వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు కథ: పెద్దక్క

By Pratap
|
Google Oneindia TeluguNews

Nerella Srinivas Goud
లచ్చన్న బొంబాయి వెళ్ళి మూడేండ్లు గడిచింది. బొంబాయి వెళ్లిన కొత్తలో రెండుమూడు నెలల వరకు ఉత్తరాలు రాసినాడు. తరువాత ఉత్తరాలు రాలేదు. పెద్దక్క మాత్రం బొంబాయి నుంచి ఉత్తరం వచ్చిన చిరునామాకు ఉత్తరాలు రాస్తూనే ఉంది. లచ్చన్న దగ్గరి నుంచి ఏ విధమైన జవాబు రావడం లేదు.

లచ్చన్న తండ్రి బొంబాయి వెళ్లినాడు. బొంబాయి అంత వెతికినాడు. ఎంత వెతికిన ఏ విధమైన ఆచూకి తెలియలేదు. సమాచారం దొరకలేదు.

లచ్చన్న లేడనే నిర్ణయానికి వచ్చారందరు.

పెద్దక్క కలలు కాలగర్భంలో కలిసిపోయినాయి. లచ్చన్న లేని జీవితం ఊహించుకోలేకపోతుంది పెద్దక్క. అతనితో అందమైన జీవితాన్ని ఊహించుకొని ఆనందపడేది. ఆ ఆనందం ఆవిరైపోనుందా...? ఎన్నో కలలు కన్నది. ఆ కలలు వట్టివేనా? సరదాలు... మాటలు... ముచ్చట్లు మురిపాలు ఇక ఇంతేనా...?

పెద్దక్క ఇంటికి పెద్దది. ఒక చెల్లె, ఒక తమ్ముడు జన్మించిన తరువాత తండ్రి చనిపోయినాడు. తల్లి వికలాంగురాలు. చిన్నతనంలోనే ఇంటిభారం పెద్దక్క మీద పడటంతో కుటుంబానికి పెద్దక్క పెద్దదిక్కయింది. పదేండ్ల వయస్సులో పెద్దక్కను లచ్చన్నకు ఇచ్చి పెండ్లి చేసినారు. లచ్చన్నది అదే ఊరు. లచ్చన్న పెద్దక్క చిన్నప్పటి నుంచి కలిసే తిరిగినారు. ఇద్దరు కలిసి ఆడుకున్నారు. కలిసి పనులు చేసినారు. ఎన్నో సరదాలు, ఎన్నో మాటలు... ఎన్నో ముచ్చట్లు... ఎన్నో మురిపాలు. ఆనందంగా గడచిపోయింది బాల్యం. బాల్యం నుంచి యవ్వనంలోకి వచ్చారు.

సంప్రదాయం ప్రకారం ఇద్దరిని ఒక్కటి చేయడానికి మంచం, బట్టలు ఇయ్యడానికి పెద్దలు మంచి రోజు చూపించినారు.

ఓరోజు పెద్దక్కతో ''నేను బొంబాయి వోదామనుకుంటున్నాను'' అన్నాడు లచ్చన్న.

''ఎందుకు...?'' అడిగింది పెద్దక్క.

''మనకు మంచం బట్టలిచ్చి కాల్లగోల్లు తీత్తరట... కులపొల్లమందమన్న భోజనాలు పెట్టాలి... భోజనాలు పెడితే ఎంత లేదన్న ఏడెనిమిది వేయిలన్న కావాలే... అందుకే బోంబాయి వెళ్లి సంపాదించుకత్త'' అన్నాడు లచ్చన్న.

''చేసుకోవడానికిక్కడెన్నో పనులున్నాయి... గంత దూరంబోయి సంపాయిత్తవా...?''

''ఇక్కడెన్ని పనులు సేసిన గన్ని రూపాయలు జమకావు''

వద్దని వారించిన లచ్చన్న వినలేదు. బోంబాయి వెళ్ళినాడు.

అలా వెళ్ళిన లచ్చన్న తిరిగి రాలేదు.

పెద్దక్కకు మనసున పడుతలేదు. లచ్చన్న ఏమైనట్టు. లచ్చన్న బొంబాయిలో తప్పిపోయిండా? తప్పిపోతే లచ్చన్న చిన్నపిల్లవాడు కాదు. ఎక్కడికి పోయిన తిరిగి రాగలడు. మరి ఇప్పటి వరకెందుకు రాలేదు... చనిపోయిండా..? చావు అనే మాట మదిలోకి రాగానే కన్నీల్లు ఆపుకోలేకపోయింది. తన బతుకు ఒంటరి బతుకేనా...? పెద్దక్క ఆలోచిస్తునే ఉంది.

రోజులు గడుస్తున్నాయి.

లచ్చన్నను మరిచిపోలేకపోతుంది పెద్దక్క.

ఓ రోజు లచ్చన్న తల్లిదండ్రులైన రామయ్య నర్సమ్మ పెద్దక్క ఇంటికి వచ్చినారు. వచ్చి రాగానే పెద్దక్క తల్లిని పట్టుకొని కొంతసేపు పెద్దక్కను పట్టుకొని కొంతసేపు ఏడ్చింది నర్సమ్మ.

అందర్ని ఓదార్చినాడు రామయ్య.

చీరకొంగుతో కన్నీళ్లు తుడుచుకున్నారు ఆడవాళ్లు.

''ముత్తక్క... పెద్దక్కను మారుమనువు ఇద్దాం'' అన్నాడు రామయ్య.

ఆ మాటతో పెద్దక్క మీద పెద్ద పిడుగు పడ్డట్టయింది. తల్లి గట్లుండే... తమ్ముడు చెల్లె చిన్నోల్లయిరి. తనకు మల్ల లగ్గం జేత్తే వాళ్ల పరిస్థితేంటి..? వాల్లను ఎవలు జూసుకుంటారు. పెద్దక్క మనసంత కుటుంబం మీదనే ఉంది.

''అన్నా... నేను కూడా గట్లనే అనుకుంటున్నానే.. '' అన్నది పెద్దక్క తల్లి ముత్తవ్వ.

''పెద్దక్క నువ్వేమనుకుంటున్నావో సెప్పు...?'' అడిగినాడు రామయ్య.

పెద్దక్కకు ఆందోళనగా ఉంది. ఏమ్మాట్లాడాలో అర్థం కావడం లేదు. కొడుకు ఎక్కడున్నాడో వెతుకవలసింది పోయి కోడలుకు మళ్లీ పెండ్లి చేస్తామనడం ఏమిటి..? ఎప్పటికైన తన భర్త తిరిగి వస్తాడనే నమ్మకం ఉంది పెద్దక్కకు.

''పెద్దక్క ఏ రోజు ఎట్లుంటదో చెప్పలేము. నీ బతుకు నవ్వుల పాలు కాకూడదనే సెపుతున్నాం'' మళ్లీ అన్నాడు రామయ్య.

పెద్దక్కకు అర్థమయింది. వయసుమీదున్న ఆడిది ఇంటిమీదుంటే ఏం జర్గుద్దో వీల్లు ముందుగానే ఊహించుకొని చెపుతున్నారు. అయినా వీల్లు కొడుకు గురించి ఆలోచించాలి కాని, కోడలు గురించి ఆలోచిస్తారేమిటి?

''పెద్దక్క నీకు మల్ల లగ్గం జేయాలనుకుంటున్నాం'' అన్నది నర్సమ్మ.

పెద్దక్క మాట్లాడలేదు.

రామయ్య మరోసారి అడిగినాడు.

''మీ కొడుకు వత్తాడనే ఆశ ఉంది'' అన్నది పెద్దక్క.

కొడుకు జోలి తియ్యగానే రామయ్యకు దుఃఖం వచ్చింది. తలకిందికి వంచుకొని లోలోన దుఃఖిస్తున్నాడు. నర్సమ్మ ముఖానికి కొంగు అడ్డం పెట్టుకొని కన్నీళ్లు కారుస్తున్నది.

''ఇంకొన్ని రోజులు జూసినంక అప్పుడాలోసించుకుంటాను'' అన్నది పెద్దక్క.

రామయ్య నర్సమ్మ వెళ్లిపోయినారు.

రోజులు గడుస్తున్నాయి. లచ్చన్న రాలేదు. క్రమంగా లచ్చన్నను మరిచిపోయినారు. పెద్దక్కను రెండో పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి పెరుగుతుంది. అయినా పెద్దక్క పట్టించుకోవడం లేదు. చెల్లెకు ఉన్నంతలో పెండ్లి చేసి అత్తవారింటికి పంపింది. తమ్ముడు గంగాధర్‌కు పెండ్లి చేసింది. పెళ్ళం రాగానే తమ్ముడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పెళ్ళం కొంగుపట్టుకొని తిరుగుతు తల్లిని పెద్దక్కను పట్టించుకోవడం మానేసిండు. దాంతో తల్లి భారం పూర్తిగా పెద్దక్క మీద పడ్డది.

ఓ రోజు రామయ్య మరియు నర్సమ్మ పెద్దమనుషులను కలిసి గంగాధర్‌ ప్రవర్తనను వివరించినారు. పెద్ద మనుషులు పెద్దక్కను, గంగాధర్‌ను, ముత్తవ్వను పిలిపించుకున్నారు. పెద్దక్కను, ముత్తవ్వను పట్టించుకోక పోవడంపై గంగాధర్‌ను మందలించి తల్లి పోషణ బాధ్యతను గంగాధర్‌కు అప్పగించినారు. పెద్దక్కకు మళ్లీ పెండ్లి చేయవలసిందేనని పెద్దమనుషులు పట్టు పట్టినారు.

పెద్దక్క పెండ్లి మీరే నిలవడి చేయాలని రామయ్య పెద్దమనుషులను కోరినాడు.

పెద్దక్క పెండ్లి భారం పెద్దమనుషుల మీద పడడంతో పెద్దక్కకు తగిన వరుణ్ణి వెతకడం ప్రారంభించినారు పెద్దమనుషులు.

పెద్దక్క పెండ్లి వద్దని వారించిన ఎవరు వినడం లేదు.

అదే గ్రామానికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తి సరైన వాడని పెద్దమనుషులు నిర్ధారించినారు.

అన్నతమ్ముళ్లో చంద్రయ్య పెద్దవాడు. చంద్రయ్యకు అంతకు ముందే లగ్గమయింది. ఆమెకు పనిచాతగాదు. పైగా గయ్యాలి. చంద్రయ్య ఆమెకు ఇడుపుకాయితం ఇచ్చేసిండు. చంద్రయ్యకు వ్యవసాయ భూములు లేవు. ఇంటిల్లిపాది కైకిల్జేసుకుని బతుకుతున్నారు.

ఓ రోజు పెద్దమనుషులు చంద్రయ్యను, చంద్రయ్య తల్లిదండ్రులను పిలిపించుకున్నారు. పెద్దక్కను చంద్రయ్యకు చేసుకోవాలని అడిగినారు. చంద్రయ్య ఒప్పుకున్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకున్నారు.

ఊరి వెలపల ఉన్న దేవాలయంలో చంద్రయ్యకు పెద్దక్కకు మళ్లీ లగ్గం చేసినారు.

పెద్దక్కకు కొత్త జీవితం ప్రారంభమైంది. లగ్గమయిన తెల్లారే వేరు పోసినారు. ఒకే గుడిసెలో అందరికి మెసులరాలేదు. గుడిసె పక్కనే మరో గుడిసె వేసుకున్నారు. చేరో కైకిల్జేసుకుంటు ఉన్నంతలో సంతోషంగానే బతుకుతున్నారు. కొన్ని రోజులు గడిసింది. కొడుకు, బిడ్డ పుట్టినారు. ఇంట్లో ఖర్చులు పెరుగుతున్నాయి. సంపాదించేది సరిపోవడం లేదు. బాగా సంపాందించాలనే ఆశ పుట్టింది చంద్రయ్యకు. దుబాయి పోతే బాగా సంపాదించవచ్చుననే నిర్ణయానికి వచ్చినాడు చంద్రయ్య.

ఓ రోజు అదే విషయాన్ని పెద్దక్కకు చెప్పినాడు. దుబాయి అనగానే పెద్దక్కకు లచ్చన్న గుర్తుకు వచ్చిండు. డబ్బు సంపాదించుకవత్తానని బోంబాయి వెళ్లిన లచ్చన్న ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇప్పుడు చంద్రయ్య కుడా గట్లనే అయితే...? పెద్దక్క శోకమేసింది.

పెద్దక్కకు ఎన్నో విధాల నచ్చచెప్పినాడు చంద్రయ్య. ఎన్నో విధాల బుజ్జగించినాడు చంద్రయ్య. అయినా పెద్దక్క ఒప్పుకోవడం లేదు. అడుక్క తిన్నా మంచిదేగాని దుబాయి పోవద్దని పెద్దక్క పట్టువట్టింది.

రోజులు గడస్తున్నకొద్ది చంద్రయ్యకు దుబాయి పోవాలన్న కోరిక పెరుగుతుంది. అందుక్కారణం ఊల్లో నుంచి దుబాయి, సౌది లాంటి దేశాలకు వెళ్లిన వారు ఆర్థికంగా ఓ తీరుగానే ఎదిగిండ్రు. కొందరైతే బాగా రూపాయలు సంపాదించుకవచ్చి వ్యవసాయ భూములు కొన్నారు.

ఓ నాలుగేళ్లు దుబాయి వోతే కనీసం ఇల్లు కట్టుకోవచ్చు. బిడ్డ పెండ్లికి ఇన్ని రూపాయలు జమ చేసుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నాడు చంద్రయ్య. చంద్రయ్య ఏజెంటును కలిసినాడు. ఏజెంటు తొందర్లోనే విజా తెప్పించినాడు. విజా వచ్చిన తరువాత పెద్దక్కకు తెలిసింది.

పెద్దక్క ముసుగు వేసింది. ఎవ్వరితో మాట్లాడడం లేదు. ఆమె ముఖం ఎవ్వరికి చూపించడం లేదు. తిండి పూర్తిగా మానేసింది. చంద్రయ్యకు పెద్దక్క ప్రవర్తన పూర్తిగ నచ్చడం లేదు. ఎంత చెప్పిన వినడం లేదు పెద్దక్క. బంధువుల ద్వారా ఒప్పించే ప్రయత్నం చేసాడు.

''చంద్రయ్య దుబాయి వోతే నాలుగు పైసలు జమయ్యేది మీకే కదా....?'' అన్నారు బంధువులు.

అయిన పెద్దక్క ఎవ్వరి మాట వినడం లేదు. చంద్రయ్య దుబాయి పోకూడదని పెద్దక్క వాదన.

పెద్దక్క వాదనను పట్టించుకోలేదు. అప్పులు చేసి దుబాయి వెళ్లినాడు చంద్రయ్య.

### ### ###

రెండేండ్లు గడిచింది. క్రమంగా పెద్దక్క మనసు కుదుట పడింది. దుబాయి వెళ్లిన చంద్రయ్య రూపాయలు బాగానే పంపినాడు. చేసిన అప్పులు ముట్టినాయి. కొన్ని రూపాయలు జమ అయినాయి. రూపాయలు నిలువ కనిపించేసరికి పెద్దక్కకు ఎంతో సంబురంగా ఉంది.

మరో కొన్ని రోజులు గడిచింది. చంద్రయ్య చుట్టి మీద వచ్చినాడు. వచ్చేటప్పుడు పెద్దక్కకు దుబాయి చీరలు, గడియారం, పిల్లలకు బట్టలు, తల్లిదండ్రులకు బట్టలు ఇంకా ఇతర సామాన్లు తెచ్చినాడు. ఇల్లంత సందడిగా ఉంది. రోజు చుట్టాలు వచ్చిపోతున్నారు. వచ్చిన చుట్టానికి కల్లు, మాంసం కూర వండి పెడుతుంది పెద్దక్క. ప్రతిరోజు నూర్రూపాయల తాటి కల్లు తెప్పిత్తున్నారు.

వారం రోజులు గడిచింది. ఓ రోజు సర్పంచి వచ్చినాడు.

''చంద్రయ్య...! గుడిసెలో ఎన్నేండ్లుంటావు...?'' అన్నాడు సర్పంచ్‌.

''ఇల్లు కట్టుకోవడానికి సరిపోయేటన్ని పైసల్జమయ్యేదాకా'' అన్నాడు చంద్రయ్య.

''పెరుగుతున్న ధరలు సూత్తుంటే సామాన్యులకు ఇల్లు కట్టుకునే తాకతుండకపోవచ్చు''

''సర్పంచాబ్‌... నాకు ఇల్లే అవుసరం లేదు''

''అంటే ఎప్పటికి ఇదే గుడిసెలోనే ఉంటావా...?''

''నాకు పొలం కొనుక్కోవాలనుంది''

''చంద్రన్న... ముందు ఇల్లు కట్టుకో, తరువాత పొలం కొనుక్కో...'' అన్నాడు సర్పంచ్‌.

''మాకు ఇల్లవసరం లేదు. ఈ గుడిసెకు సుట్టు గోడవెట్టుకుంటే సాలు'' అన్నాడు చంద్రన్న.

''గొడ వెట్టుకుంటే ఏమన్న తక్కో ఖర్చత్తదనుకుంటున్నావా...?''

''ఒక ట్రిప్‌ (ట్రాక్టర్‌) ఇటుక తెచ్చుకొని మట్టిటుకతో గోడ వెట్టుకుంటే తక్కోనే కర్చత్తది.. ఇటుకలన్ని ఇల్లు కట్టుకునే నాటికి మళ్లీ పనికొస్తాయి'' అన్నాడు చంద్రయ్య.

''చంద్రయ్య...! రెండుసార్లు కర్సువెట్టుడెందుకు సెప్పు...?''

''ఇల్లు కట్టాలంటే ఎంత లేదన్న మూన్నాల్గు లక్షలన్న గావాలే...''

''గవన్నెందుకయితాయి... లక్షయాబైవేలల్ల అయిపోతుంది'' అన్నాడు సర్పంచ్‌.

అప్పటిదాక పెద్దక్క బీడీల కట్టలు కట్టుకుంటు వారి మాటలు వింటుంది. మౌనం వీడి ''ఎంత తక్కువల అయిన మేమిప్పుడు ఇల్లు గట్టుకోమే'' అన్నది పెద్దక్క.

''అవును నిజమేనే ఇప్పుడు తక్కోల అయితదని ఇల్లు కట్టుకొని అప్పుల పాలవుడెందుకు'' అన్నాడు చంద్రయ్య.

''చూడు చంద్రయ్య... ఇందిరమ్మ పథకం, ఇందిరా ఆవాస్‌ యోజన అని గవర్నమెంటు కొన్ని పథకాలు పెట్టింది. ఆ పథకాల్లో ఇండ్లు గట్టుకున్నోల్లకు అలుకగనే ఇల్లు గట్టుకోవచ్చు'' అన్నాడు సర్పంచ్‌.

అప్పటిదాక తలవంచుకొని బీడి కట్టలు కట్టుకుంటున్న పెద్దక్క తల ఎత్తి సర్పంచి వైపు కోపంగా చూసింది.

పెద్దక్క కోపంగా చూడడంతో సర్పంచ్‌ తల వంచుకున్నాడు.

''మాకు ఇల్లే వద్దు'' అన్నది పెద్దక్క.

ఆ మాటతో అందరు మౌనంగా ఉన్నారు. కొంచెం సేపటి తరువాత మౌనాన్ని వీడి ''చంద్రయ్య.. మీరు ఇల్లు కట్టుకుంటామన్నప్పుడు గవర్నమెంటు పథకాలు ఉంటాయో ఉండవో...?'' అన్నాడు సర్పంచ్‌.

''లేకపోని'' అన్నాడు చంద్రయ్య.

''తిండి గింజలు కొనుక్కోవడానికి ఎన్నోసార్లు పైసల్లేక ఉపవాసమున్నం... పొలం కొనుక్కోవాలనుంది. పొలముంటే తిండికిబ్బందుండదు'' అన్నది పెద్దక్క.

''చంద్రయ్య... నువ్వు మళ్లీ దుబాయి వెళ్ళడానికి విజా ఉంది. ఓ యాడాది కష్టపడ్డావనుకో మొత్తం బాకీలన్ని ముట్టిపోతాయి'' అన్నాడు సర్పంచ్‌.

''యాడాది తరువాతనే ఇల్లు కట్టుకుంటాము'' అన్నాడు చంద్రయ్య.

''చంద్రయ్య...! మొదటిసారి దుబాయి పోవాలంటే లక్ష రూపాయల్గావాలే... నీకు ఆ శ్రమ లేదు. పైగా నువ్వు పోయిన కంపెని మంచిది'' అన్నాడు సర్పంచ్‌.

సర్పంచ్‌ మాటలు పెద్దక్కకు కోపాన్ని తెప్పించాయి. సర్పంచ్‌ వైపు చూస్తు ''అన్నా...! నువ్వెన్ని జెప్పినా మేమిప్పుడు ఇల్లుగట్టుకోమే...'' అన్నది కొంచెం కోపంగా.

అయినా చంద్రయ్యను ఒప్పించడానికి ఎన్నో విధాల ప్రయత్నించినాడు సర్పంచ్‌.

చంద్రయ్య మాట్లాడలేదు.

సర్పంచ్‌ ''మీ ఇష్టం'' అంటూ వెళ్లిపోయినాడు.

చంద్రయ్య ఆలోచనలో పడ్డాడు. సర్పంచ్‌ మాటాడిందాంట్లో నిజమే ఉంది. ఇల్లు ఎప్పుడైన కట్టుకోవాల్సిందే. అది ఇప్పుడే కట్టుకుంటే...? అప్పులవుతాయి. ఆ అప్పులు యాడాదిలో ముట్టిపోతాయి. పెద్దక్క వైపు చూస్తు ''ఇల్లు కట్టుకుందాం'' అన్నాడు చంద్రయ్య.

పెద్దక్క చంద్రయ్య వైపు కోపంగా చూసింది. ''మనకిప్పుడిల్లద్దు ఏమద్దు... పైసల్జమయినంక మా గట్టుకోవచ్చు ఇల్లు'' అన్నది వెటకారంగా.

''సర్పంచి గవర్నమెంటు నుంచి పైసలిప్పిస్తనంటుండు కదా...?'' అన్నాడు చంద్రయ్య.

''గవర్నమెంటిచ్చే పైసలు పునాదికే సాలయి... ఇంకిల్లేం గడుతవు...'' అన్నది పెద్దక్క.

''యాడాది లోపల మొత్తం బాకీలన్ని ముట్టిపోతాయి'' అన్నాడు చంద్రయ్య.

''అప్పుల్జేసి ఇల్లు గట్టుకుంటే'' అన్నది పెద్దక్క కొంచెం సేపాగి ''నీ ఇష్టమచ్చినట్టు సేసుకో'' అన్నది పెద్దక్క రుసరుసలాడుతూ...

చంద్రయ్య ఇల్లు కట్టడానికే నిర్ణయించినాడు. మంచి రోజు చూపించి ఇల్లుకు ముగ్గుపోసినారు. ఇంటి నిర్మాణం మొదలైంది.

కొద్ది రోజుల్లోనే ఇల్లు పూర్తయింది.

మూడు లక్షల రూపాయలు అప్పులయినాయి.

పెద్దక్కకు మనసునవడుతలేదు.

చంద్రయ్య మాత్రం ధైర్యంగానే ఉన్నాడు. మళ్లీ దుబాయి వెళ్ళడానికి విజా ఉంది. ఓ మూడేండ్లు కష్టపడితే బాకీలన్ని ముట్టిపోతాయని చంద్రయ్య నమ్మకం.

### ### ###

చంద్రయ్య దుబాయి వెళ్లి సంవత్సరం గడిచింది. రూపాయలు పంపడం లేదు. పెద్దక్క ఎన్నిసార్లు ఫోను చేసినా పంపుతానంటున్నాడు. కాని రూపాయలు మాత్రం పంపడం లేదు.

ఇల్లు కొరకు తీసుకున్న అప్పులన్ని సంవత్సరం దాటింది. అప్పులకు వడ్డి పెరుగుతుంది. అప్పులిచ్చిన వారు ఇంటికి వచ్చి అసలు సొమ్ము తరువాత ఇచ్చిన మంచిదేగాని వడ్డీ మాత్రం కట్టుమని అడుగుతున్నారు.

''వచ్చే నెలలో పైసలు పంపుతాడట... పైసల్‌ రాగానే కట్టేత్తం'' అంటు రోజులు గడుపుతుంది పెద్దక్క.

రోజులు గడుస్తున్నాయి.

చంద్రయ్య పంపే రూపాయలకోసమెదిరి చూస్తుంది పెద్దక్క.

ఓ రోజు పొద్దుగాలనే జబ్బకు ఓ చిన్న బ్యాగ్‌ వేసుకొని వచ్చినాడు చంద్రయ్య. మాసిన బట్టలు, పెరిగిన గడ్డం, తల వెంట్రుకలు పెరిగి చిందరవందరగా ఉన్నాయి. మనిషి ఆకారమే మారిపోయింది. అతన్ని చూడగానే పెద్దక్కకు ప్రాణం ఎల్లిపోయినంత పనయింది.

చంద్రయ్య వచ్చిన విషయం ఊరంత తెలిసింది. ఒక్కొక్కరు వచ్చి యేం జరిగిందని ఆర తీస్తున్నారు.

''దుబాయి వోయినంక నెల రోజులకే కంపిండ్ల పనయిపోయింది. అక్కడ తిండికే గోసయింది'' అంటూ దుబాయిల మళ్లీ పనికోసం ఎక్కడెక్కడ తిరిగింది చెప్పినాడు.

పెద్దక్కకు దుఃఖం ఆగుతలేదు. శోకం వేసింది. పెద్దక్క ఏడుపును ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకునే స్థితిలో లేరు. ఇంటికి వచ్చిన వారిలో అప్పులిచ్చనవారే ఎక్కో మంది ఉన్నారు. అప్పులిచ్చిన వారికి అలజడి మొదలైంది.

ఎవరు అప్పుకట్టుమని అడుగలేదు. అయినా ''అందరి బాకీలు వడ్డీతోని కడుతాను'' అని నమ్మకంగా హామి ఇస్తున్నాడు చంద్రయ్య.

రోజులు గడుస్తున్నాయి.

చంద్రయ్య ట్రాక్టర్‌ మీద పనికి పోతున్నాడు. పెద్దక్క బీడీలు చేస్తుంది. ఎంత పని చేసిన వడ్డీలు ముట్టడం లేదు.

ఓ రోజు మద్యాహ్నం పూట చంద్రయ్యతో పాటు మరో ముగ్గురు ట్రాక్టర్‌లో ఇసుక నింపుతున్నారు.

చంద్రయ్య చేతిలోని అంచె కిందవెట్టి ''అబ్బ గీడ బాగ నొత్తుందే..'' అంటు చాతిమీద చేతి పెట్టి చూపిస్తు కింద కూలవడ్డాడు.

అందరు చంద్రయ్య దగ్గరికి చేరి లేపి కూర్చోవెట్టి నీళ్లు తాగించినారు. పరిస్థితి విషమించేలా ఉందని గ్రహించి వెంటనే ట్రాక్టర్‌లోని ఇసుక కింద పోసి చంద్రయ్యను ట్రాక్టర్‌లో వేసుకొని దావాఖానకు తీసుకపోయినారు. డాక్టర్లు చంద్రయ్యను పరీక్షించి మరణించినాడని నిర్ధారించినారు.

శవాన్ని తీసుకొని ఊళ్లోకి వెళ్లినారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఊరంత ఉలిక్కిపడింది. ఒక్కసారిగా ఏడ్పులు పెడబొబ్బలు.

''ఓనాయ్యా....

ఓనాయ్యా... నువ్వెంత పంజేత్తివేనాయ్యా...

ఓనాయ్యా... ఓనాయ్యా.... గిట్ల జేత్తవనుకోలేదేనాయ్యా...

ఓనాయ్యా... ఓనాయ్యా పిల్లగాండ్లు సిన్నొల్లయిరేనాయ్యా....

ఓనాయ్యా.... ఓనాయ్యా పిల్లగాండ్లెట్ల పెద్దవెరుగన్నేనాయ్యా...

ఓనాయ్యా... ఓనాయ్యా పిల్లగాండ్లకెట్ల లగ్గంజేయ్యన్నే... నాయ్యా...

ఓనాయ్యా... ఓనాయ్యా ఊరనప్పులుండెగదనే నాయ్యా...

ఓనాయ్యా... ఓనాయ్యా అప్పులొల్లకేంజెప్పన్నే నాయ్యా...

ఓనాయ్యా... ఓనాయ్యా అప్పులోల్లకు నా మొఖమెట్ల సూపియ్యన్నేనాయ్యా....

ఓనాయ్యా... ఓనాయ్యా నన్నెక్కడగాకుంటజేత్తివేనాయ్యా...

ఓనాయ్యా... ఓనాయ్యా నలుగుర్ల నవ్వులపాల్జెత్తివే నాయ్యా....

ఓనాయ్యా... ఓనాయ్యా'' పెద్దక్క ఏడుపు వర్ణించలేనిది.

పెద్దక్క జీవితంలో ఆమెకు మిగిలింది దుఃఖమే.

- నేరెళ్ల శ్రీనివాస్‌గౌడ్

English summary
A short story writer Nerella Srinivas Goud in his telugu short story 'Peddakka' (Elder sister) narrates the migration and its consequences
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X