అనేక ముంబైల కన్నీళ్ళ తరవాత...

ఇంకా...ఇంకా...
ఇంకా రాలేదు.
ఈ నగరం నా కళ్ల కింద
నా కాళ్ళ కింద మంట
నాన్న ఇంకా ఇంటికి రాలేదు
చీటికి మాటికి వెనక్కి తిరిగి
గోడ మీది గడియారంతో మాట్లాడుతోంది అమ్మ
దాని ముళ్లలోకి మిర్రి మిర్రి చూస్తుంది
ఎనిమిది...తొమ్మిది...పది...
నాన్న ఇంకా రాలేదు.
అమ్మ క్షణాల్ని లెక్కపెడుతుందో
టీవీలో చూస్తున్న
శవాల్ని లెక్కపెడుతుందో తెలీదు.
వచ్చేయ్ నాన్నా!
ఇప్పుడే కాల్చిన రొట్టెల వాసన
ఇప్పుడే నూరిన గోంగూర పచ్చడి
ఆకలి జమాయించేస్తోంది నాన్నా,
నువ్వు రాకుండా ముద్ద ముట్టనివ్వదు అమ్మ.
తొరగా వచ్చేయ్ నాన్నా!
అమ్మ వీపు తలుపుకి అతుక్కుపోతోంది
ఇప్పుడే ఇదిగో
అనేసి వెళ్ళి చాలా సేపయ్యింది కదా,
నాన్న ఇంటికి రాలేదు.
"అమ్మా! ఆకలే!"
'వూరెలా వుందో తెలుసా?
ఎప్పుడూ ఆకలి ఆకలి
నన్నూ చంపి కొరుక్కుని తిన్రా..."
కేకేసి, ఆ తరవాత అమ్మ ఇలా గొణుక్కుంది
"ఇంకా కాలేదు
ఇంకా కాలలేదు
కుప్పలుగా పోసిన శవాలు
మంటల దుప్పట్లు ఇంకా ఆరలేదు ఆరలేదు
కాల్తూనే వున్నాయి....47 నించీ..."
- డాక్టర్ అఫ్సర్












Click it and Unblock the Notifications