వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు కథ: ఎల్లమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

Yellamma-short story
అప్పటికప్పుడే నిర్ణయానికొచ్చిందో, అంతకు ముందే ఆ నిర్ణయం తీసుకుందో ఎవరికీ అర్థం కాలేదు. సత్య పలికిన ఒక్క మాటతో అందరూ నిశ్చేష్టులైపోయారు. ఎవరికీ నోట మాట రావడం లేదు. ఆమె నిర్ణయానికి అలా వదిలేయడమా, తమ ప్రయత్నం తాము చేయడమా అనేది ఇప్పుడు తేల్చుకోవాల్సి ఉంది.

ఆకాశంలో అప్పుడప్పుడే మబ్బుల రేకులు విచ్చుకుంటున్నాయి. అప్పటి వరకు నల్లటి మబ్బులు ఆకాశాన్ని ఆవరించి ఉన్నాయి. బోరున కుండపోత వర్షం కురుస్తుందని అనుకుని ఎక్కడివాళ్లక్కడ అన్నీ సర్దేసుకున్నారు. వర్షించకుండానే మబ్బులు తేలిపోయాయి. సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటకు వస్తున్నాడు.

ముగ్గురూ తీవ్రంగా చర్చించుకుని తల పట్టుకుని కూర్చున్న సమయంలో తలుపు వెనక నుంచి ముందు గదిలోకి మాటలు మాత్రమే వినిపించాయి. ''ఈ పెళ్లిని ఆపాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదే పెళ్లి కానీయండి'' అంది సత్య. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా సత్య పెళ్లికి సిద్ధపడడం వారిని నిశ్చేష్టులను చేసింది.

ఒకటా, రెండా ఆకాశరామన్న ఉత్తరాలు.. ఒకదాని వెనక ఒకటి.... మొదటి ఉత్తరం వచ్చినప్పుడు తేలికగా కొట్టేశారు. ఆ తర్వాత వరసగా మరో రెండు లేఖలు వచ్చేసరికి పట్టించుకోకతప్పలేదు. అందులోనూ అమ్మాయి జీవితానికి సంబంధించిందాయె. 'చూస్తూ చూస్తూ పిల్ల గొంతు కోస్తారా?' అనేది ప్రతి ఉత్తరంలోనూ కనిపించిన హెచ్చరిక. దాంతో సత్య తల్లిదండ్రులు, మామయ్యలు పునరాలోచనలో పడ్డారు. పెళ్లిని రద్దు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

సత్య పెద్దగా చదువుకోలేదు. పది పాస్‌ కావడం ఆమె వల్ల కాలేదు. దానికి తోడు బక్కగా, పీలగా ఉంటుంది. పెద్ద గాలిదుమారం వస్తే కొట్టుకుపోయేట్లుగా ఉంటుంది. పొద్దు పొడవక ముందే లేచి ఇంటి పనులూ, ఆ తర్వాత వ్యవసాయం పనులు. రాత్రి పొద్దుపోయేవరకు క్షణం తీరిక ఉండదు. అయితే ఆమె పనులు చేస్తే వంక పెట్టడానికి ఉండదు. మనసు పెట్టి చేస్తుంది అందుకే ఆమె పని చేస్తే వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే తల్లిదండ్రులు చాలా పనులు ఆమె మీదనే వదిలేస్తారు. అందువల్ల చదువు సాగలేదు. పనిలో పడిపోయి తిండి సరిగా తినకపోవడం వల్ల శరీరం సరిగా ఎదగలేదు. ఒక్క నెల రోజులు తీరిక ఇచ్చి, సరైన ఆహారం అందిస్తే చాలా మంది కంటే ఆకర్షణీయంగా, పుష్టిగా కనిపిస్తుంనడంలో సందేహం లేదు. ఆమె ముఖంలోని కళ ఆ విషయాన్ని పట్టిస్తుంది.

ఆ ముఖంలోని కళను చూసేవాడెవడు? డబ్బులు కావాలి, దానికి తోడు అందంగా ఉండాలి. ఈ రెండూ ఉంటేనే ఆడపిల్లకు పెళ్లయ్యేది. రెడ్లలో మరీను! చదువుకు చదువూ, అందానికి అందం ఉంటేనే పెళ్లిల్లు కావడం గగనమవుతున్న రోజులు. అలాంటిది సత్యకు పెళ్లి చేయడం కొండను తవ్వి ఎలుకను పట్టినంత పనవుతున్నది. ఎంతో మంది వచ్చి చూశారు. అందరూ చూసిన పోయినవారే కానీ ఏ ఒక్కరూ తిరిగి మాట్లాడలేదు. ఎట్టకేలకు ఈ సంబంధం కుదిరిందనుకుంటే ఇలా అయిపోయింది!

కాసేపటికి తేరుకున్న తల్లి - ''ఏందే? నీకేమన్నా బుద్ధుందా? చూసి చూసి నీ గొంతు కోయమంటావా?'' అని కసురుకుంది. విసుగుతోనో, నిరాశతోనో సత్య ఈ పెళ్లిని రద్దు చేయడానికి ఇష్టపడడం లేదనేది ఆమె ఆవేదన.

''అమ్మా! నా కర్మ ఎట్లా వుంటే అట్లా అవుతుంది. ఈ పెళ్లి జరిపించండి'' అని అంది సత్య ఒక కచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్లుగా.

''కాదమ్మా! నేను అంతా ఆరా తీశాను. నువ్వు ఆ యింట్లో ఉండలేవు'' అన్నాడు మామయ్య కిష్టారెడ్డి. ఈ సంబంధం చూసి కుదిర్చింది అతనే. పెద్దగా ఆస్తి లేదు. పిలగాడు మాత్రం ఆరోగ్యంగా, పుష్టిగా ఉంటాడు. ఏ క్షణంలోనో అతనికి మనసు కుదిరి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఆస్తి లేకున్నా ఫరవాలేదు. తాము ఇచ్చే అంతో, ఇంతో జాగ్రత్త చేసుకుని, దాన్ని సరిగా ఉపయోగించుకుంటే బతుకుకు ఏ విధమైన ఢోకా ఉండదనేది అతని ఆలోచన.

అయితే తనకు తెలియని మాయమర్మాలు ఆ ఇంటి చుట్టూ అల్లుకుని ఉన్నాయనే విషయం లేఖల వచ్చిన తర్వాత ఆరా తీస్తే తెలిసింది. అతను ఆ విషయాలు తెలుసుకుని గజగజా వణికిపోయాడు. తాను విన్నదీ కన్నదీ నిజమో కాదో తెలుసుకొమ్మని తమ్ముడు నర్సిరెడ్డికి చెప్పాడు. తమ్ముడు రాజకీయాల్లో తిరుగుతుంటాడు. అందుకని విషయాలు మరింత వివరంగా, స్పష్టంగా అతనికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇద్దరు కనుక్కున్న విషయాలు ఒక్కటే కావడంతో వారిలో కలవరం మొదలైంది.

ఆ ఇంటి వైపు చుట్టుపక్కలవారెవరూ కన్నెత్తి కూడా చూడరు. చిన్న పిల్లలు ఆ యింటి ముందు నుంచి పోవాలంటే గుండెను అరచేతిలో పెట్టుకుంటారు. ఆ యింట్లో దయ్యమో, భూతమో ఉందని ఆ ఊరి ప్రజల భయం. పెళ్లి పిలగాడు ఎల్లారెడ్డి తల్లికి మంత్రాలు, చేతబడులు వస్తాయని ఊరిలోని చాలా మంది కిష్టారెడ్డికి చెప్పారు. ''చూస్తూ చూస్తూ పిల్ల గొంతు కోయకండి'' అని నర్సిరెడ్డితో అన్నారు. అర్థరాత్రి పూట ఆ యింట్లోంచి శోకాలు వినిపిస్తాయట. ఆ యింట్లో అప్పుడప్పుడు ఏవేవో జరుగుతుంటాయట. యాటలు తెగుతాయట. కర్మకాండలేవో జరుగుతాయట. ఆ యింట్లో కక్షుద్రపూజలు జరుగుతాయనేది ఆ ఊరి ప్రజల దృఢనమ్మకం. అందుకే ఆ యింటికి మరొకరు వచ్చేది లేదు. ఈ ఇంటి నుంచి ఒకరు మరో ఇంటికి పోయేది లేదు. ఊరి మధ్యలో వెలివేసినట్లు ఆ యిల్లు.

ఇదంతా విన్న తర్వాత కిష్టారెడ్డి, నర్సిరెడ్డి బిక్కచచ్చిపోయారు. ఏం చేయాలో తోచలేదు. అప్పటికే నిశ్చితార్థం జరిగిపోయింది. నిశ్చితార్థానికి ఊరి వారు రాకపోవడాన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ దాని వెనక ఇంత పెద్ద కథ ఉందని తెలియదు. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లిని కాదనుకోవడం అంత సులభం కాదు. ఇప్పటికే పిల్లకు పెళ్లి చేయడమంటే దేవతలు దిగి వచ్చినంత పని అవుతున్నది. అట్లని చూస్తూ చూస్తూ పిల్లను నరకంలోకి తోసేయలేరు కదా!

పిల్ల తల్లిదండ్రులు, ఇద్దరు మామయ్యలు కలిసి పెళ్లిని రద్దు చేసుకోవడానికే నిర్ణయించుకున్నారు. ఇదంతా సత్యకు తెలియకూడదని అనుకున్నారు. అలా అనుకుని నిశ్చితార్థం రోజు పెట్టిన ఉంగరం తీసుకురావాలని అనుకున్నారు. ఆ పని నర్సిరెడ్డికి అప్పగించారు. ఆ ఉంగరం తీసుకొస్తేనేగానీ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు కాదు.

నర్సిరెడ్డికి భయంభయంగానే ఉంది. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న తర్వాత దాన్ని కాదనడం అంత సులభమైన పనేం కాదు. ఓ మిత్రుడిని వెంట బెట్టుకుని ఎల్లారెడ్డి ఇంటికి వెళ్లాడు.

ఇంట్లో ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి తల్లి బాలమ్మ ఉన్నారు. వెళ్లగానే హడావిడి చేసి వారు ఫలహారాలు పెట్టారు, టీ ఇచ్చారు. నర్సిరెడ్డికి ఎలా ప్రస్తావించాలో అర్థం కాలేదు. నోట మాట రావడం లేదు. అసలు విషయం రాకుండానే అరగంట సేపు గడిచింది. నర్సిరెడ్డి లేస్తూ వచ్చిన పని కానీయాలన్నట్టు - ''మేం ఈ పెళ్లి వద్దనుకుంటున్నాం!'' అన్నాడు.

బాలమ్మకూ ఎల్లారెడ్డికీ మొదట ఏమీ అర్థం కాలేదు. అయోమయంలో పడ్డారు. వారు ఏమీ మాట్లాడకపోయేసరికి ''మీ సంబంధం వద్దనుకుంటున్నాం. మేం పెట్టిన ఉంగరం మాకు ఇచ్చేయండి'' అని నర్సిరెడ్డి అన్నాడు. ఎవరో వెనక నుంచి తరుముతున్నట్లు ఆ మాటలు అనేశాడు.

అప్పుడు అర్థమైంది వారికి. ముఖాలు జేవురించాయి. ఏమీ మాట్లాడలేకపోయారు. వారు ఉలకలేదు, పలకలేదు.

''ఉంగరం ఇచ్చేయండి, మేం పోవాలి'' అన్నాడు నర్సిరెడ్డి.

''ఇప్పుడు ఆ మాటంటే ఎట్లా, బిడ్డా?'' అంది బాలమ్మ.

ఎల్లారెడ్డికి కోపం వచ్చింది. కోపంతో మాటలు రావడం లేదు. ఎలాగో కూడదీసుకుని- ''నేను ఇయ్య, పోండి!'' అన్నాడు.

''ఇవ్వకుంటే ఎలా?'' అన్నాడు నర్సిరెడ్డి. ఇంతలో కాస్తా సర్దుకున్నాడతను.

''అంతా మీ ఇష్టమేనా?'' అన్నాడు ఎల్లారెడ్డి.

''మీకు నేను కారణాలు చెప్పలేను. మా పిల్లకు ఇష్టం లేదు. పిల్ల తల్లికి ఇష్టం లేదు''

''ఇష్టం లేనిదే ఇంత దాకా వచ్చిందా?'' అన్నాడు ఎల్లారెడ్డి. ''నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి'' అంటూ ఎల్లారెడ్డి బయటకు వెళ్లిపోయాడు. చేసేది లేక నర్సిరెడ్డి, అతని మిత్రుడు బయటకు వచ్చారు.

ఆ ఉంగరం ఎట్లా తీసుకోవాలనే విషయంపైనే ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఆ ఉంగరాన్ని ఎలా తెప్పించాలా అనే విషయం గురించి మాట్లాడుతుంటే సత్య పిడుగులాంటి నిర్ణయాన్ని ప్రకటించింది.

తేట పడిన ఆకాశం మీద మళ్లీ కారు మబ్బులు అలుముకోసాగాయి. అలా మబ్బులు అలుముకున్నాయో లేదో బోరున వర్షం కురవడం మొదలు పెట్టింది. అదే సమయంలో ఇంట్లో సత్య తండ్రి అడుగు పెట్టాడు. పెళ్లి వద్దని సత్యకు నచ్చ చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆమె వారి మాట వినేట్లు లేదు. మొండికేసింది. సత్య అలా ఎందుకు మొండికేస్తున్నదో వారికెవరికీ అర్థం కావడం లేదు.

పెద్ద రాద్ధాంతమే జరుగుతన్నది. ఎట్టకేలకు తండ్రి కల్పించుకుని ''దాని రాత ఎట్లుంటే అట్లయితది. దాని మాట ప్రకారమే కానీయండి. ఒక పెళ్లి కుదిరి చెడిపోయిందంటే మనకు కూడా అంత మంచిది కాదు'' అన్నాడు. నర్సిరెడ్డి, కిష్టారెడ్డి ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్లిపోయారు.

భయాల మధ్య, సందేహాల మధ్య పెళ్లి జరిగిపోయింది. సత్య వాళ్ల వైపు నుంచి ఎవరికీ పెద్ద ఉత్సాహంగా లేదు. పెళ్లికొడుకు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నాడు. సత్య కూడా నిర్వికారంగా ఉంది.

### ### ####

తల్లిగారింటి నుంచి అత్తవారింట్లో అడుగు పెట్టిన సత్య భర్త ఎల్లారెడ్డిని నిశితంగా పరిశీలించసాగింది. అతనికేం దురలవాట్లు లేవు. తాను వచ్చినప్పటి నుంచి తనను అంటి పెట్టుకుని ఉంటున్నాడు. తనకు ఏ విధమైన ఇబ్బందులు కలగడం లేదు. అతనికి పిచ్చి తిరుగుళ్లు ఉన్నట్లు కూడా అనిపించడం లేదు. అతన్ని అడగడానికి ఇష్టం లేదు. అలా అడగడం వల్ల కర్ర విరిచినట్లయి మొదటికే మోసం రావచ్చుననేది ఆమె ఆందోళన. మరి, ఆ ఉత్తరాలు ఎందుకు వచ్చాయో ఆమెకు అర్థం కావడం లేదు. ఆ మిస్టరీని ఛేదిస్తే తప్ప తనకు మనశ్శాంతి ఉండదనుకుంంది. అయితే ఊరిలోని వాళ్లు మాత్రం తనను జాలిగా చూస్తున్నట్లు అనిపించింది. ఆ జాలి వెనక అంతరార్థమేమిటో ఆమెకు అంతుబట్టడం లేదు. ఎవరి అడుగుదామన్నా బెరుకు. ఎటు పోయి ఎటు వస్తుందోననే ఆందోళన. ఆ ఆందోళనను ఎప్పటికప్పుడు వెనక్కి నెట్టేస్తూ ముందుకు సాగడాన్ని సత్య అభ్యాసం చేసుకుంది.

తాను ఆ ఇంటికి వచ్చి ఆరు నెలలపైనే అవుతున్నది. తాను వచ్చిన తర్వాత ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటన గానీ, తనను బాధపెట్టే అంశం గానీ జరగలేదు. ఆర్థికంగా బాగా లేరనే విషయం తమకు ముందే తెలుసు. అందుకే ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఏ మాత్రం కొత్తగా భావించలేదు, వెనకడుగు వేయలేదు. ఆరిందానిలా చకచకా పనులకు ఉపక్రమించింది. ేఏ మాత్రం ఆలస్యం చేయకుండా తల్లిగారిచ్చిన డబ్బులతో చిన్న కిరాణాకొట్టు పెట్టించింది. మామయ్య నర్సిరెడ్డితో చెప్పి ఉన్న ఐదెకరాలను సాగులోకి తేవడానికి పొలంలో బోరు వేయించింది. బోరులో నీళ్లు ఉబికిఉబికి ఎగిసిపడ్డాయి. ఇంట్లోకి సరిపోయేంత వరకు వరినాట్లు వేయించి, మిగతా పొలంలో కూరగాయల వంటి ఇతర పంటలు వేయించింది. తాను వచ్చిన తర్వాత ఒక పంట కూడా వచ్చింది. ఆలోచన సత్యది, ఆచరణ ఎల్లారెడ్డిది. దాంతో ఇంట్లో డబ్బులు ఆడడం మొదలైంది. ఈ ఆరు నెలల్లో ఆమె గమనించిన మరో విషయం కూడా ఉంది. భర్త ఎల్లారెడ్డి చాలా పొదుపరి. పైస ఖర్చు పెట్టాలంటే గిజగిజలాడుతాడు. అయితే పెట్టే వద్ద పెట్టాలి, పెట్టకూడని వద్ద పెట్టవద్దనే విషయాన్ని ఆమె అతనికి అనుభవపూర్వకంగా నేర్పింది. దీంతో భర్తతో పాటు అత్త కూడా సంతోషించసాగింది. ఇంట్లో లక్ష్మి అడుగు పెట్టిందని వారు భావించారు. అందుకే సత్యను ప్రేమగా చూడసాగారు. ఈ విషయం వారి చేతల ద్వారా సత్య అర్థం చేసుకుంది.

ఉన్నట్టుండి ఓ అర్ధరాత్రి పూట ఉలిక్కిపడి లేచింది సత్య. తాను ఎన్నడూ ఊహించని శబ్దాలు. ఓ స్త్రీ శిగమూగుతూ కొలుపు చెబుతున్న ధ్వనులు. గుండెలదురుతున్నాయి. లేచి కూర్చొని ఎల్లారెడ్డిని తట్టి లేపింది. ఎల్లారెడ్డి లేవకుండానే కళ్లు తెరిచి సత్యను చూశాడు. సత్య కళ్లలో భయం. ఆ భయాన్ని పోగొట్టడానికి ''ఏం కాదులే, మా అమ్మ! ఆమెకు అప్పుడప్పుడు ఎల్లమ్మ పూనుతుంది. నువ్వు పడుకో'' అని కళ్లు మూసుకున్నాడు. సత్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో ప్రాణాలు పోయేట్లున్నాయి. లయాత్మకంగా ఆమె పలుకుతున్న మాటలు వెన్నులో చలి పుట్టిస్తున్నాయి. గుండె దిటవు చేసుకొని బయటకు వచ్చింది.

అత్త బాలమ్మ తల వెంట్రుకలు విరబోసుకుని, శిగమూగుతూ, కొలుపు చెబుతుండడం కనిపించింది. ఆ దృశ్యం చూసి ఒక్కసారి భయంతో కంపించిపోయింది సత్య. ''నేను ఎల్లమ్మ తల్లినిరో'' అంటూ ఏదేదో మాట్లాడసాగింది. అలా గంటకు పైగానే సాగింది. బాలమ్మ సోషొచ్చినట్లు నేల మీద పడిపోయి అలాగే నిద్రపోయింది. సత్యకు ఇది కొత్త అనుభవం. బోనాల పండుగ ఊరేగింపులో అటువంటిది చూసింది. ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. రాత్రి నిద్ర పట్టలేదు. భర్త ఏమీ జరగనట్లే నిద్రపోయాడు. ఆ రోజు చాలా కష్టంగా తెల్లారింది.

తెల్లారి లేవగానే భర్తకు రాత్రి జరిగిన సంఘటన చెప్పింది. అదేం కొత్త విషయం కాదన్నట్లుగా ''మా అమ్మకు అప్పుడప్పుడు ఎల్లమ్మ పూనకం వస్తుంది. దాని వల్ల ఎవరికీ ఏ విధమైన నష్టం లేదు కదా! అందుకే నేను అలవాటు పడిపోయాను'' అని నువ్వు కూడ అలవాటు పడిపో అనే పద్ధతిలో చెప్పాడు. వెంటనే అతని ముఖం బాధతో రంగు మారడం సత్య దృష్టి నుంచి మళ్లిపోలేదు. ''అయితే మా అమ్మకు మంత్రాలొస్తాయని ఊళ్లో జనం భయపడతారు. అందుకని చాలా మంది మాకు దూరంగా ఉంటారు. మా అమ్మకు మంత్రాలు వచ్చినట్లు నేనైతే చూడలేదు'' అని అన్నాడు. ఈ మాటకు సత్య ఉలిక్కిపడింది. నిజంగా అత్తకు మంత్రాలొస్తాయేమేమోనని భయపడి ''మంత్రాలు అబద్ధమేనా?'' అని అడిగింది. ''నాకు తెలుసు కదా, మంత్రాలురావు, తంత్రాలు రావు'' అని భరోసా ఇస్తున్నట్లు చెప్పాడు.

బెడ్‌రూమ్‌లోంచి బయటకు వచ్చి కాలకృత్యాలు తీర్చుకొని ముఖం కడుక్కుంటుంటే అత్త దగ్గరికి వచ్చింది. ఆమె ముఖం చూడాలంటే సత్యకు బిడియంగా ఉంది. తెల్లవారుజామునే లేచి ముఖం కడుక్కున్న తర్వాత పనులు చేయడం సత్యకు మొదటి నుంచి అలవాటు.

''సత్యా! రాత్రి ఎల్లమ్మ తల్లి కనిపించింది'' చెప్పింది బాలమ్మ. సత్య అత్త వైపు చూడలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. అయినా బాలమ్మ చెప్పుకుంటూ పోతున్నది. ''ఎల్లమ్మ తల్లి వచ్చి నన్ను మర్చిపోయినవా, కోడలు వచ్చిందని నన్ను పట్టించుకుంటనే లేవన్నది. తల్లికి కోపమొచ్చినట్లుంది. పండుగ చేయమని చెప్పింది. పండుగ చేయాలె. యాటను కొయ్యాలె. నాలుగైదు వేల ఖర్చు'' అని చెప్పుకుంటూపోసాగింది.

సత్య వింటున్నదా, లేదా అని కూడా చూడలేదు. ఒక్కొక్క పనే చేసుకుంటూ పోసాగింది సత్య. ఆ తర్వాత టీ చేసి అందరికీ ఇచ్చి తాను తాగడం ప్రారంభించింది. ఆ సమయంలో బాలమ్మ మళ్లీ ఎత్తింది. ఈసారి కొడుకును ఉద్దేశించి మాట్లాడసాగింది. ''బిడ్డా! ఎల్లమ్మకు చేయాలె. ఓ యాటను మాట్లాడు. అన్ని ఏర్పాట్లు చెయ్యి'' అని చెప్పింది.

సత్య ధైర్యం కూడదీసుకుంది. ఏమైతే అయింది అవుతుందని అనుకుంది. ''ఎల్లమ్మ తల్లి వద్దు. ఏమొద్దు. నేను చేయ'' అన్నది.

''అట్లంటె ఎట్లా? ఎల్లమ్మ మనకు తల్లి. కోపమొస్తది'' అన్నది బాలమ్మ ఏదో తప్పు జరిగిపోయినట్లుగా చెంపలేసుకుంటూ.

''తల్లికి ఎక్కడన్నా కోపమొస్తదా? నా మీదైతే ఏం రాదు. వచ్చినా నా మీదనే కదా! వస్తే చూద్దాంలే'' అన్నది. అత్తాకోడళ్ల మధ్య ఘర్షణ ఎక్కడికి దారితీస్తుందోనని ఎల్లారెడ్డి భయపడసాగాడు. టీ సగం ఉండగానే కప్పు పక్కన పెట్టేసి ఏదో పని ఉన్నట్లు వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఇది గమనించిన బాలమ్మ ''ఎక్కడికి పోతవురా, ఉండు! ఇదేదో పూర్తి కానీ. అదేమో వద్దంటుంది. రాత్రి ఎల్లమ్మ వచ్చి నాకు చెప్పింది పండుగ చేయమని. చేయకుంటే ఎల్లమ్మకు కోపం రాదా?'' అన్నది. ''పెళ్లప్పుడు చేస్తిమి. మళ్లా పటించుకోకపోతిమి. అగో చూడు! ఆ గోడ మీద ఎల్లమ్మ తల్లి ఎట్లుందో.'' అన్నది ఆమె.

ఆ గోడ వైపు చూసింది సత్య. అక్కడ చిన్నపాటి పుట్ట ఉంది. ఆ పుట్టనే ఎల్లమ్మ తల్లి. పుట్టకు సమీపంలోని దుగుట్లో దీపం. దుగుడు చుట్టూ బార్డర్‌లా జాజుతో అలికి ఉంది. సత్య అక్కడి నుంచి లేచిపోయింది. సత్య వచ్చిన తర్వాత ఇంట్లో లక్ష్మి అడుగు పెట్టిందని బాలమ్మ నమ్ముతూ వచ్చింది. అందుకే కోడలుపై అధికారం చెలాయించడం, ఆమెను కోపగించుకోవడం చేయదు. అందుకే సత్య వెనకనే వెళ్లి బతిమిలాడుతున్నట్లు - ''మంచిది కాదు బిడ్డా! నేను కాటికి కాళ్లు సాపినదాన్ని. ఎల్లమ్మకు కోపమొస్తే మీకే ఏమన్నా అయితదని భయం'' అన్నది.

''అత్తయ్యా! నీకేం ఆ భయం అక్కర్లేదు. మా మీద ఆ తల్లికి కోపమేమీ రాదు. ఆ తల్లి మనింటికి కూడా రాదు'' కాస్తా మెత్తగానే అయినా దృఢంగా పలికింది సత్య.

బాలమ్మ దిగాలు పడిపోయి తనలో తానే ఏదేదో గొణుక్కోవడం మొదలు పెట్టింది. చేతులు ఊపుకుంటూ అశాంతి తిరగడం మొదలు పెట్టింది. ఇదంతా సత్య గమనిస్తూనే ఉంది. తల్లి అవస్థ చూసి ఎల్లారెడ్డి ''నిజంగానే ఎల్లమ్మ తల్లికి కోపమొస్తదేమో?'' అన్నాడు ఎల్లారెడ్డి భార్య వద్ద.

''తల్లికి ఎక్కడన్నా బిడ్డల మీద కోపమొస్తదా?'' అని అన్నదే గాని ఇది ఎక్కడికి దారి తీస్తుందోననే భయం సత్యకు లోలోపల ఉండనే ఉంది. అయినా ఇళ్లంతా దులపడం మొదలు పెట్టింది. పుట్టను గీకేయడం మొదలు పెట్టింది. అలా గీకేస్తున్నప్పుడు బాలమ్మకు ఎల్లమ్మ పూనింది. ''ఓ బాలమ్మా! నీకేం నష్టగాలమొచ్చిందే! నన్ను పంపించేయాలని చూస్తున్నవు. నీ కోడలును చూసుకుని మురిసిపోతున్నవు. ఓ కోడలు పిల్లా నువ్వు నన్ను తరిమేయద్దు. నేను ఇక్కణ్నే ఉంటా'' బాలమ్మను ఆవహించిన ఎల్లమ్మ అన్నది. ఆ మాటలకు సత్య వెంటనే ప్రతిస్పందించింది.

''ఎల్లమ్మ తల్లీ! నువ్వు నా ఇంట్ల ఉండొద్దు. నువ్వు వెళ్లిపో!'' అంది.

''బిడ్డా! నన్నే ఎల్లిపొమ్మంటవా? నాకు కోపమొచ్చిందంటే ఏమైతదో ఎరికేనా?'' అంటూ తలను వలయాకరంగా తిప్పుతూ చేతులు ఊపుతూ ప్రశ్నించింది ఎల్లమ్మ.

''నువ్వు మా అమ్మవు కదా తల్లీ! అమ్మకు బిడ్డల మీద కోపమొస్తదా? నువ్వు నాకొద్దు. నీకు నామీద కోపమొచ్చినా సరే, నువ్వు మాత్రం నాకొద్దు'' అని గట్టిగా చెప్పింది సత్య. ఇదంతా ఎల్లారెడ్డి భయంభయంగా చూడసాగాడు.

''ఇక్కణ్నుంచి తరిమేస్తే ఎక్కడికి పొమ్మంటవు?'' అని రాగాలు తీస్తూ, మధ్య మధ్య వెక్కిళ్లు పెడుతూ ఎల్లమ్మ అడిగింది.

''ఇక ఈ భూమి మీద నీకు జాగనే లేదా? నేను చెప్పాలా?'' అంది సత్య ఎల్లమ్మకు ఎదురుగా నిలబడి.

''అంతేనంటవా? నన్ను పొమ్మంటవా? నీ మాట అదేనా?'' అని ఎల్లమ్మ మరీ మరీ ప్రశ్నించింది.

''అంతే. వీసమంత ఇటూ అటూ లేదు'' అని చెప్పింది సత్య దృఢంగా. లోపల భయం భయంగానే ఉంది.

బాలమ్మ సోషొచ్చి పడిపోయింది.

లేచింది. లేచేసరికి పుట్ట లేదు. బాలమ్మ గజగజా వణికిపోయింది. ''ఎంత పని చేసినవు, బిడ్డా?'' అన్నది కోడలును ఉద్దేశించి.

''నువ్వేం భయపడకు. ఏదన్నా అయితే నాకే అయితది కదా!'' అన్నది.

''నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా?'' అంటూ రెండు చేతులు పబ్బతి పట్టి మొక్కుతూ ''ఆ కష్టమేదో నాకే రానీ. తల్లీ! ఎల్లమ్మా! అది పిచ్చి పిల్ల. దానికేం తెలువది. దాని మీద కోపగించుకోకు. ఏదైనా చెయ్యదలుచుకుంటే నాకే చెయ్యి. ఎల్లమ్మ తల్లీ! దాన్నేం చేయకు'' అని చెంపలేసుకుంది. ''అయినా, గీకేసినంత మాత్రాన ఎల్లమ్మ తల్లి ఎటు పోతది. మళ్లా వస్తది'' అంది బాలమ్మ. ఆమెకు అనుభవంలో ఉందే! మొదట్లో ఆమె అలానే గీకేసింది. గీకేసిన కొద్దీ అది తిరిగి మొలుచుకు రావడం ప్రారంభించింది.

సత్య ఆ రోజంతా ఇల్లు దులిపింది. అంతటా సెంట్‌ కొట్టించింది. కిరోసిన్‌ చల్లింది. ఆ తర్వాత వైట్‌ సిమెంట్‌ వేయించింది. మధ్యమధ్యలో క్రమం తప్పకుండా సెంట్‌ కొడుతూ కిరోసిన్‌ చల్లుతూ రాసాగింది. దాని వల్ల ఎప్పటికప్పుడు ఏ మాత్రం చెదలు రాకుండా, పుట్ట పెరగకుండా జాగ్రత్త పడుతూ రాసాగింది. దీన్ని సత్య ఓ తపస్సులా చేసింది.

రోజులు గడిచాయి. బాలమ్మకు మళ్లీ శిగం రాలేదు. ఎల్లమ్మ తల్లి వెళ్లిపోయిందనే బాలమ్మ తలపోసింది. కిరాణాకొట్టు బాగానే నడవసాగింది. పొలంలో పంటలు బాగా పండుతున్నాయి.
### ### ####

సత్య గబగబా పొలం వైపు నడవసాగింది. దారిలో వాగు దాటాల్సి ఉంది. వాగు దగ్గర చిన్నవి, పెద్దవి గుబురుగా చెట్లు ఉంటాయి. చెట్ల కొమ్మలు పైన ఆకాశం కనిపించకుండా కప్పేస్తాయి. దాంతో అక్కడ కాస్తా చీకటిగా వుంటుంది. వాగులో కాలు పెట్టిందో లేదో ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి స్తంభించిపోయింది సత్య.

ఎదురుగా అతి భయానకమైన స్త్రీ రూపం. నల్లటి ముఖం, నుదిటి మీద రూపాయి బిళ్లంత ఎర్రటి కుంకుమ బొట్టు. ముదురు ఆకుపచ్చ రంగు చీర, రైక. రైక చేతులకు పెద్ద జాజు రంగు బార్డర్‌. అప్పుడే తలంటు స్నానం చేసి వెంట్రుకలు విరబోసుకుంది. పొడుగైన నల్లటి వెంట్రుకలు చెంపలపై నుంచి, వీపు మీద జారుతున్నాయి. పై ప్రాణాలు పైనే పోయేట్లున్నాయి సత్యకు. ఆమెకు ఎదురుగా వచ్చి ''బిడ్డా! నేను ఎల్లమ్మ తల్లిని'' అంది. కంఠం ఖంగుమని మోగి, మాట గాలిలో కలిసి ప్రతిధ్వనించింది. ''బిడ్డా! తల్లికి బిడ్డల మీద కోపం ఉంటదా? ఉండదు. తల్లి పిల్లల నుంచి కోరికలు కోరతదా? కోరది. తన బిడ్డలు ఎల్లకాలం చల్లగా ఉండాలని దీవిస్తది'' అని అన్నది. ఆ మాటలు అంటూ అంటూనే మాయమైంది. ఇదంతా లిప్తపాటులో జరిగిపోయింది. భయంతో పొలం దాకా పరిగెత్తింది సత్య. ఆ విషయాన్ని ఆమె ఎవరితోనూ చెప్పలేదు. ఆ తర్వాత ఆమె ఒంటిరిగా ఏ రోజూ పొలం వద్దకు వెళ్లలేదు.

### ### ####

పెళ్లి సందడి ముగిసింది. దగ్గరి బంధువులందరూ ఇంట్లో ఉండిపోయారు. సాయంత్రం వేళ. మసక మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి. టీ తాగుతూ ముచ్చట్లలో పడ్డారు. మాటలు అటూ ఇటూ వెళ్లి బాణామతి వైపు మళ్లాయి. సత్య ఆసక్తిగా వినసాగింది.

''బాణామతి వంటివి, దేవతలు అన్నీ మనం కల్పించుకున్నవే'' అన్నాడు సీతారామిరెడ్డి. ఇతను సత్య చిన్నమ్మ భర్త. హైదరాబాద్‌లో ఉంటాడు. అప్పుడు గొంతెత్తింది సత్య. ''నాకు ఎల్లమ్మ తల్లి కనిపించింది. అది అబద్ధమంటావా?'' అని అడిగింది సత్య.

చిన్నమ్మలు, పెద్దమ్మలు, అన్నలు, మామయ్యలు అందరూ ఆమె వైపు చూశారు.

''వాళ్ల అత్తకు ఉంది కదా, దీనికి కూడా పట్టుకున్నట్లుంది'' అంది సత్య తల్లి

''అదేం కాదు, బాబాయ్‌! నాకు నిజంగా కనిపించింది. పట్టపగలు, నేను మెలుకవతోనే ఉన్నా'' అన్నది.

''ఏం జరిగిందో మొత్తం చెప్పు'' అని అడిగాడు సీతారామిరెడ్డి.

జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది.

''నీకు ఎల్లమ్మ కనిపించడం ఒక భ్రాంతి. మా పొలానికి వెళ్లే దారిలో రెండు వాగులుంటాయి. ఒక వాగులో ఓసారి మా తమ్ముడికి కోటూరు సిద్ధుల దేవుడు కనిపించాడు. పుట్టింది మొదలు కొటూరు సిద్దుల గుట్ట మా జీవితాల్లో విడదీయరాని భాగమయ్యాడు. మా బాపు విపరీతంగా ఆ దేవుడి మీద నమ్మకం ఉంచేవాడు. వీలు చిక్కినప్పుడల్లా ఆయన ఆ దేవుడి కథలే చెప్పేవాడు. ఇప్పుడు మా వాడు నాస్తికవాది. హేతువాది కూడా'' అని నవ్వాడు అతను.

చీకటి పడింది. మాటల్లో పడి లైట్లు వేయడం మర్చిపోయారు.

ఇంతలో ప్రశాంత్‌ దిగ్గున లేచి - ''డాడీ! అదిగో! అటు చూడు!! కాగడా వెలుగుతున్నది. దాని చుట్టూ ఎంత వెలుతురో!'' అన్నాడు ఆకాశం వైపు చూపిస్తూ. ప్రశాంత్‌ సీతారామిరెడ్డి కొడుకు. పదేళ్లుంటాయి.

అందరూ ఆసక్తిగా ఆ వైపు చూశారు. కొందరు ''ఏదిరా?'' అని అడిగారు.

''మాకేమీ కనిపించడం లేదు'' అని పిల్లలు అన్నారు.

''అదిగో! నాకు కనిపిస్తున్నది, నిజం!'' అని ఒట్టేసుకున్నాడు.

- కాసుల ప్రతాపరెడ్డి

English summary
The present Telugu short story Yellama is based the public faith on village deity Yellamma written by Kasula Pratap Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X