ సాయుధ పోరాట నవలల గురించి ముదిగంటి సుజాతారెడ్డి ప్రస్తావిస్తూ ''ఈ నవలల్లో పార్టీ సిద్ధాంతాలకు అనుగుణమైన ఇతివృత్తం, పాత్రల చిత్రణలు వుండడం చూస్తాం. తెలంగాణ జన జీవితంతో వాళ్లకు పరిచయం లేదు కాబట్టి ఇక్కడ ప్రజా జీవన సంస్కృతి, మూలాల నుంచి వెలికి వచ్చే వేదనలు, నిరాశ్రయులైన వాళ్ల బాధలు ఈ నవలల్లో కన్పించవు'' (తెలంగాణ పోరాట నవల - పునాది, నేపథ్యం, వార్త ఆదివారం, 16 మార్చి 2003) అని అన్నారు.

  'ఓనమాలు', 'మృత్యుంజయులు', 'మృత్యువు నీడల్లో...', 'సింహగర్జన' నవలలు కమ్యూనిస్టు సిద్ధాంతాల నేపథ్యంలో ప్రజాపోరాటాలు నడిచిన తీరును చిత్రించాయి. కానీ తెలంగాణ నిర్దిష్ట వాస్తవికతను ప్రతిబింబించాయని చెప్పలేం. 'సింహగర్జన' నవల పూర్తిగా కల్పిత గాధలాగా నడుస్తుంది. ఈ రచయితలు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి సమాచారాన్ని, సంఘటనలను తెలుసుకుని కమ్యూనిస్టు రాజకీయాల నేపథ్యంలో ఉద్యమ నవలలను రాశారు. ఇందులో వారి నిజాయితీని, నిబద్ధతను శంకించలేం. అయితే, వారికి ఉన్న పరిమితులు అందుకు కారణమయ్యాయి. ఈ విషయంపై ఇంకా లోతుగా పరిశీలన జరగాల్సే ఉంది.

  తెలంగాణ వాస్తవికతను నిర్దిష్టంగా ప్రతిబింబించిన రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణ ఉద్యమంలో మునిగితేలిన ఆయన తెలంగాణ నవలకు విశిష్టమైన స్థానాన్ని కల్పించాడు. ఆయన నిబద్ధత మాత్రమే కాకుండా నిమగ్నత ఆయన నవలలకు నిర్దిష్ట వాస్తవికతకు దోహదం చేశాయి. వట్టికోట ఆళ్వారుస్వామి కళాదృష్టి వల్ల అవి సార్వజనీనతను సంతరించుకున్నాయి. అందుకే ఆయన నవలల్లో కాలం, సమాజం, వ్యక్తులు పరిణామం చెందిన క్రమాన్ని చూస్తాం. ప్రజల మనిషిలోని కంఠీరవం మాత్రమే కాదు, గంగు నవలలోని నాగభూషణం, అంతమ్మ, సూజాత, నీలవేణి వంటి పాత్రలు కమ్యూనిస్టులుగా రూపుదిద్దుకునే క్రమం అత్యంత సహజంగా చిత్రితమైంది.

  నిజాం పాలనలో దొరలు ప్రజలను అణచివేసిన తీరును, దోపిడీకి ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి వారు చేసే కుట్రలను, అన్యాయాలను ఆయన 'ప్రజల మనిషి' నవలలో చిత్రిక కట్టారు. మతమార్పిడులను, వాటిని ఆపడానికి చేసిన ప్రయత్నాలను ఆయన వాస్తవికంగా ప్రతిబింబించాడు. ఈ క్రమంలో ప్రజల మనిషి నవలలో కంఠీరవం అనే ఒక సామాన్య వ్యక్తి ప్రజల మనిషిగా ఎదిగిన పరిణామక్రమాన్ని సహజత్వం ఉట్టిపడేలా రాశారు. 1935 నుంచి 40 వరకు తెలంగాణ ప్రజాజీవితాన్ని 'ప్రజల మనిషి' నవలలో వట్టికోట ఆళ్వారుస్వామి చిత్రించాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం కంఠీరవాన్ని రచయిత కమ్యూనిస్టుగా చిత్రించలేదు. 'కంఠీరవం 1938లో స్టేట్‌ కాంగ్రెస్‌ సత్యాగ్రహంతో చేరినప్పటికీ అప్పటికే అతనిది లౌకిక (సెక్యులర్‌) ప్రజాతంత్ర దృక్పథం. నిర్మాణ రీత్యా మాత్రమే అతను కమ్యూనిస్టు కాడు. అయితే కంఠీరవంలో రూపొందుతున్న మార్క్సిస్టు ఉన్నాడు. ప్రజల మనిషి రచనా కాలం నాటికి వట్టికోట ఆళ్వారుస్వామి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు' అని వరవరరావు (తెలంగాణ విమోచనోద్యమం - తెలుగు నవల) అనే సిద్ధాంత గ్రంథంలో అన్నారు.

  రచన చేసిన సమయంలో రచయిత కమ్యూనిస్టు అయినప్పటికీ కాల నిర్దిష్టతను ప్రతిబింబించడం ద్వారా ప్రజల మనిషి నవలకు అత్యంత విశ్వసనీయతను చేకూర్చి పెట్టారు. ఆ రకంగా ఆయన నిజమైన మార్క్సిస్టు రచయితగా మనకు కనిపిస్తారు.

  ఇక ఆయన రెండో నవల 'గంగు' ఒక యువతి తెలంగాణ విమోచనోద్యమం ద్వారా చైతన్యం పొంది కమ్యూనిస్టు పార్టీ వైపు వెళ్లడాన్ని చిత్రిస్తుంది. ఈ నవల 1940 నుంచి 45 వరకు తెలంగాణలోని ప్రజాజీవితాన్ని ప్రతిబింబిస్తుంది. గంగు నవలలో ఇంట్లోంచి వెళ్లిపోయి కమ్యూనిస్టు పార్టీలో చేరిన భూస్వామ్య వర్గంలోని యువతి పాత్రను చిత్రించాడు. ఆ పాత్ర పేరు సుజాత. సుజాత పాత్రకు ప్రేరణ వేములపల్లి సత్యవతి అనే అమ్మాయి (ముసురు, ముదిగంటి సుజాతారెడ్డి ఆత్మకథ). నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని బీబీగూడెం నుంచి 15 ఏళ్ల వయస్సున్న వేములపల్లి సత్యవతి అనే బాలిక కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితురాలై బెజవాడకు పారిపోయింది. ఆమె వెంపోగా ప్రసిద్ధుడైన పొట్లూరి వెంకటేశ్వరరావును ఆదర్శవివాహం చేసుకుంది (భారత స్వాతంత్య్ర సంగ్రామంలో తెలుగు యోధులు, సంపాదకుడు: బిసిహెచ్‌ రంగారెడ్డి). ఆమె 1943 నుంచి 1948 వరకు కమ్యూనిస్టు పార్టీ మహిళా సంఘంలో పనిచేసింది (ముదిగంటి సుజాతారెడ్డి ఆత్మకథ ముసురు).

  గంగు నవలలో నవనీతం అనే ఉద్యమకారుడితో సుజాత ప్రేమను వట్టికోట ఆళ్వారస్వామి చిత్రించారు. నవనీతం నల్లగొండ జిల్లాలోని రామన్నపేటలో వకీలు వృత్తి చేస్తున్న విశ్వనాథం పుత్రుడు. ఉద్యమ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించడాన్ని రచయిత ప్రధానం చేసుకున్నాడు. 'గంగు' నవలను వట్టికోట ఆళ్వారుస్వామి పూర్తి చేయలేకపోయాడు. భువనగిరి ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల నాయకత్వంలోకి రావడాన్ని ఆళ్వారుస్వామి కచ్చితంగానే చిత్రించాడు. దీనికి నేపథ్యాన్ని ప్రజల మనిషిలో చిత్రించిన ఆళ్వారుస్వామి గంగులో కమ్యూనిస్టు ఉద్యమం నడిచిన తీరును చిత్రించారు.

  అంతేకాకుండా, గంగు నవలలో మహిళలు ప్రజా ఉద్యమం వైపు వచ్చిన పరిణామక్రమాన్ని సృజనాత్మకంగా చిత్రించాడు. ఉద్యమానికి పూర్వరంగంలో గ్రామీణ స్త్రీ అంతమ్మ, ఉద్యమం కాస్తా ఊపు అందుకున్న తర్వాత అగ్రవర్ణ విద్యావంతురాలైన సుజాత, ఆ తర్వాత ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన గంగు అత్యంత సహజంగా రూపుదిద్దుకున్నారు. ఈ విషయంపై వరవరరావు తన సిద్ధాంత గ్రంథంలో సోదాహరణంగా వివరించారు. అయితే, అంతమ్మ కూతురు గంగు పార్టీ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇస్తున్న బాలికగా మాత్రమే మనకు కనిస్తుంది. గంగు పరిణామక్రమాన్ని వట్టికోట ఆళ్వారుస్వామి ఏ విధంగా తీర్చిదిద్దేవాడో కొంత ఊహించుకోవచ్చు. కానీ, గంగు నవల రచన పూర్తి చేయకుండానే ఆయన వెళ్లిపోయాడు.

  ఆళ్వారుస్వామి స్టేట్‌ కాంగ్రెస్‌ లక్షణాన్ని, దాని పయనాన్ని, దాని వర్గ స్వభావాన్ని ఆ దార్శనికుడిలా చిత్రించాడు. ప్రజల మనిషిలో లేని సంక్లిష్టత గంగు నవలలో కనిపిస్తుంది. సమాజంలోని సంక్లిష్టతను, ఆ సంక్లిష్ట సమాజంలో వ్యక్తులు, సమూహాలు భవిష్యత్తులో కుదురుకునే తీరును ఆయన చిత్రించారు. మద్దిమెట్ల వెంకటరావు అనే భూస్వామి గాంధీయవాదాన్ని ప్రోత్సహించడం, అది తన వ్యక్తిగన స్థాయికి భంగం కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గడం, చరఖా వంటి జాతీయోద్యమ పనిముట్లు భవిష్యత్తులో ఉపయోగపడుతాయనే దూరదృష్టితో వ్యవహరించడం వంటివాటిని అత్యంత సహజంగా వట్టికోట గంగు నవలలో చిత్రించాడు. స్టేట్‌ కాంగ్రెస్‌ పయనించిన తీరును వట్టికోట ఆళ్వారుస్వామి చిత్రించిన తీరుపై కాత్యాయనీ విద్మహే విశ్లేషణాత్మకంగా వివరింపారు. సమకాలీన రాజకీయ వ్యవస్థపై, దృక్పథాలపై, మానవ సంబంధాలపై విమర్శగా గంగు నవలను ఆమె అభివర్ణించారు. వరవరరావు ఈ నవలలను ప్రజా రాజకీయ నవలలుగా అభివర్ణించారు. వట్టికోట ఆళ్వారుస్వామి రెండు నవలలను కూడా సామాజిక చారిత్రక నవలలుగా మనం చెప్పుకోవచ్చు.

  తెలంగాణ విమోచనోద్యమం కథా వస్తువుగా బి.యన్‌. శాస్త్రి 'విప్లవజ్వాల', తిరునగరి 'సంగం' నవల రాశారు. కందిమళ్ల ప్రతాపరెడ్డి 'బందూక్‌' నవల రాశాడు. సర్పల్లి కృష్ణారెడ్డి 'ఉప్పెన' అనే నవల రాశాడు. ఈ నవలలు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి. ఇక పోరాటంలో బందూక్‌ పట్టి రజాకార్లను గడగడలాడించిన బి.యన్‌. రెడ్డి 'ఆయుపుపట్టు' అనే నవల రాశాడు. ప్రజాజీవనానికి ఆయువుపట్టు అయిన భూమిని కాపాడుకోవడానికి లచ్చమ్మ కుటుంబం జరిపిన పోరాటాన్ని ఆయన ఈ నవలలో చిత్రించారు. సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా ఈ నవలలో వర్ణితమయ్యాయి. ''ఈ నవలలో వచ్చిన రైతు కుటుంబాలతో కలిసిపోయి, వారి రక్షణలో నా పోరాట జీవితం సాగించాను. అందువల్ల వారి ఆశలు, ఆవేదనలు, చైతన్యమూ అన్నింటినీ ప్రత్యక్షంగా చూడగలిగాను. కనుక వారి భాషలోనే, వారి మాటల్లోనే ఈ గాథ చెప్తే బాగుంటుందని భావించి అలాగే వర్ణించాను'' అని రచయిత 'ముందుగా నాదొక మాట' అనే పేరుతో రాసుకున్న ముందుమాటలో చెప్పుకున్నారు. నిర్దిష్ట స్థలకాలాలను దృష్టిలో పెట్టుకుని రాసిన నవల ఇది. ఇది ఒక గ్రామం కథే అయినా తెలంగాణ సాయుధ పోరాట కాలంలోని దాదాపు అన్ని పల్లెల పరిస్థితికి ఒక ప్రతిబింబంగా నిలబడుతుంది. ఈ దృష్ట్యా ఇది ప్రజాజీవితాన్ని, వారి ఆరాటపోరాటలను వాస్తవికంగా ప్రతిబింబించిందని చెప్పవచ్చు. సాహితీ విలువల దృష్ట్యా ఈ నవల ఎలా వున్నది అన్నది నేను చెప్పగలిగింది కాదు'' అని బి.యన్‌. రెడ్డి అన్నారు. కథ బిగువుగా ఆసక్తి గొల్పే విధంగా సాగుతుంది. ఈ రకంగా చూసినప్పుడు సాహితీ విలువలకు ఈ నవలలో ఏ విధమైన భంగపాటు జరగలేదు.

  మొత్తం మీద, వట్టికోట ఆళ్వారుస్వామి ప్రతిభావంతమైన మార్క్సిస్టు సృజనాత్మక రచయితగా మనకు రెండు నవలల ద్వారా కనిపిస్తారు.

  - కాసుల ప్రతాపరెడ్డి

  (అక్టోబర్ 26వ తేదీన జరిగిన తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి సదస్సులో సమర్పించిన పత్రం)

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  We can see creative reality in Vattikota Alwaru Swami's novels Prajala Manishi and Gangu.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more